ఇటీవల కాలంలో అధికార వైఎస్సార్ సిపిలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు చేరారు. వారి చేరిక కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గైర్హాజరు కావడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పైపెచ్చు పార్టీలో చేరిన ఒక నాయకుడికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈముగ్గురు నాయకులు ఎంపి మార్గాని భరత్ ప్రోద్బలంతో పార్టీలో చేరినట్లు చెబుతున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే రాజా, భరత్ వర్గాల మధ్య మళ్లీ ఆధిపత్యపోరు మళ్లీ ప్రారంభమైనట్లు కనిపిస్తోంది.
పేపరుమిల్లులో కార్మికుడిగా, నాయకుడిగా పనిచేస్తున్న చిట్టూరి ప్రవీణ్ చౌదరి, ఫైనాన్స్ వ్యాపారి ఇన్నమూరి ప్రదీప్ ఇటీవల భరత్ సమక్షంలో వై సిపిలో చేరారు. ప్రవీణ్ చౌదరి తాత దివంగత చిట్టూరి ప్రభాకరచౌదరి రాజమహేంద్రవరం తొలి ఎమ్మెల్యే. ప్రవీణ్ తండ్రి స్టాన్లీ చౌదరి పేపరుమిల్లులో కార్మిక నాయకుడిగా గుర్తింపు పొందారు. తాతతండ్రులు ఇద్దరూ కమ్యూనిస్టు నాయకులే కావడం విశేషం. అయితే రాజకీయ, అర్థజ్ఞానం ఎక్కువగా ఉన్న ప్రవీణ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. మిల్లులో ఉద్యోగాల భర్తీ విషయంలో ఆయనపై పలు ఆరోపణలు రావడంతో అధికార పార్టీ పంచన చేరారని చెప్పుకుంటున్నారు. మొన్నటి వరకు తన వెనుక తిరిగిన ప్రవీణ్ చౌదరిపై టిడిపి నేత గన్ని కృష్ణ ఫిర్యాదు చేయడం గమనార్హం. దీంతో ప్రవీణ్ చౌదరి వ్యక్తిత్వం చర్చనీయాంశంగా మారింది.
ఇక నగరంలో భారీ ఎత్తున ఫైనాన్స్ వ్యాపారం చేసే ఇన్నమూరి ప్రదీప్ తండ్రి రాంబాబు టిడిపి మాజీ కార్పొరేటర్. ఆయన కూడా గన్ని కృష్ణ అనుచరుడిగా గుర్తింపు పొందారు. ప్రదీప్ ఎంపికి బాల్యస్నేహితుడిగా చెబుతున్నారు. తండ్రీ కొడుకుల మధ్య ఆస్తి తగాదాల నేపథ్యంలోనే అధికార పార్టీలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది.
రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ ప్రాభవం తగ్గినా పార్టీని వదలని ఎన్ఐ శ్రీనివాస్ హఠాత్తుగా అధికార పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. అంతర్గత ప్రజాస్వామ్యానికి, విభేదాలకు మారుపేరైన కాంగ్రెస్ లోని ఒక వర్గం ఆధిపత్యాన్ని భరించలేక శ్రీనివాస్ పార్టీని వీడినట్లు చెబుతున్నారు. విభేదాల నేపథ్యంలో ఇటీవల ఒక నాయకుడిపై చేయి చేసుకున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
వారి మధ్య సఖ్యత సందేహమే ?
జిల్లాల పునర్విభజన తరువాత కొత్తగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లాకు రాజా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆవెంటనే ఆయన స్వయంగా భరత్ వద్దకు వెళ్లి చేతులు కలిపారు. ఇకపై ఇద్దరం పార్టీ కోసం కలిసి పనిచేస్తామని, నగరపాలక సంస్థ ఎన్నికల్లో పార్టీ విజయానికి సమిష్టిగా కృషిచేస్తామని ప్రకటించారు. ఈ పరిణామాలు పార్టీలోని కార్యకర్తలకు సంతోషాన్ని కలిగించాయి. అంతకు ముందు వరకు ఈ ఇద్దరు నాయకులు పార్టీలోనే ప్రత్యర్థులుగా కొనసాగడం గమనార్హం.
అయితే ఇటీవల కాలంలో ఈ ఇద్దరు నాయకులు ఒకే వేదికపై కనిపించలేదు. భరత్ ఆధ్వర్యంలో జరిగిన ముగ్గురు నాయకుల చేరిక కార్యక్రమానికి కూడా రాజా దూరంగా ఉన్నారు. వారి చేరిక ఆయనకు ఇష్టం లేదన్నది పార్టీ వర్గాల సమాచారం. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రవీణ్ చౌదరికి వ్యతిరేకంగా కార్మికశాఖాధికారులకు ఫిర్యాదు చేయడాన్ని ఇందుకు ఇందుకు తార్కాణంగా చెబుతున్నారు. ఏదిఏమైనా తాజా పరిణామాలను గమనిస్తే ఈనాయకుల మధ్య సఖ్యత మూనాళ్ల ముచ్చటగా కనిపిస్తోంది.