గుండెపోటుతో ఆకస్మిక మృతి
ప్రముఖ పాత్రికేయులు,సృజన గ్రూపు పత్రికల అధినేత శ్రీ నీలం దయానంద రాజు (64) సోమవారం ఉదయం గుండె పోటులో హఠన్మరణం చెందారు. పత్రికా రంగంలో దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి సేవలందిస్తున్న ఆయన పాత్రికేయ వృత్తికే వన్నెతెచ్చే విధంగా అత్యంత నిజాయితీగా పత్రికలు నడుపుతున్నారు. చిన్నతనం నుంచి జర్నలిజం పట్ల మక్కువతో , అపారమైన గౌరవంతో ఈరంగంలోకి ప్రవేశించిన ఆయన 1985లో దాదాపు దశాబ్దం పాటు ఆంధ్రజ్యోతి, ఉదయం దినపత్రికల్లో ఉపసంపాదకుడిగా పనిచేశారు. అక్కడ సంపాదించిన అపారమైన అనుభవం, జర్నలిజం, భాషపట్ల మెలకువలు ఆయనను పత్రికాధినేతగా అడుగులు వేయడానికి పునాదులు వేసాయి. యువతరం ఉరకలెత్తే వయస్సులో ఉదయం దినపత్రికలో పాత్రికేయుడిగా నేర్చుకున్న అనుభవ పాఠాలు ఆయన పత్రికా ప్రస్థానానికి నాందీ పలికింది. 1995లో అనుకోని పరిస్థితుల్లో ఉదయం పత్రిక మూతపడడంతో ఒక పత్రికను స్థాపించాలనే ధృడసంకల్పంతో 1996 ఏప్రిల్ 8వ తేదీన మహానటుడు, నటసమ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు అమృత హస్తాలతో హైదరాబాద్ బిర్లా ఆడిటోరియంలో కన్నుల పండువగా జరిగిన ఒక కార్యక్రమంతో ‘సృజనప్రియ’ పత్రిక ను ప్రారంభించారు.
ఆ పత్రిక విశేషమైన ప్రజాదరణ పొందడంతో సృజన నేడు దిన ప్రతికను కూడా ప్రారంభించి నిస్వార్ధంగా జర్నలిజం వృత్తికి అంకితమయ్యారు.
ఉన్నత విలువలకు కట్టుబడి ఒక నిబద్ధత, సిద్ధాంతాలతో విలువలతో కూడిన జర్నలిజంతో సమాజ సంక్షేమమే ధ్యేయంగా పదునైన కలంతో రచనలు సాగించి, అవినీతి, అక్రమాలు, సమాజంలోని కుళ్ళుని, స్వార్ధ రాజకీయాలను చీల్చి చండాడడంలో అనునిత్యం వత్తిడిని ఎదుర్కొంటూ ప్రభుత్వాలను ఎప్పటికప్పుడూ సద్విమర్శలతో మేల్కొల్పుతూ జాతిని జాగృతం చేయడానికి తన తుది శ్వాస వరకు పరిశ్రమించారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్, వెల్ఫేర్ కల్చరల్ ఆర్గనైజేషన్‌కు ప్రముఖ పాత్రికేయులు తుర్లపాటి కుటుంబరావు గౌరవాధ్యక్షుడిగా వుండగా, నీలం దయానంద రాజు అధ్యక్షుడిగా ఉండి పలు కార్యక్రమాలు నిర్వహించారు. నీలం దయానంద రాజు మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, పాత్రికేయులు సంతాపం వ్యక్తం చేశారు. నీలం దయానంద రాజుకు భార్య ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం ఉదయం హైద్రాబాద్ లో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.