అస్తమయ కాంతి కిరణము లంతరింప
వారిధరములు దాల్చె గంభీర ముద్ర
యుగ యుగాంతర రజనీ మనోజ్ఞ సీమ
సాంధ్య తారా లలామ సాక్షాత్కరించె
వలపు నెలబాల మబ్బుల వలువ వీడి
శర్వరీ సరోవరములో జలకమాడె
అలలు రెప్పలు వాల్చు నిశ్చల జలాల
కాలిడకు శశిబింబమ్ము కలత జెందు
పండు వెన్నెల కలగాంచు పండ్లతోట
కన్ను మోడ్పెరుగదు కలకంఠి పాట
ఎవరి కొరకై పదేపదే యెలుగు నెత్తె
బదులొసంగిన కొలది తాపంబు గలుగు