మానవతావాద మహాసంస్థ – మాతృ సదన్!
(ఒక వెనుదీయని పోరాటసంస్థ పరిచయం!)
చెప్పడానికేం వంద కబుర్లు చెప్పొచ్చు. వ్యవస్థ నాశనం అయిపోతోందని అంటో తోచిన ప్పుడల్లా గగ్గోలు పెట్టొచ్చు. అందరి మీదా మన ప్రకోప మంతా ప్రదర్శించి సొంత సిద్ధాంతాలు వల్లించొచ్చు. కానీ, నడుం బిగిస్తే కదా అసలు కదనమంటే ఏంటో తెలిసేది. నలుగుర్ని కలుపు కుంటే కదా సమిష్టిగా పోరాటం చేసేది. అలా నమ్మిన సత్యం కోసం దశాబ్దాలుగా సంఘర్షణచేస్తూ, “సత్యా గ్రహాన్ని” అత్యున్నత స్థాయిలో ఆచరిస్తున్న అసాధారణ సంస్థ, మాతృ సదన్!
స్వామి శివానంద సరస్వతి ఆద్వర్యంలో హరిద్వార్‌లో ఉన్న ఈ ఆశ్రమం మొదటి నుండీ పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడుతోంది. ఫొటోలో ఉన్నది స్వామి నిగమానంద సరస్వతి సమాధి. 2011 లో మైనింగ్‌కి వ్యతిరేకంగా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టినప్పుడు విషం ఇచ్చి హత్య చేయబడ్డ సాధువు. అదేకాదు మైనింగ్ మాఫియా చేతిలో హత్య చేయబడి అడవిలో పారేయ బడ్డ శివానంద శిష్యుడు స్వామి గోపాలానంద మొదలు, గంగ కోసం నిరాహార దీక్ష లో చంపబడ్డ స్వామి సనానంద్ వరకూ మాతృ సదన్ ది అసాధారణ చరిత్ర!
స్వామి శివానంద సరస్వతి మీద కూడా విష ప్రయోగం జరిగింది. సాధ్వి పద్మావతి దీక్ష చేస్తున్నప్పుడు ఆమెపై జరిగిన విషప్రయోగం వల్ల కాళ్ళు చచ్చుబడి మానసిక సమతు ల్యత దెబ్బతింది. నేను అక్కడ ఉన్నప్పుడే ఆమె హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి వచ్చారు.ఇలా పదుల సంఖ్యలో వందలాది రోజులు దాదాపు డెబ్బైసార్లు సత్యా గ్రహం చేయడానికి, పోలీసు వ్యవస్థ, న్యాయ స్థానాలు, రాజకీయనాయకులు,మాఫియాల్ని ఎదురుకుంటూ ముందుకు సాగడానికి ఎంతటి మనోబలం కావాలి !
ఇంతా చేసి ఆశ్రమం అంతా పది మంది. అద్వై తాన్ని తమదైన రీతిలో అన్వయిం చుకొని ముందుకు సాగుతున్న ఆ ఆశ్రమానికి ఆధ్యా త్మికత కంటే సామాజిక చింతనే ప్రధానం. నాకు తెలిసీ సత్యాగ్రహాన్ని ఇలా ఆచరణా త్మకంగా పాటి స్తున్న ఆశ్రమం మరోటి లేదు. వాళ్ళ దగ్గర ఉన్న case files చూసి, అక్షరాలా 70 కి పైగా చేసిన ఆ సత్యాగ్రహాలకి, సుదీర్ఘమైన పోరాటాలకి నివ్వెరపోకుండా ఉండలేం. భావనల పట్ల, ఆచారాల పట్లా ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ బాధ్యతగా భవిష్యత్తు మానవుడి పక్షం వహించి వాళ్ళు చేస్తున్న యుద్ధాన్ని మాత్రం ఎవరికి వారు శోధించి తెలుసు కోవాల్సిందే!
ప్రముఖ శాస్త్రవేత్తలు మొదలు పర్యావరణ వేత్తల వరకూ మద్దతిస్తామని వచ్చి వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఎలా మౌనం దాల్చారో ఇన్నేళ్ళ నుండీ ఆశ్రమ వాసులు చూస్తూనే ఉన్నారు. కాన, కొత్త ఉద్దారకుల మాటల్ని నమ్మే టేంత అమాయకత్వం ఇప్పు డిక వారిలో లేదు. చాతనైతే మనకి తోచిన పద్దతిలో కుదిరిన మార్గంలో వాళ్ళ నిస్వార్థ లక్ష్యానికి మనసు లోనే నమస్కరించి మన వంతుగా కుదిరినంతగా ఈ అంశానికి విస్తృతి పెంచ డమే చేయదగ్గ సహకారామని నా అభిప్రాయం!
(కేరళకి చెందిన స్వామి ఆత్మ బోధానంద్ నుండి బీహార్‌కి చెందిన స్వామి సుధానంద్ వరకూ ,ఆశ్రమంలో కల్సిన యువకులు ఆధ్యాత్మిక మార్గం లో స్వచ్ఛందంగా జీవన మార్గాన్ని మల్చుకున్నతీరు, అందులోభాగంగా ప్రకృతి కోసం పోరాటం సాగిస్తున్న పద్దతీ అబ్బురం. ఆసక్తి ఉన్న వారు లీసా సబీనా హార్నీ తీసిన “సత్యాగ్రహ్”అనే డాక్యుమెంటరీ చిత్రం మొదలు నెట్లోని వ్యాసాలు చూడొచ్చు. అల్లోపతిలో అత్యున్నత స్థాయికి ఎదిగి కూడా ఆయుర్వేద వైద్యంలో, ముఖ్యంగా ఆటిజానికి సంబంధించి ప్రయోగాలు చేస్తున్న డా. విజయవర్మ నుండి విదేశాల నుండి విచ్చేసి ఆశ్రమంలో ఉంటున్న మాతాజీ వరకూ ఇటు కేరళ నుంచి అటు బిహార్ దాకా సత్యాగ్రహ ఉద్యమాన్ని సమిష్టిగా అమలు చేస్తున్న అసాధారణ మాతృ సదన్ గురించి ఇలా ఈ చిన్న పరిచయ రైటప్.)
-గౌరవ్