దిల్లీ: గానగంధర్వుడు ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం మరణానంతరం ప్రకటించిన పద్మవిభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బాలు తనయుడు చరణ్ కు మంగళవారంనాడు రాష్ట్రపతి భవన్ లో అందజేశారు. సోమవారంనాడు 2020 పద్మ పురస్కారాలను అందజేయగా, 2021 పురస్కారాలలో కొన్నింటిని మంగళవారంనాడు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి కూడా ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, దేశీయాంగమంత్రి అమిత్ షా హాజరైనారు.
పురస్కారాలకు 2021 నిమిత్తం 118 మందిని ఎంపిక చేశారు. వీరిలో ఏడుగురికి పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించారు. దేశంలోని పౌరపురస్కారాలలో ఇది రెండో అతిపెద్దది. పద్మభూషణ్ కు పదిమందినీ, పద్మశ్రీకి 101 మందినీ ఎంపిక చేశారు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే కి పద్మవిభూషణ్, బ్రిటన్ కు చెందిన సినీదర్శకుడు పీటర్ బ్రూక్ కి పద్మశ్రీ అవార్డు ప్రకటించారు. వీరిద్దరూ అవార్డు ప్రదానోత్సవానికి హాజరు కాలేదు.
తెలంగాణకు చెందిన గుస్సాడీ కళాకారుడు కనకరాజు, ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకి చెందిన వయోలిన్ విద్వాంసుడు అన్నవరపు రామస్వామి, మృదంగ విద్వాంసురాలు (దేశంలోనే తొలి మృదంగ కళాకారిణి) దండమూడి సుమతి రామమోహన్ రావు, అనంతపురంజిల్లాకు చెందిన సాహితీవేత్త ఆశావాది ప్రకాశరావు పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. ఒడిశాకు చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ సాహూ, కర్ణాటక వైద్యుడు బీఎం హెగ్డే పద్మవిభూషణ్ పురస్కారాలు గ్రహించారు. లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్రామహాజన్, మాజీ ఐఏఎస్ అధికారి నృపేన్ మిశ్ర పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్, కేంద్ర మాజీ మంత్రి రాంవిలాస్ పాస్వాన్ లకు కూడా మరణానంతరం ప్రకటించిన పురస్కారాలను వారి వారసులకు అందజేశారు.