Wednesday, December 25, 2024

మారీచుడిని మట్టుపెట్టిన రాముడు

  • ప్రాణాలు వదులుతూ అయ్యో సీతా, అయ్యో లక్ష్మణా అంటూ రాముడి గొంతును అనుకరిస్తూ కేకలు వేసిన మాయావి
  • పరుగుపరుగున ఆశ్రమంవైపు సాగిన రాముడు

రామాయణమ్75

లక్ష్మణుడిమాటలకుఅడ్డుతగులుతూ, రామునితో …

‘‘ఆర్యపుత్రా, ఎంత చూడ చక్కగా ఉన్నదో చూడు! ఈ మృగము బాల సూర్య సమ ప్రభలతో మెరిసిపోతున్నది. దానిని చూడగానే నా హృదయము మురిసి పోతున్నది. అయోధ్యలో మన అంతః పురములో ఇది ఉంటే ఎంత బాగుండును అని అనిపిస్తున్నది. అత్తగార్లకు, భరతుడికి ఇది గొప్ప కనువిందు కాగలదు. ఒక వేళ సజీవముగా మనము దీనిని పట్టుకోలేక పోతే దీని చర్మమైనా మనకు మిగులుతుంది. అప్పుడు మెత్తని లేతగడ్డి పరుచుకొని దీని మీద కూర్చుంటే అబ్బ,  ఎంత సుఖముగా ఉంటుందో కదా. ఆర్యపుత్రా దీనిని పట్టి తెమ్ము’’  అని సీతాదేవి పలుకుతుంటే రాముడు కూడా దాని మీదనుండి దృష్టి మరల్చుకోలేక పోయాడు.

Also read: సీతమ్మ కంటబడిన మాయలేడి

మణిమయ కాంతులు వెదజల్లే దానికొమ్ములు, బంగారు వన్నెలతో మెరిసిపోతున్న శరీరము, ఆయన మనస్సును కూడా ఆకర్షించింది.

సీతాదేవి ఇంతగా ప్రేరేపిస్తుంటే లక్ష్మణునితో అంటున్నాడు రాముడు:

‘‘లక్ష్మణా ,అదుగో చూడు మీ వదిన ఎంతగా ముచ్చట పడుతున్నదో. అసలిలాంటి మృగము నందనవనములోగానీ, మరి ఏ ఇతర దేవతల ఉద్యాన వనాలలో గానీ ఉండదు.  మరి భూలోకములో ఎట్లా ఉంటుంది? అదుగో చూశావా? అది ఆవులించి నప్పుడు దాని నోటినుండి అగ్నిజ్వాల వలే ప్రకాశిస్తూ నాలుక బయటకు వస్తున్నది. దాని వంటి మీద వెంట్రుకలు చూడు బంగారుచుక్కలచేత రమ్యముగా ఉన్నవి. దాని పొట్ట శంఖములా ఉన్నది చూడు. ముట్టే ఇంద్రనీలాలు పొదగబడిన పాత్రలా ఉన్నది.  ఓహ్, దీని సౌందర్యము మనస్సును విపరీతముగా ఆకర్షిస్తున్నది.

‘‘లక్ష్మణా, ఇంత అందమైన మృగము మనకు గొప్ప సంపద కాగలదు.

Also read: మారీచుని చంపుతానని బెదిరించిన రావణుడు

ఎవడు ముందు వెనుకలు ఆలోచించకుండా ముందుకుపోయి ధన సంపాదన చేయునో ఆ సంపాదనే సంపాదన. అదియే ధనమని అర్ధశాస్త్ర నిపుణులు చెపుతారు. ఈ జింక చర్మము మీద నేను, సీత కూర్చోవాలని నా మనస్సు తహతహ లాడుతున్నది. ఒక వేళ నీవు చెప్పినట్లు ఇది మారీచుడే అయిన కానిమ్ము, ఈ రోజుతో వాడిఆయువుమూడినట్లే అనుకొమ్ము. అగస్త్యుడి చేతిలో వాతాపి మరణించి నట్లు నాచేతిలో మరణించగలడు. లక్ష్మణా, నీవు సావధాన చిత్తుడవై ధనుర్బాణములు ధరించి సీతను కాపాడుతూ ఉండు. నేను దీనిని వేటాడతాను’’ అని పలికి బంగారు ఖడ్గాన్ని నడుముకు కట్టుకొని మూడు వంపులున్న ఒక ధనుస్సు చేతబూని రెండు అమ్ములపొదులు ధరించి బయలుదేరాడు శ్రీరామచంద్రుడు.

కోదండ పాణి బయలుదేరాడు,

బంగారుపిడిగల ఖడ్గము, ధనుస్సు ధరించి మృగమును చూస్తూ దానిని పట్టుకోవాలని తలపోస్తూ దాని వెంట నడిచాడు. అది తప్పించుకొని చెంగుచెంగున గెంతుతూ దూరముగా కనపడకుండా వెళ్ళిపోయింది. అరే కనపడలేదే! అని రాముడు అనుకునే లోపు మరలా దగ్గరగా ప్రత్యక్ష మయ్యేది. దానిని పట్టుకుందామని చూస్తే దొరకకుండా దూరము వెళ్ళేది. అది ఆ విధముగా రాముడిని ఆశ్రమము నుండి చాలా దూరము తీసుకు వెళ్ళింది.

Also read: రావణుడికి మారీచుడి హితబోధ

మబ్బులలో దాగుకున్న చంద్రుడు కాసేపు మబ్బులలో ఉండి, కాసేపు బయటకు వచ్చి ఏ విధముగా దోబూచులాడుతుంటాడో ఆ విధముగా కనపడీకనపడకుండా, దగ్గరగా కాసేపు దూరముగా కాసేపు ఆటలాడుకుంటూ తీసుకెళ్ళింది. అప్పటికే చాలా దూరము దానివెంట పరుగెత్తిన రాముడు అలసటతో ఒక పచ్చిక బయలు మీద కూర్చున్నాడు.

మరల ఆ మృగము అల్లంత దూరములో కొన్ని ఇతర మృగాలలో కలిసి తిరుగుతున్నట్లుగా కనపడింది. అది తన చేతికి అందదు అనే విషయము అప్పటికే ఆయనకు అర్ధమయ్యింది. ఇక దానిని చంపేయాలని నిశ్చయించుకున్నాడు.

బాణాన్ని అమ్ములపోదినుండి బయటకు తీశాడు. దృఢమైన ధనుస్సుపై ఎక్కుపెట్టాడు. ఆకర్ణాంతం లాగి వదిలాడు. అది బుసలు కొడుతున్న త్రాచుపాములా రయ్యిన గాలిని చీల్చుకుంటూ వెళ్లి ఆ మృగము శరీరాన్ని భేదించి దాని హృదయాన్ని బద్దలు కొట్టింది. రామబాణము ఎప్పుడైతే దాని శరీరాన్ని తాకిందో అప్పుడే రాక్షస మాయకూడా తొలగిపోయి భయంకర రూపముతో కొండలాగా ఉన్న మారీచుడు బహిర్గతమైనాడు.

Also read: సీతాపహరణానికి రావణుడిని ప్రేరేపించి పంపిన శూర్ఫణఖ

ఆ బాణపు దెబ్బకు విలవిలలాడుతూ తనకు చివరి క్షణములు దగ్గర పడ్డాయని గ్రహించాడు మారీచుడు. ఆ సమయములో కూడా వాడు స్వామి భక్తి ప్రదర్శించాడు. రావణుడి కార్యము నెరవేరాలంటే ఏమి చెయ్యాలో ఆలోచించాడు. ఏమి చేస్తే సీతాదేవి లక్ష్మణుని ఇక్కడికి పంపుతుంది? అని బుర్రకు పదును పెట్టాడు.

రాముడు ఆపదలో ఉన్నాడన్న భావము ఆవిడ మదిలో కలుగ చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే స్వరము మార్చి రాముని గొంతును అనుకరించాడు.

అయ్యో సీతా, అయ్యో లక్ష్మణా ..అని ఆ వనమంతా ప్రతిధ్వనించేటట్లు, గావుకేకలు పెట్టి ప్రాణము వదిలాడు.

చూడటానికే భయంకరముగా ఉన్న ఆ కళేబరాన్ని చూసి వాడు మారీచుడు అని గుర్తు పట్టాడు రాముడు. తమ్ముడు చెప్పిన విషయము గుర్తుకు వచ్చింది. వాడు అరచిన అరపులు ఎక్కడికి దారితీస్తాయో అని ఒక ఊహ ఆయన మదిలో మెదిలింది. ఒక్కసారిగా వళ్ళు జలదరిచింది.

ఎందుకో మరి! కొన్ని ఆలోచనలు ఆయనలో ఒక దుఃఖాన్నీ, భయాన్నీ కలుగ చేసాయి. వెంటనే వడిగా, వడివడిగా ఆశ్రమము వైపు పరుగు తీశాడు రాముడు.

Also read: రావణాసురిడిని తూలనాడిన శూర్పణఖ

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles