- మాశర్మ చేతులమీదుగా విడుదల
- ఇతర రాష్ట్రాలలో, దేశాలలో నివశించే తెలుగువారి వారథి ‘స్పందన’
ముంబయి,ఏప్రిల్ 7 : ‘స్పందన’ సారస్వత సంస్థ 13 వ వార్షికోత్సవం ఆద్యంతం ఆహ్లాదభరితంగా జరిగింది. ముంబైలో జీవిస్తున్న తెలుగువారు సాంస్కృతిక వికాసం, ప్రోత్సాహం లక్ష్యంగా ఈ సంస్థను స్థాపించుకున్నారు.
మాతృభాష మీద ఉన్న మమకారం పునాదులపై నిర్మాణమైన ‘స్పందన’ తొలిగా దృశ్య,శ్రవ్య సంచికలను కూడా ప్రారంభించింది.కథలు, కవితలు,పాటలు,గజల్స్, నాటికలు,వ్యాసాల కలగూరగంపగా ఈ పత్రికల రూపకల్పన జరిగింది.
సీనియర్ పాత్రికేయుడు మాశర్మ ముఖ్యఅతిథిగా పాల్గొని సంచికలను ఆవిష్కరించారు. ప్రముఖ పాత్రికేయుడు ఏ సూర్యప్రకాశరావు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.
సంస్థ అధ్యక్షురాలు ఇందిర రాజగోపాల్ ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. రాపర్తి ఝాన్సీ సభావ్యాఖ్యాతగా వ్యవహరించారు. ముంబయితో పాటు వివిధ నగరాలకు చెందిన తెలుగు ప్రముఖులు, సాహిత్యవేత్తలు ఎందరో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళా సాహితీ వేత్తలు పెద్దఎత్తున పాలుపంచుకున్నారు.
వృత్తి, ఉద్యోగాల రీత్యా తెలుగునేలను వీడి సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగువారంతా ఏకమై భాషాసంస్కృతుల గురించి మాట్లాడుకోవడానికి, తమ మాతృభక్తిని చాటుకోవడానికి, కన్నఊరుకు దూరంగా ఉంటున్నామనే వెలితిని తీర్చుకోడానికి ‘స్పందన’ వంటి సారస్వత సంస్థలు చేస్తున్న కృషి వెలకట్ట లేనిదని వక్తలు కొనియాడారు.
ఈ సంచికలో భాగస్వామ్యులైన రచయితలు,కవులు తమ కవితాపంక్తులను వినిపించి అలరించారు.’స్పందన త్రయోదశ వార్షికోత్సవం’ జూమ్ వేదికగా జరగడం వల్ల దేశవిదేశాలలోని తెలుగు అభిమానులు ఎక్కువమంది పాల్గొనగలిగారు.