- పలాయనం చిత్తగించిన అధ్యక్షుడు గొటబాయ
- రాజీనామాకు సిద్ధపడిన రణీల్ విక్రమసింఘే
- చైనాకు దగ్గరై దేశసంపదను దోచుకున్న రాజపక్స సోదరులు
“కారే రాజులు రాజ్యముల్ గలుగవే.. గర్వోన్నతిం పొందరే.. వారేరీ? సిరి మూటగట్టుకొని పోవం జాలిరే.. భూమిపై పేరైనం కలదే? ” అని మన పోతనామాత్య ఏనాడో గొప్పగా చెప్పాడు. బొర్ర బలిసి విర్రవీగే వారిని చూసినప్పుడల్లా ఈ పద్యం గుర్తుకురాక మానదు. నిన్న బ్రిటన్ లో బోరిస్ జాన్సన్, నేడు శ్రీలంకలో గొటబాయ రాజపక్స. దేశాలు వేరైనా, వ్యతిరేకతా విధానంలో కొన్ని తేడాలున్నా ప్రజాగ్రహమే వారి పతనానికి మూలకారణం. శ్రీలంకలో కేవలం గొటబాయ ఒక్కరిపైనే కాదు, మొత్తం ఆ రాజపక్స కుటుంబంపైనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇలా ప్రజాగ్రహానికి కుప్పకూలిన అధికార హర్మ్యాలు, నివాసభవనాలు ఎన్నో ఉన్నాయి. నాటి రాజుల పాలనలోనూ నేటి రాజకీయ నాయకుల పరిపాలనలోనూ ఈ ఉదంతాలు ఉన్నాయి.ఇటీవల కాలంలోనే అటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
Also read: హేయమైన హత్య
ఇతర దేశాలలోనూ ఇటువంటి సంక్షోభమే
కజకస్థాన్,యెమెన్,ఉక్రెయిన్, ఈజిప్ట్,ఫిలిప్పీన్స్ మొదలైన దేశాలలో అధినేతల నివాస భవనాల్లోకి ప్రజలు చొరబడి తమ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వాళ్ళు కొందరు అధికారాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇరాక్, లెబనాన్, సుడాన్, గాంబియా మొదలైన దేశాల్లో ఏలికలు తమ పదవులను అర్ధాంతరంగా వదిలి సింహాసనాలు దిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. పాలకులలో, పాలనలో అహంకారం, అవినీతి, అసమర్ధత వంటివి అతిగా ఆక్రమించినప్పుడు వ్యతిరేకతలు విభిన్న రూపాల్లో విక్రమిస్తాయి. ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి,స్వపక్షాల నుంచి కూడా ఈ ముప్పు తప్పదు. తాజాగా బ్రిటన్ లో బోరిస్ జాన్సన్ పైన వచ్చిన తిరుగుబాటు ఇందుకు ఒక ఉదాహరణ. శ్రీలంకలో వచ్చిన తిరుగుబాటు ఇంకా ఎన్నోరెట్లు పెద్దది. ఇది ప్రపంచ ప్రజలు విస్మయంగా, వేదనతో చూస్తున్న పెను విషాదం. శ్రీలంకలో ఈ కల్లోలానికి రష్యాయే కారణమనే విమర్శలు ఉన్నప్పటికీ, మన బంగారం మంచిదై వుంటే ఈ దుస్థితి వచ్చేది కాదని అక్కడి ప్రజలు కూడా విలపించడంలో అర్ధముంది. ముఖ్యంగా రాజపక్స కుటుంబపెత్తనమే కొంపముంచింది. ఆ కుటుంబంలోని ఆ నలుగురు ఆ దేశాన్ని నలిపేశారు. ప్రజల జీవితాన్ని చిదిమేశారు. మహిందా,గొటబాయ,చమల్, బసిల్.. వీరే ఆ అపూర్వ సహోదరులు. వీరు చేసిన దుష్కృత్యాలకు ప్రజలు అన్నామో రామచంద్రా.. అంటూ రోడ్డున పడ్డారు.శ్రీలంక ప్రజలు ఎదుర్కుంటున్న సంక్షోభాన్ని చూస్తే గుండెలు తరుక్కుపోతున్నాయి.
Also read: ఎట్టకేలకు గద్దె దిగిన బోరిస్ జాన్సన్
కోట్లకు పడగలెత్తిన రాజపక్స సోదరులు
వారి జీవితాలు ఎటుచూసినా చీకటిమయంగానే ఉంది. రాజపక్స సోదరులు మాత్రం కోట్లకు పడగలెత్తారు.అధికారం, విందువిలాసాలతో కులాసాలు చేసుకున్నారు. ఆ తీరే నేడు వారిని కోడెనాగై కరిచింది. ఇళ్ళు వదిలి పారిపోయే పరిస్థితిని తెచ్చింది. 2009లో తమిళ వేర్పాటువాద ఉగ్రవాద సంస్థ ఎల్ టి టీ ఈ నిర్మూలమైంది. సింహళ జాతీయవాదులు రాజపక్సలకు మద్దతుగా నిలిచారు. ఆ దేశ రాజకీయాల్లో ఆ కుటుంబానిది కీలక స్థానం. ప్రజల మద్దతుతో అధికార పగ్గాలు ఆ కుటుంబం చేతికి వచ్చాయి. సోదరులంతా కీలకపదవుల్లో తిష్ఠ వేసేశారు. చైనా అధినేతలతో కుమ్మక్కైపోయారు. టూరిజం మొదలైన ఆదాయ వనరులను గమనించిన చైనా అదే సందుగా శ్రీలంకలో పెట్టుబడులు కుమ్మరించింది. రాజపక్స సోదరులందరూ ఎవరి వాటాలు వారు కొట్టేశారు. హంబన్ టోటాలో శ్రీలంక ప్రభుత్వం భారీ నౌకశ్రాయాన్ని నిర్మించింది. చైనా దానికి ఆర్ధిక హస్తం అందించింది. ఆ తర్వాత చెల్లింపులు సక్రమంగా చేయలేని పరిస్థితి లోకి శ్రీలంక వచ్చేసింది. వచ్చేసిందా? తెచ్చారా? కాలంలో తేలాల్సివుంది. ఈ నౌకాశ్రయాన్ని 99ఏళ్ళ పాటు లీజుకు ఇస్తూ చైనాకు ధారాదత్తం చేసేశారు. సేంద్రియ ఎరువులతోనే వ్యవసాయం చేయాలంటూ రాజపక్స ఆదేశాలిచ్చిన క్రమంలో ఇతర దేశాల నుంచి వచ్చే ఎరువులు ఆగిపోయాయి. పంటల దిగుబడి కుదేలైపోయింది. ఆహారపదార్ధాల కొరత పెద్దఎత్తున ఏర్పడింది. ప్రజలు రోడ్డున పడ్డారు. పన్నుల విధానాలను కూడా అస్తవ్యస్తంగా రూపొందించారు. అది కూడా వికటించింది. ప్రపంచంలోని అనేక ఆర్ధిక సంస్థల నుంచి కూడా అప్పులు తెచ్చారు. వాటికి కనీసం వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితి వచ్చింది. దేశంలోని అన్ని రంగాలు కుదేలైపోయాయి. ప్రజల్లో అశాంతి కట్టలు తెంచుకుంది ప్రజాగ్రహం దావానలంలా వ్యాపించింది. సునామీలా ఎగసి పడింది. చివరకు అధ్యక్షభవనాన్నే ప్రజలు చుట్టుముట్టేంత సంక్షోభం వచ్చింది. అధ్యక్షుడు పారిపొయ్యాడు. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న రణిల్ విక్రమ సింగేకు పాలనాపరమైన అనుభవం ఉంది. కానీ నేటి పరిస్థితుల్లో ఆ దేశాన్ని నడిపించడం ఆషామాషీ కాదు. గొటబాయ రాజపక్స నియమించిన అతను కూడా పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయినప్పటికీ ఆయన నివాసానికి కూడా ప్రజలు నిప్పుపెట్టారు. అధ్యక్షుడు గొటబాయ ఈ నెల 13 వ తేదీన దిగిపోతానని ఇప్పటికే ప్రకటించేశారు.
Also read: వినాశకాలే విపరీత బుద్ధి
శాంతించాలని ప్రజలకు సైన్యాధిపతి పిలుపు
ప్రజలు శాంతి వహిస్తే వారి మద్దతుతో, సైన్యం, పోలీసుల సహకారంతో రాజకీయ సంక్షోభానికి ముగింపు పలుకుతామని ఆ దేశ అర్మీ చీఫ్ జనరల్ శవేంద్ర సిల్వ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ దిశగా ముందుకు రావాలని అందరికీ పిలుపునిచ్చారు. ఏమవుతుందో చూడాలి. అప్పులు,అధిక ధరలు, ఆహార ధాన్యాల కొరత, పడిపోయిన ఉత్పత్తి, దెబ్బతిన్న పర్యాటకం.. ఇలా ఎన్నో తలనొప్పులు ఉన్నాయి. ఆ దేశం కష్టంలో ఉన్న ప్రతిసమయంలోనూ భారత్ అండగా నిలబడింది. ఆర్ధికంగా ఆదుకోవడమే కాక, పెట్రోల్, ఆహార ఉత్పత్తులను కూడా మన దేశం అందిస్తోంది. ప్రస్తుతం తీవ్ర ఆందోళనలు, సంక్షోభంతో వణికిపోతున్న వేళ అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. మన పక్క దేశమైన శ్రీలంక సమస్య సత్వరమే ముగిసిపోవాలని కోరుకుందాం. పూర్వ వైభవం రావాలని ఆకాంక్షిద్దాం. శాంతి వేళ్లూనుకోవాలని అభిలషిద్దాం.శ్రీలంక సంక్షోభం ప్రపంచ దేశాల పాలకులకు, ప్రజలకు/ఓటర్లకు పెద్ద గుణపాఠం. దేశభక్తిలేని అధికార మదాంధులను, అవినీతి పరులను, అతిస్వార్ధపరులను, దురహంకారులను అందలమెక్కించకుండా ఉండడమే దీనికి తరుణోపాయం. మితిమీరిన ఆర్ధిక స్వార్ధం, సామ్రాజ్య విస్తరణా కాంక్ష కలిగిన దేశాలతో బహుజాగ్రత్తగా వ్యవహరించడమే వివేక విదేశాంగ విధానం.
Also read: మణిపూర్ లో మరణమృదంగం