Friday, November 8, 2024

విలక్షణమైన దళిత నేత రాంవిలాస్ పాసవాన్

  • ఆరుగురు ప్రధానులతో అనుబంధం
  • సామాజికన్యాయ సూత్రానికి నిబద్ధత
  • శక్తికి మించిన ప్రాధాన్యం
  • అవకాశవాద రాజకీయం
  • జగ్జీవన్ రాం తర్వాత అంతటి మేటి
  • తనయుడు చిరాగ్ పర్యవేక్షణలో పార్టీ క్షేమం

కె. రామచంద్రమూర్తి

‘రాష్ట్రపతీ కా బేటా హో యా చప్రాసీ కా సంతాన్, బిర్లా యా గరీబ్ కా బేటీ, సభీ శిక్షా ఏక్ సమాన్‘ అంటూ దేశంలో సామాజిక న్యాయం కోసం నినదించిన నాయకులలో రాంవిలస్ పాసవాన్ ప్రముఖులు. 1970 ఉత్తరార్ధంలో లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో సాగిన ఉద్యమంలో పాల్గొని, తర్ఫీదై, నాయకులుగా స్థిరపడిన బీహార్ నాయకులలో రాంవిలాస్ మూడవ వ్యక్తి. తక్కిన ఇద్దరూ లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్. వీరిద్దరూ పెక్కు విడతల ముఖ్యమంత్రులుగా చేస్తే, రాంవిలాస్ పాసవాన్ 1989 నుంచి మొన్నటి దాకా కేంద్రమంత్రిగా దీర్ఘకాలం దిల్లీలో చక్రం తిప్పారు.

దిల్లీలో వారంరోజుల కింద గుండెకి శస్త్రచికిత్స చేయించుకొని గురువారం శాశ్వతంగా కన్నుమూసిన కేంద్ర మంత్రి రాంవిలాస్ పాసవాన్ విలక్షణమైన రాజకీయవేత్త. సమయానుగుణంగా, మారిన పరిస్థితులకు తగినట్టు తన వైఖరినీ, బాటనూ అవలీలగా మార్చుకున్న దళిత రాజకీయ నాయకుడు. పరుషంగా చెప్పాలంటే అవకాశవాది అనవచ్చు. లౌక్యంగా చెప్పాలంటే పరిస్థితులకు తగినట్టు సర్దుకొని పోయే ఫ్లెక్సిబిలిటీ కలిగిన నాయకుడు అనవచ్చు. అవకాశవాది అని విమర్శించేవారు కూడా ఆగ్రహంతో అనరు. ప్రేమగానే అంటారు. నవ్వుతూనే అంటారు. అదీ ఆయన వ్యక్తిత్వంలోని వైశిష్ట్యం. ఎప్పుడూ నవ్వుతూ, మంచి దుస్తులు ధరించి, జుట్టు చెదరకుండా టిప్ టాప్ గా ఉండే ఈ బీహార్ నాయకుడు దిల్లీలోని జాతీయ రాజకీయాలలో అందరికంటే ఎక్కువకాలం మన్నిన వ్యక్తి. పరోపకారి. ఒకటి, రెండు  వ్యవధులను మినహాయిస్తే 1989 నుంచీ 2020 వరకూ ఆరుగురు ప్రధానమంత్రుల మంత్రిమండలులలో సభ్యుడిగా ఉన్న నాయకుడు. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్.డీ.ఏ., యూపీఏ కూటములలో జయప్రదంగా మంత్రిగా పని చేసిన ఘనత ఆయనది. ఈ రికార్డును మరెవ్వరూ సమం చేయలేదు. బహుశా ఎవ్వరూ చేయలేరు.

పేద దళిత కుటుంబ నేపథ్యం

డెబ్బయ్ నాలుగేళ్ళ క్రితం ఒక పేద దళిత కుటుంబంలో పుట్టిన రాంవిలాస్ కష్టపడి ఎంఏ, ఎల్ ఎల్ బీ చదివాడు. సోషలిస్టు పార్టీ రాజకీయాలలో చురుకుగా పాల్గొన్నాడు. 1969లో సంయుక్త సోషలిస్ట్ పార్టీ (ఎస్ ఎస్ పీ) అభ్యర్థిగా అలౌనీ నియోజకవర్గం నుంచి సీనియర్ కాంగ్రెస్ నేత మిశ్రీసద్దాను ఓడించి బీహార్ శాసనసభకు ఎన్నికైనారు. మిశ్రీసద్దా 1952 నుంచీ, అంటే ప్రథమ సార్వత్రిక ఎన్నికల నుంచీ, ఆ నియోజకవర్గంలో వరుసగా గెలుస్తూ వచ్చారు.  శిక్షణ పొందింది కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలలో. రాజకీయ నాయకుడిగా ఎదిగింది లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంలో. ఆత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించిన వెంటనే జైలులో పెట్టిన నాయకులలో పాసవాన్ ఒకరు. ఆత్యయికస్థితి కొనసాగినంతకాలం కారాగారవాసంలోనే ఉంటూ రాటుతేలారు. ఎమర్జెన్సీ ఎత్తివేయగానే విడుదలైన తర్వాత జనతాపార్టీలో చేరారు. లోక్ సభకు తన ప్రాంతమైన హాజీపూర్ నియోజకవర్గం నుంచి 4.2 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అది అప్పట్లో ప్రపంచ రికార్డు. గిన్నిస్ రికార్డ్ బుక్ లోకి ఎక్కారు. ఆ తర్వాత అదే నియోజకవర్గం నుంచి 1989లో ఐదు లక్షల మెజారిటీతో గెలుపొందారు.  జనతా పార్టీ చీలినప్పుడు జనతాదళ్ లో ఉన్నారు. జనతాదళ్ చీలినప్పుడు 2000లో తన సొంత పార్టీ లోక్ జనశక్తి పార్టీ (ఎల్ జేపీ) పెట్టుకున్నారు. ఈ పార్టీకి బీహార్ లో ఎన్నడూ ఆరేడు శాతం ఓట్లకు మించి రాలేదు. కానీ దిల్లీ రాజకీయాలలో పాసవాన్ ది ఎవ్వరూ కాదనలేని ప్రత్యేక భూమిక. బీహార్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ దిల్లీలో చక్రం తిప్పిన నేతలలో బాబూ జగ్జీవన్ రాం తర్వాత రాంవిలాస్ పాసవాన్ పేరే చెప్పుకోవాలి.  

ప్రధాని ఎవరైనా, కూటమి ఏదైనా మంత్రిగా రాంవిలాస్ ఉండటం తథ్యం. వీపీ సింగ్ తో ప్రారంభించి, హెచ్ కె దేవగౌడ, ఐకె గుజ్రాల్, అటల్ బిహారీ వాజపేయి, మన్మోహన్ సింగ్, నరేంద్రమోదీల ప్రభుత్వాలలో ముఖ్యుడు. రైల్వేలూ, కార్మికశాఖ, సంక్షేమశాఖ, ఆహార శాఖ, ప్రభుత్వ పంపిణీ వ్యవహారాలు వంటి అనేక ముఖ్యమైన శాఖలను నిర్వహించారు. ఎన్నికలలో ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయో పసికట్టడంలో దిట్ట. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ‘పాసవాన్ వాతావరణ శాస్త్రవేత్త (రాజకీయ వాతావరణం కనిపెట్టడంలో సిద్ధహస్తుడు)’ అని వ్యాఖ్యానించారు.

సంచలన రాజకీయం చేస్తున్న తనయుడు

శస్త్రచికిత్స చేసుకొని ఆస్పత్రిలో ఉన్నప్పటికీ కొన్ని మాసాలుగా బీహార్ లో కొడుకు చిరాగ్ పాసవాన్ చేస్తున్న రాజకీయాలు చూస్తుంటే తండ్రి నుంచి రాజకీయ  కౌశలం కొడుకు అందిపుచ్చుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పట్ల ప్రజలలో వ్యతిరేకత ఉన్నదని సంవత్సరం కిందటే గ్రహించి ఆయనకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించిన యువకుడు చిరాగ్. రాంవిలాస్ పాసవాన్ ప్రచారం చేయకుండా 1969 నుంచి బీహార్ లో ఎన్నికలు జరగడం ఇదే ప్రథమం.

రాంవిలాస్ పాసవాన్ రాజకీయ జీవితంలో రెండు పార్శ్వాలు ప్రధానమైనవి. ఒకటి, సామాజిక న్యాయం కోసం పోరాటం. అవకాశం వచ్చినప్పుడు పూర్తిగా శక్తియుక్తులు వినియోగించి న్యాయం చేయడానికి ప్రయత్నించడం. రెండు దళితనాయకుడిగా పాత్ర. మొదటి నుంచీ రాజకీయంగా, సామాజికంగా పౌరులందరూ సమానమేనంటూ వాదించిన వ్యక్తి రాంవిలాస్. వీపీ సింగ్ ది అర్ధాయుష్సు ప్రభుత్వం అయినప్పటికీ, ఒడిదుడుకులు ఎన్ని ఉన్నప్పటికీ, స్వల్ప వ్యవధిలోనే బలమైన కార్యక్రమాలు అమలు చేసిన ఘనత సాధించింది.

మండల్ కమిషన్ సిఫార్సుల అమలు

బహుశా అడ్వాణీ రామజన్మభూమికోసం రథయాత్ర ప్రారంభించకపోతే మొరార్జీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లాగే వీపీ సింగ్ కూడా మండల్ కమిషన్ నివేదికను అటక మీదే ఉంచేవారేమో. అక్కడి నుంచి దించి దుమ్ము దులిపేవారు కాదేమో. మొత్తం మీద మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని రాజకీయ నిర్ణయం తీసుకున్న సమయంలో వీపీ సింగ్ ప్రభుత్వంలో సంక్షేమశాఖ రాంవిలాస్ పాసవాన్ చేతిలో ఉంది. వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు ప్రకటించి తీరాలని పట్టుపట్టినవారిలో రాంవిలాస్ ప్రముఖుడు. అగ్రవర్ణాలకు చెందినవారు మండల్ కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేసినప్పటికీ మాటకు నిలబడి ప్రభుత్వ విధానాన్ని అమలు చేసిన ఘనత రాంవిలాస్ పాసవాన్ దే.

వీపీ సింగ్ ప్రభుత్వం పోయిన తర్వాత చంద్రశేఖర్ సర్కార్ వచ్చింది. రాజీవ్ గాంధీ ఆ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించడంతో చంద్రశేఖర్ ప్రభుత్వం కూలిపోయింది. తర్వాత ఎన్నికల మధ్యలో రాజీవ్ గాంధీ దారుణ హత్య, అనంతరం ప్రధానిగా తెలుగువాడు పీవీ నరసింహారావు గద్దెనెక్కడం తెలిసిందే. ఈ సమయంలోనే రాంవిలాస్ ప్రతిపక్షంలో ఉన్నారు.  పీవీ తర్వాత ఏర్పడిన దేవేగౌడ, గుజ్రాల్ ప్రభుత్వాలలోనూ, అనంతరం వాజపేయీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలలోనూ కొనసాగడం విశేషం. ప్రతిపక్ష ప్రవాహంలో ఉన్నారు కనుక, జనతాపార్టీ నాయకుడిగా వ్యవహరించారు కనుక వాజపేయి మంత్రిమండలిలో ఉండటంలో ఆశ్చర్యం లేదు. 2004లో సోనియాగాంధీ తరఫున ప్రధానమంత్రిగా పని చేసిన మన్మోహన్ సింగ్ సర్కార్ లో రాంవిలాస్ చేరడం గొప్ప రాజకీయ గారడీ. కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయవాదిగా అప్పటి వరకూ చెలామణి అయిన రాంవిలాస్ అకస్మాత్తుగా యూపీఏ సర్కార్ లో చేరడం వెనుక ఆయన రాజకీయ ధోరణి ఉంది. ఎవ్వరినీ శాశ్వతంగా ప్రేమించని, ద్వేషించని చిత్రమైన వ్యక్తిత్వం ఉంది. అందరినీ కలుపుకొని పోతూ సంతోషంగా పని చేయగల మనస్తత్వం ఉంది.

రాంవిలాస్ ఇంటికి వెళ్ళిన సోనియా

బీహార్ లో మారుమూల గ్రామంలో పేద దళిత కుటుంబంలో పుట్టిన రాంవిలాస్ పాసవాన్, రాజీవ్ సతిగా ఇండియాకి వచ్చి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాజకీయాలను శాసిస్తున్న సోనియగాంధీ ఒకే జనపథ్ లో ఇరుగుపొరుగున చాలా సంవత్సరాలుగా ఉంటున్నారు. రాంవిలాస్ నివాసం 12 జనపథ్ అయితే సోనియాగాంధీది 10 జనపథ్. పక్కపక్కనే. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రసాదించిన వెసులుబాటులలో ఇది ఒకటి. 2002లో పాసవాన్ వాజపేయి మంత్రిమండలిలో సభ్యుడు. ఆ సంవత్సరం గోధ్రాలో మారణహోమం, గుజరాత్ లో హత్యాకాండ జరగడం పట్ల ఖిన్నుడై నిరసనగా రాంవిలాస్ తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. ఇంట్లో కూర్చున్నారు. పక్క ఇంటిలోనే ఉన్న సోనియాగాంధీ ఒక రోజు రాంవిలాస్ ఇంటికి సరదాగా నడుచుకుంటూ వెళ్ళి యూపీఏలో చేరవలసిందిగా కోరారు. రాంవిలాస్ సరేనన్నారు. ఆ విధంగా 1969 నుంచి కొనసాగించిన కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయానికి స్వస్తి చెప్పి కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ కూటమిలో చేరిపోయారు. 2005 ఫిబ్రవరిలో జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికలలో రాంవిలాస్ నాయకత్వంలో ఎల్ జేపీ కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకొని ఎన్నికల బరిలో దిగింది. ఆ ఎన్నికలలో కనీవినీ ఎరగనంతగా ఎల్ జేపీకి 29 స్థానాలు లభించాయి. అప్పుడే రాంవిలాస్ మొండికెత్తారు. లాలూ ప్రసాద్ ని కానీ నితీశ్ కుమార్ ని కానీ బలపరచడం తనకు ఇష్టం లేదని ప్రకటించారు. ఎవరైనా ముస్లింని ముఖ్యమంత్రిని చేస్తే బాగుంటుందని సూచించారు. విధిలేక బీహార్ అసెంబ్లీకి మళ్ళీ ఎన్నికల జరిగాయి. నితీశ్ కుమార్ గెలుపొంది ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అట్లాగే కూర్చొని ఉన్నారు.

ముగ్గురూ ముగ్గురే

అవకాశవాద రాజకీయం చేసిన నాయకుడు ఒక్క రాంవిలాస్ పాసవాన్ ఒక్కరే కాదు. మరిద్దరు బీహార్ ముఖ్యనాయకులు లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్ లు కూడా అదే పని చేశారు. వారు కూడా సామాజికన్యాయం పేరుతో రాజకీయాలు నడిపినవారే. కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలు నడిపినవారే. ఆనక కాంగ్రెస్ పార్టీలో పొత్తు పెట్టుకున్నవారే. కాంగ్రెస్, లాలూ ప్రసాద్ నాయకత్వంలోని ఆర్జేడీ మధ్య పొత్తు చాలాకాలంగా బీహార్ లో సాగుతోంది. నితీశ్ కుమార్ మాత్రం తనకు ఎప్పుడు ఏది అవసరమైతే ఆ పని చేస్తున్నారు. మొదట బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తర్వాత మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన  మీదట ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీతో తెగతెంపులు చేసుకొని ఆర్జేడీ, కాంగ్రెస్ తో చేతులు కలిపి 2015 ఎన్నికలలో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత 2017లో ఆర్జేడీతో పేచీ పడి కూటమి నుంచి వైదొలిగి మళ్ళీ ఎన్ డీఏ కూటమిలో ప్రవేశించి ముఖ్యమంత్రిగా నిరాఘాటంగా కొనసాగారు. సామాజికన్యాయం పేరుమీద సోషలిస్టు పార్టీలో కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ శిక్షణ పొంది, జేపీ నాయకత్వం పని చేసిన ముగ్గుర భృత్యులూ అవకాశవాద రాజకీయాలు చేసినవారే. ఈ ముగ్గురిలో లాలూ ప్రసాద్ కొంతవరకూ నయం. అడ్వాణీ రథయాత్రకు అడ్డునిలిచి, అడ్వాణీని అరెస్టు చేసిన తెగువ లాలూదీ. అదే విధంగా గోధ్రా ఘటన తర్వాత గుజరాత్ లో మతకలహాలకు నరేంద్రమోదీని బాధ్యుడిని చేసి అదే వైఖరికి కట్టుబడి ఉన్న నాయకుడు లాలూ ప్రసాద్. ఇందుకు భిన్నంగా నితీశ్, పాసవాన్ వ్యవహరించారు. గుజరాత్ లో హత్యాకాండ కారణంగానే నరేంద్రమోదీని ప్రధాని అభ్యర్థిగా ఆమోదించడం ఇష్టం లేక బీజేపీతో పొత్తును 2013లో నితీశ్ కుమార్ తెగతెంపులు చేసుకున్నారు. గుజరాత్ అల్లర్ల కారణంగా రాంవిలాస్ పాసవాన్ వాజపేయీ ప్రభుత్వం నుంచి వైదొలిగారు. ఆ తర్వాత నితీశ్ కుమార్ పరోక్షంగానూ, రాంవిలాస్ ప్రత్యక్షంగా మోదీ నేతృత్వంలో ఒద్దికగా పని చేస్తున్నారు.

అంబేడ్కర్ కి భారతరత్న పురస్కారం

ఇక దళిత నాయకుడిగా రాంవిలాస్ పాసవాన్ కి తిరుగులేదు. వాజపేయి అయినా, మోదీ అయినా, సోనియాగాంధీ అయినా రాంవిలాస్ ని గౌరవించేది తమని ఇబ్బంది పెట్టని, అసమంజసమైన కోర్కెలు కోరని, కటువుగా మాట్లాడని, ప్రతిసందర్భంలోనూ తన అస్తిత్వాన్ని గుర్తించాలంటూ పట్టుపట్టని, సరసుడైన దళిత నాయకుడు కావడం మూలంగానే. అయితే దళితులకు ఉపకారం చేయడానికి అవకాశాలు వచ్చినప్పుడు వాటిని రాంవిలాస్ పట్టుదలతో వినియోగించుకున్నారు. 2 జనవరి 1954లో వ్యవస్థీకరించిన అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నను సుమారు నాలుగు దశాబ్దాలపాటు రాజ్యాంగనిర్మాత, దళితజన విధాత అంబేడ్కర్ కు ఇవ్వలేదు. కొట్టవచ్చినట్టు కనిపించే ఆ లోపాన్ని సవరించడానికి తనకు వచ్చిన అవకాశాన్ని రాంవిలాస్ పాసవాన్ సద్వినియోగం చేసుకున్నారు. వీపీ సింగ్ ప్రభుత్వంలో సంక్షేమ శాఖ మంత్రిగా అంబేడ్కర్ కి 31 మార్చి 1990 నాడు భారతరత్న అవార్డును మరణానంతర పురస్కారంగా ప్రకటింపజేశారు. అప్పుడు ప్రధానిగా వీపీ సింగ్, సంక్షేమశాఖ మంత్రిగా పాసవాన్ ఉండటం వల్ల చారిత్రక తప్పిదాన్ని సవరించుకునే వీలు కలిగింది. ఆ అంశాన్ని సందర్భం వచ్చిన ప్రతిసారీ రాంవిలాస్ సగర్వంగా చెప్పుకునేవారు.

ఎస్సీ, ఎస్టీస్ (ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్)యాక్ట్, 1989

అదే విధంగా 1989లో తెచ్చిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ (ప్రివెన్షన్) చట్టాన్ని నీరు కార్చుతూ సుప్రీంకోర్టు 20 మార్చి 2018 నాడు ఒక తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం ఈ చట్టం కింద ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్)ని దాఖలు చేసిన వెంటనే నిందితులను అరెస్టు చేయాలి. ఈ నిబంధనను చాలా సందర్భాలలో దుర్వినియోగం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ లు దాఖలైనాయి. వాటిని పరిశీలించిన అనంతరం ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేసిన వెంటనే నిందితులను అరెస్టు చేయనక్కర లేదనీ, పై అధికారుల అనుమతి తీసుకోవలసి ఉంటుందనీ, ప్రాథమిక విచారణ చేయవలసి ఉంటుందనీ, ఈ చట్టం కింద అరెస్టయినవారికి ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకొనే వీలుంటుందనీ సుప్రీంకోర్టు వెసులుబాటు ఇచ్చింది. ఈ వెసులుబాటును రద్దు చేసే వరకూ రాంవిలాస్ పాసవాన్ విశ్రమించలేదు. 2018 ఆగస్టులో భారత పార్లమెంటు షెడ్యూల్డ్ కులాలూ, షెడ్యూల్డ్ తెగలూ (అత్యాచార నిరోధక) బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు 1989నాటి చట్టంలో రెండు సెక్షన్లను పొందుపరిచింది. సెక్షన్ 18ఏ(1)(సీ) ప్రకారం ఈ చట్టం కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాత ఎవరినైనా అరెస్టు చేసే ముందు ప్రాథమిక విచారణ అవసరం లేదు. మరో సెక్షన్ 18 ఏ(1)(బీ) ప్రకారం ఈ చట్టం కింద అరెస్టయినవారికి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉండదు. ఈ  రకంగా సుప్రీంకోర్టు 1989 చట్టానికి పెట్టిన కంతలను మోదీ ప్రభుత్వం పార్లమెంటు ద్వారా పూడ్చివేయడంలో రాంవిలాస్ పాసవాన్ ప్రముఖమైన పాత్ర పోషించారు.

కుటుంబానికి ప్రాధాన్యం

రాంవిలాస్ పాసవాన్ చిన్నతనంలో దరిద్రం అనుభవించారు. కష్టపడి పైకి వచ్చారు. రాజకీయ నిచ్చెనను లాఘవంగా ఎక్కారు. ఉన్నత పదవులు సాధించారు. పదవులలోనే ఎక్కువ కాలం ఉన్నారు. వ్యక్తిగతంగా విలాసవంతమైన జీవితం గడిపారు. అన్నదమ్ములను ఆదరించారు. ఆయనకు ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు ఉండేవారు. పశుపతినాథ్ పారస్ నూ, దివంగత రామచంద్ర పాసవాన్ నూ రాజకీయాలలోకి తెచ్చారు. 2019 నాటి లోక్ సభ ఎన్నికలలో ఎల్ జేపీ ఆరు స్థానాలు గెలుచుకుంటే వాటిలో మూడు రాంవిలాస్ కుటుంబ సభ్యులకే దక్కాయి. తనయుడు చిరాగ్, తమ్ముడు పారస్, మేనల్లుడు ప్రిన్స్ రాజ్. రాంవిలాస్ ఎనిమిది విడతల లోక్ సభకు ఎన్నికైనారు. రెండు సార్లు రాజ్యసభకు వెళ్ళారు. బీజేపీ సహకారంతో రాజ్యసభ సభ్యుడైనా రాంవిలాస్ 2019 లోక్ సభ ఎన్నికలలో పోటీ చేయలేదు. బంధుప్రీతి ప్రదర్శించినప్పటికీ తన దళిత మూలాలను మరచిపోలేదు. దళితుడిగా తనకు లభించిన గుర్తింపును దళితులకు మేలు చేయడం కోసం వినియోగించారు. భారత రాజకీయ అవనికపైన చాలా ఆసక్తికరమైన పాత్ర రాంవిలాస్ పాసవాన్ ది. ఆయన అర్థవంతమైన, ప్రయోజనకరమైన జీవితం జీవించారు. రాం విలాస్ వారసుడు చిరాగ్ పాసవాన్ ఇప్పటికే పగ్గాలు చేతపట్టి పార్టీని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. సీనియర్ పాసవాన్ రాజకీయ వారసత్వానికి ఢోకా లేదు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles