Sunday, December 22, 2024

స్వర సుర ఝరీ తరంగానికి అక్షర నివాళి

జూన్ 4 బాలసుబ్రహ్మణ్యం జయంతి

బాలసుబ్రహ్మణ్యం తన పాటలు తానే పాడుతూఉంటే ఆ తీపిని పంచుకుంటూ ఇన్నాళ్లూ ఆయన పుట్టిన రోజులు జరుపుకున్నాం. ఇవ్వాళ ఆయన తొలి జయంతి. కరోనా తొలి విషం తీయని గాయకుడిని తీసుకుపోయింది.

బాలు నటుడు. ముఖం మాట్లాడూ ఉండేది. గాయకుడు, పాటలు మనతో ముచ్చటిస్తూ ఉంటాయి. కొన్ని పాత్రలకు ఆయన గొంతునిచ్చాడు. ఆ స్వరం మనను పలకరిస్తూనే ఉంటుంది. బాలు భావాలను మాట్లాడకుండా పలికించగలడు. నటించకుండా తన మాటలతోనే ముఖభావాలను కనిపింపజేయగలడు. మాటలు పాటలవుతాయి. పాటలు గుండెల్ని తట్టి పిలుస్తాయి. మాటల్లో ఎంత సునాయాసంగా భావాలు పలికించగలడో ముఖంలో కూడా అంతే సునాయాసంగా భావాల్ని పలికించే శక్తి తన సొంతం.

బాలు ప్రతిభా విశేషాలకు గొప్ప ఉదాహరణ. అన్నమయ్యకు పాడడంతో పాటు వేంకటేశ్వరస్వామికి గొంతునిచ్చి తన పాటలకు తన మాటలకు పోటీపెట్టినవాడు బాలు. బాలుగళ విశ్వరూపం చూడాలంటే అన్నమయ్య చిత్రం పతాక సన్నివేశం మరోసారి పరిశీలించాల్సిందే.

అన్నమయ్య సినిమాలో ‘నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడా శ్రీ నారాయణా’ అన్న ‌అన్నమయ్య కీర్తన బాలుకు అజరామరకీర్తిని తెచ్చిపెట్టింది. తరువాత రామదాసు చిత్రాన్ని, ‘‘అంతా రామమయం ఈ జగమంతా రామమయం’’ సహా అనేక భక్తరామదాసు కీర్తనలతో సుసంపన్నం చేశారు. ‘‘నను బ్రోవమని చెప్పవే’’ అని దైన్యాన్ని పలికించాడు బాలు. ఆయన పాడిన పాటలన్నీ ఉన్నాయి. కాని ఆయన లేడు అంటే నమ్మలేము. ఆయన అర్థాంతరంగా అస్తమించినపుడు రాసుకున్న కొన్ని మాటలు మళ్లీ చెప్పుకోవాలనిపిస్తుంది.

ఆయన గళశ్రీపతి,సంగీత పండితారాధ్యుడు, మనసంతా బాలుడు, పాములను–పాపలను సైతం తలలాడింప చేసే సుబ్రహ్మణ్యం. బాలు సమధుర సుస్వర సురాధీశుడు. సలలిత స్వర రాగ గంగా ప్రవాహం. వెంటిలేటర్ ఆయన్ను బతికించలేకపోయినా, కళా వైవిధ్యంతో ఆయన చిరంజీవిగా మిగిలిపోయాడు. ఇక్కడుండడానికి ఆయనకు ఎక్మో సాయం చేయలేదు. కాని మనలను ఎక్కడికీ వెళ్లనీయక ఆ స్వరం అందరినీ కట్టిపడేసింది.

ఘంటసాల తరువాత తన పాటమోగని తెలుగు సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. కాని ఆతెర ముఖం చాటేసింది. తెలుగు పెద్ద తెర బాలు పాట అవసరం లేదనుకున్నదేమో. ఆయన దాన్ని సున్నితంగా పక్కకుబెట్టి, పెద్ద మనసుతోచిన్నతెరను సొంతం చేసుకున్నాడు.  బాలుడు కాదు, పెద్దమనిషి. పాడుతా తీయగా అంటూ లక్షలాది గాయక చిరుదివ్వెలను వెలిగించి ప్రపంచమంతా కోటానుకోట్ల కాంతులు నింపిన ‘దివి సూర్యసహస్రస్య’ ఆయన.

లలితంగా స్వరాలను సవరించిన గురువు

పాడుతా తీయగా అంటూ అందరితోనూ తీయగా పాడించిన మహానుభావుడు. ఈ రోజు తెలుగుసీమ గాయక గాయనీ మణులతో సుసంపన్నమైందంటే దానికి దానికి బాలు ప్రోత్సహమే కారణం. బాలబాలికల్లో ఒక్కొక్కరి పాటను ఆయన విశ్లేషించిన తీరు, ఒక్కొక్క లలిత స్వరాన్ని లలితంగా సవరించిన తీరు, ఒక్కొక్క చిరుమొగ్గను భావి సంగీతజ్ఞుడిగా తీర్చిదిద్దిన తీరు అనితర సాధ్యం. అది మరొకరికి నేర్చినా రాదు. అదేసంగీత సరస్వతికి ఆయన చేసిన ఆరాధన, సలలిత గీతారాధన, మధుర గాన నైవేద్యం. బాలు మెచ్చుకోలు బలంతో గొంతులు విప్పిన కోయిలలు ప్రపంచమంతా మధుర వసంతధ్వానాలు చేస్తున్నాయి, చేస్తుంటాయి.

ఘంటసాల పాడుతూ చనిపోవాలనుకున్నాడు. అదేవిధంగా తెలుగు సినీసీమలో తీయగా పాడుతూనే పోయిన వాడు. తీయగా పాడాలని కోరి నిర్వహించిన వందలాది కార్యక్రమాల ద్వారా ఎందరికో స్వరాలు నేర్పిన బాలు లేకపోయినా ఆ నేర్పుతో వారు తీయగా పాడుతూ ఉండగా, హాయిగా పోయిన వాడు బాలసుబ్రహ్మణ్యం.

దివిలో విరిసిన పారిజాతం

గాయకుడిగా ప్రవేశించిన తొలినాళ్లలో ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో’ అన్న దాశరథి గేయం బాలు స్వరపథ జైత్రయాత్ర కు ఆరంభం.  ‘‘ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయలీనాలతో’’ మనోఫలకాల్లోకి, జనపథంలోకి బాలు స్వరయాత్ర సాగింది. ‘‘శివరంజనీ నవరాగిణీ’’ అనీ ‘‘సాగరసంగమమే ఒక యోగం’’ అని ఘోషించింది ఆయన గొంతు.

బాపు తీసిన త్యాగరాజు సినిమా కోసం అనేకానేక త్యాగరాజ కీర్తనలను అలవోకగా ఆలపించిన గొంతు అది. ‘‘మాటే రాని చిన్నదాని మనసు పలికే పాటలు’’ అంటూ పదానికి పదానికి మధ్యగానీ, చరణానికి పల్లవికీ మధ్యగానీ శ్వాసకు చోటులేని రాగస్రవంతిని అద్భుతంగా ప్రవహింపచేసిన గంధర్వుడు బాలు.

సరిగమల సిరిమల్లి

‘‘సిరిమల్లి నీవే’’ అంటూ శ్రోతల మనసుల్లో మల్లెల వాసనలు గుప్పించిన సంగీత జయంతవసంతుడు. ఘంటసాలతో గొంతు కలిపి ‘‘ప్రతిరాత్రీ వసంతరాత్రి ప్రతిగాలి పైరగాలి’’ అని పాడుతూ ఉంటే వెన్నెల రాత్రులలో పైరులు, ప్రియులూ ఊగిపోవలసిందే కదా.

‘‘ఏ పారిజాతమ్ము లీయగలనో సఖీ గిరిమల్లికలు తప్ప గరికపూవులు తప్ప’’ అని ఏకవీర సినిమాకు సినారె రాసిన ప్రయోగ పద్యగేయానికి స్వరాన్నిచ్చిన స్వరధుని.ఆఖరిపోరాటం అనే సినిమాకు లతామంగేష్కర్ తెలుగులో మధురంగా ‘‘తెల్ల చీరకు తకధిమి తపనలు రేగెనమ్మ సందె వెన్నెల్లో’’ అని పాడితే ఆమెతో కలిసి అంత లేతగా ‘సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ తాకేనమ్మ సందె నవ్వుల్లో’ అని తీయని స్వరాలూదిన వాడు బాలు.

ఒకసారి రవీంద్రభారతిలో వేటూరి సుందరరామమూర్తికి సన్మానం చేసిన సభలో బాలు వేటూరి రాసిన పాటల పల్లవులెన్నో పాడి ఆ కవి చరణాల మీద పడిన తీరు మరిచిపోలేము. కళాతపస్వి విశ్వనాథ్ చాలా అభిమానించే గాయకుడు బాలు.

ఆయన సినీజీవన పయనం అనేకానేక వైవిధ్యపాత్రల్లో సాగింది. పాటతో పాటు బాలు అనేక బాటల్లో నడిచాడు. కమలహాసన్ డబ్బింగ్ తెలుగు సినిమాలకు బాలు గొంతు ఎంతగా నప్పేదంటే, కమల్ ఒకసారి సొంత గొంతుతో మాట్లాడినప్పుడు శ్రోతలకు నచ్చనేలేదు.

బాలు పాటతో బాలు మాటకు పోటీ

అన్నమయ్య చిత్రంలో శ్రీ వేంకటేశునికి బాలు గొంతు రకరకాలుగా పలికించిన తీరు ఒక అద్భుతం.  అదొక అవధానం వలె ఉంటుంది. అన్నమయ్యకు అడ్డుతగిలి అతన్ని మార్చిన యతిగా, పెళ్లికి ఒప్పించిన కోయదొరగా, పెళ్లి చేయించిన పురోహితుడిగా, చివరకు ఆయన కృతులతో పాటు ఆయననుకూడా స్వీకరించిన కులదైబం వేంకటేశుడిగా సుమన్ పాత్రకు తన స్వర వైవిధ్యంతో వన్నె తెచ్చిన మాటగాడు ఈ పాటగాడు.

నేను ఒకసారి బెంగుళూరు విమానాశ్రయంలో బస్సులో ఆయనతో పాటు కూర్చున్నపుడు మాట కలిపాను. అన్నమయ్య పరాకాష్ఠ సన్నివేశంలో ‘అంతర్యామి అలసితి సొలసితి’ అన్న పాటకు ముందూ వెనుక, పాట సాగే సమయంలో బాలు అన్నింటా తానై భాసిల్లిన అద్భుత సన్నివేశాన్ని ప్రస్తావించాను.ఆ శ్రీ వేంకటేశునికి బాలు మాట్లాడిన మాటలతో అన్నమయ్యకు బాలు పాడిన పాట పోటీ పడే సన్నివేశం గుర్తు చేస్తే, బాలు ఎంతో పొంగిపోయారు. అన్నమయ్య సినిమా క్లైమాక్స్ దృశ్యానికి బాలు ప్రాణమైతే, ఆ సన్నివేశం మొత్తం సినిమాకే అది మణికిరీటం అన్న నా వ్యాఖ్య బాలుకు బాగా నచ్చింది.

పాటకన్న మాట గొప్పది

‘‘మీ పాట గొప్పదే కాని పాట కన్న మీ మాట చాలా బాగుంటుందండీ’’ అని నేను అంటే ఆయన ఎంతో ఆనందపడిపోయారు. నేను ఇంకో మాట అన్నాను. కన్నడసీమలో మీ పాటలకు తెలుగునాట ఉన్న దాని కన్న మిన్నగా ఆదరణ, అభిమానం ఉందంటే ఆయన అవునని అనేక దృష్టాంతాలు చెప్పారు. తమిళసీమలో కూడా తనకు అంతే ఆదరణ ఉందని చెప్పారు. మీ సినీయాత్రలో అన్నమయ్య గొప్ప మజిలీ అని, మీ ప్రతిభకు తగిన అవకాశాన్ని రాఘవేంద్రరావు ఇచ్చారన్న నా మాటను మనః స్ఫూర్తిగా అంగీకరించి నాతో చేతులు కలిపారు. ఎయిర్‌పోర్ట్ దాటే దాకా ఒక అరగంట సేపు నాతోనే మాట్లాడుతూ ఉండిపోయారు. ఆ దృశ్యాలు ఇప్పుడే జరుగుతున్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది. అన్నమయ్య సినిమా దిగ్విజయానికి అనేక దిగ్గజాలు కారణం కావచ్చు. కాని బాలు పాట, మాట ఆ సినిమాకు కొండంత బలం.

70 ఏళ్ల పైబడిన తరువాత కూడా స్టేజీ మీద, అనేకానేక స్వరాలు పలికిస్తూ మిమిక్రీ చేస్తూ అంతులేని కథ సినిమాలో ‘‘తాళికట్టు శుభవేళ’’ అనే తన అద్భుతమైన పాట తానే పాడుతూ ఉంటే ఎంత ఆశ్చర్యం. వయసు కనబడదు, బాలుడే అనిపించేది. పాత్రకు పాత్రధారికి అనుగుణంగా మారుస్తూ బాలు ఎన్టీరామారావుకు అక్కినేని నాగేశ్వరరావుకు గొంతునిచ్చినా శోభన్‌బాబుకు, కృష్ణకు ఒకే పాటలో గొంతు మార్చినా ఆయనకే చెల్లింది.

పాటల్లో రాటుదేలుతున్నప్పుడే ఆయన చిన్నచిన్న పాత్రల్లో కనిపించి నటుడుగా ఎదిగాడు. దక్షిణాది ప్రేమికుడు ఉత్తరాది ప్రియురాలు మధ్య ప్రేమకథ ఇతివృత్తంగా మరోచరిత్ర సినిమా ఆధారంగా ‘ఏక్ దూజే కే లియే’ అనే హిందీ సినిమా తీశారు. ఆ హీరోకు బాలు గొంతు ఎంతగానో అమరింది. దక్షిణాది యాసతో బాలు పాడిన హిందీ పాట ‘‘తెరే మేరే బీచ్ మే కైసాహై ఎ బంధన్ అంజానా…’’ మొత్తం భారతదేశాన్ని అప్పట్లో ఊపేసిన పాట.

అద్భుతః

తనికెళ్ల భరణి ప్రయోగ చిత్రం ‘మిథునం’లో బాలు నటనా ప్రతిభను చూడవచ్చు. అద్భుతః అనే మాటను తెలుగు నాట ప్రతినోటా నిలిపిన సినిమా అది. లక్ష్మితో కలిసి జంటగా ఆయన పాత్రే ఒక అద్భుతః. పిల్లలు అమెరికాలో ఉంటే తెలుగును, సంప్రదాయాన్ని కాపాడుతూ ఒంటరిగా బతికే జంట కథ అది. చాలా గొప్ప ప్రక్రియ. బాలు ఆ సినిమాకు శరీరం,ప్రాణం కూడా.

అతిశయిల్లిన మాధుర్యం

హాస్పటల్‌ అత్యవసర చికిత్సా పరికరాలు గొంతులో దూరి గందరగోళం చేసేదాకా బాలు గొంతు తీయగా పాడుతూనే ఉంది. నానాటికీ మాధుర్యం అతిశయిల్లుతూనే ఉంది.

కాని తెలుగు సినిమా నిర్మాతలు, దర్శకులు. కథానాయకులు ఆయన ప్రతిభకు తగిన రీతిలో పాటల సన్నివేశాలు కల్పించకపోవడం, ఆయనతో పాడించకపోవడం ఆశ్చర్యకరం. అంతటి మహాగాయకుడితో ఎందుకు పాడించుకోలేదో అర్థం కావడం లేదు. ఒకవేళ జనం వినకపోతే ఎందుకు వినలేదో అర్థంకాదు.

లలిత సంగీత విశ్వవిద్యాలయం

సమయానికి ఈటీవీ బాలుకు సరైన వేదిక కల్పించింది. ఆ చిన్నతెరను ఆయన లలిత సంగీత విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దారు. ఎందరో చిన్నారులు అక్కడ పాటకు ‘పట్టా’భిషేకం చేసుకున్నారు. యువకులు గాయకులుగా ఎదిగారు. ఇవ్వాళ ఆయన స్వయంగా పాడుతూ, మాట్లాడుతూ రూపొందించిన వేలాది వీడియోలు యూట్యూబ్‌లో అందరికీ అందుబాటులో ఉంటూ బాలును ఒక్క క్లిక్‌తో సజీవంగా సాక్షాత్కరింపజేసే సాధనాలుగా మిగిలి ఉన్నాయి. సినిమాలో ఆయన పాటకు మరెవరో కనిపిస్తారు కానీ, స్వరాభిషేకం కార్యక్రమాల్లో సొంతంగా పాడుతూ బాలు మనకు ప్రతిపాటలో పలకరించేవారు. బాలు ఈ లోకంలో లేకపోయినా ఆయన పాటలు మాటలు మనను పలకరిస్తూనే ఉంటాయి. మనసు పులకరిస్తూనే ఉంటాయి. ఆతను నరావతారమెత్తిన గంధర్వ నశ్వర స్వరమూర్తి. ఎగిసిపడే ఉత్తుంగ స్వర సుర ఝరీ తరంగం. ఆ నాదాత్మకుడికి అశ్రుకణాలతో అక్షర నివాళులు.

 

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles