మానవాళిని ఇంకా సందిగ్ధంలోనే ఉంచుతున్న కోవిడ్ నుంచి మరింత రక్షణ సాధించడమే తక్షణ కర్తవ్యం. వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరు పట్ల ప్రభుత్వాలు చాలా సంతృప్తికరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రక్రియలో కొంత వేగం పెరిగినప్పటికీ, పొంచివున్న ముప్పును దృష్టిలో పెట్టుకుంటే, ఈ వేగం సరిపోదని నిపుణులు అంటున్నారు. మరింత సమర్ధవంతమైన వ్యాక్సిన్లు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందనీ వారు గుర్తు చేస్తున్నారు. ప్రజలు ఒకప్పటి వలె స్వేచ్ఛగా తిరగాలంటే, ఇంకా కొంతకాలం పాటు స్వయం క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉందని అర్ధమవుతోంది. అని చెప్పి, భయంతో బెంబేలెత్తాల్సిన పనిలేదు. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని భావించాలి. కరోనా మనల్ని చుట్టుకొని ఒకటిన్నర సంవత్సరం దాటిపోయింది. 2024 నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అప్పటి దాకా జాగ్రత్తగా ఉండండని దాని సారాంశం.
Also read: పెగాసస్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ దాపరికం
తగ్గుముఖం పడుతున్న కేసులు
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కానీ, వైరస్ వేరియంట్ల ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. మూడో వేవ్ ముప్పు భయపెడుతోంది. ఇక కరోనా పని అయిపొయింది… అని అనుకునే వారూ మన మధ్య చాలామంది ఉన్నారు. ఆ ధోరణి ప్రమాద హేతువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వ్యాప్తి సాగుతోందని,ఉధృతి కొనసాగుతూనే ఉందని చెప్పడానికి కేరళ, మహారాష్ట్రలోని పరిణామాలే సజీవ ఉదాహరణలు. ఎంతో శ్రద్ధ,శక్తులతో కరోనాను తొందరలోనే కట్టడి చేయగలిగిందని గతంలో కితాబులు పొందిన కేరళ ప్రభుత్వం సైతం….నేటి ఉధృతిని అరికట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. మహారాష్ట్రలోను ఇంచుమించు అదే పరిస్థితి నెలకొని ఉన్నదని గణాంకాలు చెబుతున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 27వేల కేసులు నమోదవుతున్నాయి. అందులో 15వేల కేసులు కేరళకు చెందినవే. ఈ అంశం ఆందోళనను కలిగిస్తోంది. దీనిని బట్టి, మిగిలిన రాష్ట్రాలు కూడా ఎంతో అప్రమత్తంగా ఉండాలి. జనవరి 16 నుంచి మన దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. రకరకాల కారణాలతో ప్రారంభంలో మందకొడిగా సాగింది. కొన్ని నెలల నుంచి వేగం పెరిగింది. ఇంతవరకూ 14శాతం మందికి మాత్రమే రెండు డోసులు అందాయి. ఇంకా 86శాతం మందికి అందాల్సివుందని దాని తాత్పర్యం. కనీసం 60శాతం మందికి రెండు డోసులు పూర్తయితే కానీ, సామూహిక రోగ నిరోధక శక్తి (హెర్డ్ ఇమ్మ్యూనిటీ) ఆశించిన స్థాయిలో పెరగదని శాస్త్రవేత్తలు మొదటి నుంచీ చెబుతున్నారు. ప్రస్తుత వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం ప్రకారం చూస్తే,ఈ డిసెంబర్ కల్లా 43శాతం మందికి రెండు డోసులు పూర్తవుతాయి. ప్రస్తుతం సగటున రోజుకు 74లక్షల మందికి అందుతున్నాయి. ఈ వేగం సరిపోదు. రెట్టింపు వేగంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగాలి. రోజుకు కనీసం 1.2కోట్ల మందికి టీకాలు వేయాలి.
Also read: గుజరాత్ లోనూ గెలుపుగుర్రం ఎంపిక
పిల్లల విషయంలో జాగ్రత్త
కరోనా వ్యాప్తి పిల్లలకు కూడా చేరే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 12-17 ఏళ్ళ మధ్య ఉన్న పిల్లలకు కూడా అక్టోబర్ -నవంబర్ ప్రాంతంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయని సమాచారం. ఇప్పటికే చాలా రాష్ట్రాలలో విద్యాలయాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో, పిల్లలను స్కూల్స్ తీసుకువెళ్తున్న తల్లిదండ్రులకు కోవిడ్ సోకుతోందని వస్తున్న వార్తలు భయాన్ని కలిగిస్తున్నాయి. వ్యాక్సిన్లు ఆశించిన స్థాయిలో చేరని రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు ఇంకా ఉన్నాయి. ప్రభుత్వాలు వాటిపై తక్షణమే దృష్టి సారించాలి. ఇంతవరకూ రెండు డోసుల వ్యాక్సిన్లు పొందినవారిలో యాంటీబాడీలు ఏ మేరకు పెరిగాయో, రోగ నిరోధక శక్తి ఏ స్థాయికి చేరిందో సమగ్రమైన సమాచారం లేదు. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కరోనా వచ్చినా, ప్రాణాలకు ముప్పు ఉండదని, ఆస్పత్రుల బారిన పడాల్సిన అవసరం ఉండదనే మాటలు వినపడుతున్నాయి. అవి ఎంతో ఊరటను కలిగిస్తున్నాయి. దీనివల్ల, వ్యాక్సిన్ ‘రక్షణ కవచాలు’ అనే విశ్వాసం ప్రజల్లో పెరుగుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ రెట్టింపు వేగంతో ముందుకు వెళ్లడం, సమర్ధవంతమైన వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం అత్యంత కీలకం.ప్రస్తుతం మనం తీసుకొనే వ్యాక్సిన్ల ప్రభావం కొన్ని నెలలపాటు మాత్రమే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జీవితకాలం పనిచేసే వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేంత వరకూ టీకాల పోటు తప్పదు. అప్పటి దాకా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండడమే తరుణోపాయం.
Also read: వీగిపోయిన అగ్రరాజ్యహంకారం