- పాలకులే పీడకులై దేశాన్న అధోగతికి దిగజార్చిన వైనం
- బృహత్ సంకల్పం, సిసలైన స్నేహసహకారం అత్యవసరం
- చైనా, భారత్ లో ఏది విలువలు కలిగిన మిత్రదేశమో పాలకులు గ్రహించాలి
మన పొరుగుదేశమైన శ్రీలంకకు రణిల్ విక్రమసింగే కొత్త అధ్యక్షుడుగా వచ్చిన సంగతి తెలిసిందే. పరమ దయనీయమైన, విషాదకరమైన పరిస్థితిలో ఆ దేశం ఉంది. ఆ దేశాన్ని మళ్ళీ పైకి లేపాలంటే చాలా ఏళ్ళు పడుతుంది. నిన్నటి దాకా పాలకులుగా వున్న రాజపక్స సోదరుల వికృత చేష్టలతో సింహళీయులు వీధిన పడ్డారు. అంతర్జాతీయంగా ఆ దేశ పరపతి అతఃపాతాళంలోకి వెళ్లిపోయింది. ఆర్ధికంగా అంధకారంలో ఉంది. సరికొత్త ఆర్ధిక విధానాన్ని రూపొందించుకొని పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ముందుకు సాగాల్సివుంది. ఆ దిశగా ముందుకు వెళ్తామని కొత్త అధ్యక్షుడు తాజాగా శ్రీలంక పార్లమెంట్ లో ప్రకటించడం స్వాగతించతగిన పరిణామం. ఎగుమతుల వైపు ఎక్కువగా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.
Also read:ఉదయశ్రీ కరుణశ్రీ ఉదయించిన సుదినం
అఖిలపక్ష ప్రభుత్వం అవతరించాలి
దేశాన్ని గట్టెక్కించాలంటే అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటే శరణ్యమని అక్కడి నాయకులందరికీ అర్ధమైంది. ఈ దిశగా త్వరలో అక్కడ ప్రభుత్వ నిర్మాణం జరగాల్సివుంది. ఒకరకంగా ఈ తరహా నిర్మాణం ఒక ప్రయోగమని భావించాలి. పాలకులే ప్రజలకు శత్రువులుగా మారి దేశాన్ని పాడుచేసిన వేళ, ఇప్పుడు అందరూ కలిసి బాగుచేసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. సఫలమైతే మంచి ప్రయోగమే అవుతుంది. మిగిలిన దేశాలకు ‘కేస్ స్టడీ’ లా ఉపయుక్తమవుతుంది. అమెరికా వంటి అగ్రరాజ్యాలకే ఆర్ధికమాంద్యం భయం పట్టుకొన్న వేళ శ్రీలంక వంటి దేశాలకు పురోగతి అతిపెద్ద సవాల్ గా నిలవనుంది. అప్పులఊబిలో కూరుకుపోయిన ఆ దేశానికి ‘అంతర్జాతీయ ద్రవ్యనిధి’ (ఐ ఎం ఎఫ్) వంటి సంస్థల విశ్వాసాన్ని తిరిగి తెచ్చుకోవాల్సిన పెద్ద బరువు తలపై ఉంది. కొత్త ప్రభుత్వం రూపొందించే ‘జాతీయ ఆర్ధిక విధానం’ అన్ని సమాజాలను ఆకట్టుకొనేలా ఉండాలి. స్వదేశంలో ఆచరణయోగ్యంగా ఉండాలి. విదేశీ పెట్టుబడుల విషయంలో ఆ దేశంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడులను స్వాగతించకపోతే అభివృద్ధి అందని ద్రాక్షగా మిగిలిపోతుంది. పెట్టుబడులను ఆహ్వానించే క్రమంలో, ఆ యా దేశాల నైతిక వర్తన, గత చరిత్రను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. చైనాను నమ్ముకున్నందుకు చారిత్రకమైన దెబ్బతిన్న అనుభవాలు ఎదురుగా కనిపిస్తునే ఉన్నాయి. నిజమైన స్నేహితులెవరో కష్టాల్లో ఉన్నప్పుడే అనుభవంలోకి వస్తుంది. ఈ కష్టకాలంలో శ్రీలంకను శక్తిమేరకు ఆదుకున్న దేశం భారత్. మన దేశం ఇప్పటి వరకూ అందించిన ఆర్ధికసాయం 400కోట్ల డాలర్లకు పైనే ఉంటుంది. ఈ విషయాన్ని కొత్త అధ్యక్షుడు కూడా అర్ధం చేసుకున్నాడు. గడ్డు రోజుల్లో ఆ దేశానికి కొత్త ఊపిరి ఊదినందుకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా ప్రకటించారు. గతంలో ట్రింకోమలీ రేవులో చమురు ట్యాంక్ కాంప్లెక్స్ నిర్మాణం తలపెట్టినప్పుడు సహాయం అందించడానికి భారత్ ముందుకు వచ్చింది. ఆ సమయంలో భారత్ కు శ్రీలంక అమ్ముడుపోయిందనే విమర్శలు పెద్దఎత్తున రేపారు. దానితో ఆ నిర్మాణం ఆగిపోయింది. ఆ ప్రాజెక్టు నిర్మాణమై ఉండివుంటే, ఈరోజు పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలు రోజుల తరబడి బారులు తీరే దుస్థితి తప్పేది. ఇదే అభిప్రాయాన్ని శ్రీలంక కొత్త అధ్యక్షుడు రణిల్ కూడా వ్యక్తపరిచారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. భారత్ వంటి నైతిక విలువలు కలిగిన దేశంతో ప్రయాణం చేస్తే మంచి జరుగుతుంది. ఆ దేశం ఇంత స్థాయిలో దివాలా తీయడానికి ప్రధానంగా ముగ్గురు కారణం. మాజీ ప్రధాని మహింద రాజపక్స, మాజీ ఆర్ధిక మంత్రి బసిల్ రాజపక్స, కేంద్ర బ్యాంక్ మాజీ గవర్నర్ అజిత్ కాబ్రాల్. దివాలాకు వీరే కారణమంటూ ఆ దేశ సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటీషన్ దాఖలైంది. వారి విదేశీ ప్రయాణాల పైన నిషేధం అమలులో ఉంది. ఈ ప్రబుద్ధుల సంగతి అటుంచగా, దేశ పురోగతి వైపు అందరూ కలిసి సాగాల్సివుంది.
Also read: అల్ ఖైదా అధినేత అల్ – జవహరీ అంతం
ప్రజల అభీష్టం ప్రధానం
ప్రజల అభీష్టాల మేరకు నడిచి ప్రజాబలాన్ని కూడగట్టు కోవాల్సివుంది. శ్రీలంకకున్న ప్రధాన ఆదాయమార్గాల్లో పర్యాటకం ముఖ్యమైంది. టీ, కాఫీ, రబ్బరు, కొబ్బరికాయల వంటి ఎగుమతి మరో ముఖ్యమైన మార్గం. యాలకులు, లవంగాలు, కర్పూరం, లక్క, మిరియాలు, పచ్చరత్నాలు మొదలైనవి గతంలో ఎక్కువగా ఎగుమతి చేసేవారు. వ్యవసాయం ఇంకొక ముఖ్య ఆదాయ రూపం. అన్ని మార్గాలను ఒడిసిపట్టుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. ‘శ్రీలంక’ మంచిపేరు. అందులోనే ‘శ్రీ’ ఉంది. శ్రీ అంటే ఐశ్వర్యం, వైభవం మొదలైన అర్ధాలు ఎన్నో ఉన్నాయి. లంక అంటే తేజస్సు కలిగిన భూమి లేదా ద్వీపం అని చెబుతారు. ఇవి ఊరకే పేరుకే పరిమితం కాక, నిజంగానే ప్రభవించాలి. దక్షిణ భారతానికి – శ్రీలంకకు సంస్కృతిలో ఎన్నో సారూప్యాలు ఉన్నాయి. మన తీరానికి కేవలం 31కిలోమీటర్ల దూరంలోనే శ్రీలంక ఉంది. తెలుగువారికి కూడా ఎంతో అనుబంధం ఉంది. గుణాడ్యుడు రాసిన ‘బృహత్ కథ’లో చాలా వివరాలు ఉన్నాయి. పూర్వ చరిత్రను గమనిస్తే శ్రీలంక – భారత్ మధ్య పెనవేసుకున్న బంధాలు ఎన్నో అవగతమవుతాయి. శ్రీలంక పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని ఆకాంక్షిద్దాం. మన ఇరు దేశాల మధ్య అనుబంధం ద్విగుణీకృతమవుతుందని ఆశిద్దాం.
Also read: పింగళిది ‘పతాక’స్థాయి