శ్రీరమణ
ప్రతివాద భయంకర శ్రీనివాస్, మనమంతా ఇష్టంగా పిలుచుకుని పి.బి. శ్రీనివాస్, ప్రారంభంనుంచీ యస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ప్రచారకుడిగా దొరికాడు. బాలు పాటల ప్రపంచంలోకి వస్తూ వస్తూ ఉన్న రోజుల్లోనే పి.బి. శ్రీనివాస్ కి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పేరు ప్రతిష్టలున్నాయి. ఆయన తనకు తెలిసిన దర్శకుల, నిర్మాతల దగ్గరకు పనికట్టుకు వెళ్లి, ‘‘కొత్తగా ఓ కుర్రాడు వస్తున్నాడు, అద్భుతంగా పాడుతున్నాడు. ఎలాంటి పాటలైనా పాడేస్తాడు. నన్ను నమ్మండి’’ అంటూ ప్రచారానాకి దిగేవాడు. ఇంతటి సీనియర్ సింగరు మధుర గాయకుడు ఇంతలా చెబుతున్నాడేమిటని చాలామంది బాలువైపు తొంగి చూశారు. కావల్సిన వాడు దొరికాడని అంతా అక్కున చేర్చుకున్నారు. బాలు దొరికిన అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. పాడాడు, పాడాడు. 40 వేల సినిమా పాటలు పాడాడు. భూమ్మీద ఉన్న సగానికి పైగా భాషలతో మాట కలిపాడు. ఎవరికి వారు తమవాడే అనుకునేంత చొరవగా వారి భాషల్లో వొదిగిపోయాడు.
సినిమా పాటల స్కోరుని అలా ఉంచితే, బాలు పాడిన ప్రైవేట్ ఆల్బమ్స్ కనీసం ఓ అయిదువేలు ఉండకుండా ఉండవు. అప్పట్లో వేటూరి సుందరామ్మూర్తి గీతాంజలి క్యాసెట్స్ సంస్థని ప్రారంభించారు. చక్రవర్తి సంగీత దర్శకత్వంలో వేటూరి సాహిత్యాన్ని బాలు దేశానికి పంచారు. అదొక కుటీర పరిశ్రమగా కొన్నేళ్లు నడిచింది. కేవలం 50 ఏళ్లలో ఒక్కమనిషి ఇన్నివేల పాటలు ఎలా పాడాడన్నది ఆశ్చర్యమే గానీ ఆ తర్వాత తర్వాత వచ్చిన టెక్నాలజీ బాలుకి ఆత్మబంధువు అయింది. రికార్డింగ్ థియేటర్లలో అనూహ్యమైన సౌకర్యాలు వచ్చాయి. వంద నుంచి నూట ఇరవై ట్రాక్ లు విడివిడిగా రికార్డ్ చేయడం, పాత పద్ధతిలో ‘‘మోనోలు’’ పోయి ‘‘స్టీరియోలు’’ వచ్చేసాయి. ఇదొక విప్లవం, పెద్ద వెసులుబాటు. ప్రతివాద్యం ఒక నూలుపోగై మగ్గం మీద తిష్టవేసేది. See Also: బతుకే పాటగా మార్చినందుకు జోహార్ ఇదిగో నీకూ…
కాలం కలిసివచ్చింది
స్టింగ్స్ వారు పర్కిషన్ వారు కోరస్ బృందం ఎవరేమి తప్పుచేసినా తిరిగి రెడ్డొచ్చే మొదలాడిగా బాలు అందుకోనక్కర లేదు. చివరకు ట్రాక్ పాటగాళ్లు కూడా రంగప్రవేశం చేసారు. ఇక తీరుగా వడ్డించిన విస్తరి ముందు నేపథ్యగాయనీ గాయకులు వచ్చి గొంతులు సవరించుకోడమే ఉండేది. అయితే, ఇది అంత తెలికని కానేకాదు. కాలం కలిసివస్తుందని, కనుకనే బాలు తరంలో వేలాది పాటలు పాడే వీలు వచ్చిందని చెప్పడానికే ఇది. ఒకే ఒక రోజులో 21 పాటలు పాడి బాలు రికార్డ్ నెలకొల్పాడు. ఎన్ని స్టేజిషోలు, ఎన్నో స్టేజి కచేరీలు. వెళ్లని దేశం ఉంటుందని అనుకోను. అన్ని చోట్ల అభిమానులు, మిత్రులు ఎంత బలగాన్ని తయారుచేసుకున్నార్సార్. వృత్తిపరంగా యస్పీ నిర్భయంగా ఉండేవారు. అన్నీ తినేవారు, అన్నీ తాగేవారు. స్వరపేటికకి సంబంధించి చాలా సున్నితమైన శస్త్రచికిత్సలకు సైతం హాజరై విజయుడై వచ్చారు.
బాపు, రమణలతో అనుబంధం
బాపు మళ్లీ చిత్రరచన చేసిన ‘‘లీలా జనార్దనమ్’’ పుస్తకాన్ని బాలు సర్వాంగ సుందరంగా ముద్రించారు. అంతకుముందు రమణగారు రచించిన ‘‘లీలాకృష్ణుడు’’ పుస్తకాన్ని బాలు అంకితం తీసుకున్నారు. బాపు ఫిలిం ఆర్కెస్ట్రాలో మౌతార్గాన్ వాయించేవారు. హార్మోనియం కూడా ఉండేది. బాపు అసలు వాడడం లేదనీ తెలిసి యెస్పీ కోరి ఆ హార్మోనియం కొనుక్కున్నారు. బాపుగారిని దగ్గరుండి మద్రాస్ లో డాక్డర్లచుట్టూ తిప్పింది బాలుగారు. లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డ్ కోసం బాపుని దుబాయ్ కూడా ఉండి తీసుకు వెళ్లారు. మిథునం సినిమా అందులో బాలు నటన బాపుకి ఎంతగానో నచ్చింది. అప్పటికి రమణ లేడు. అదొక్కటే లోటు అన్నారు పాపం. మూడు తానాల క్రితం నేను అమెరికా వెళ్లినప్పుడు బాలు ఎదురై, బుజాల మీద రెండుచేతులూ వేసి ‘‘ఎక్కడ దిగారు మీ విడిది ఎక్కడో’’ అని అడిగారు. మిత్రులు డాక్టర్ జంపాల చౌదరి, అరుణగారల ఆతిథ్యంలో ఉన్నానని చెప్పాను. బాలు స్వచ్ఛంగా నవ్వి, మంచిది. ఇహ అంతకంటే మంచి చోటు మీకు చూపించలేను’’ అంటూ నాతోపాటు ఉన్న డాక్టర్ జంపాల దంపతుల్ని అభినందించి వెళ్లారు. See Also: మహా ప్రతిభామూర్తి మహాభినిష్క్రమణ
లేత అరిటాకు భోజనం
మద్రాస్ కామదార్ నగర్ లో బాలు ఇల్లు. ఆ ఇంటి చుట్టూ అతిథి గదులు. ఆ గదుల్లో నలుమూలల్నించి వచ్చిన అతిథులు. అదొక పెళ్లి విడిదిలా కళకళలాడుతూ ఉండేది. నూజివీడు నుంచి వచ్చే యమ్వీయల్ అండ్ కో, విశాఖ నించి దిగే కవి మిత్రులు, రాజమండ్రి, కాకినాడ కథకులు ఇలా ఎన్ని బీరకాయపీచులో. ఓ పెద్దావిడ వేళకి వచ్చి అందర్నీ పలకరించి ఉపవాసాలవారిని, ఒంటిపొద్దువారిని లెక్కరాసుకు వెళ్తూండేది. ‘‘గృహస్తు’’ అంటే ఇలా ఉండాలనుకునేవాళ్లం. బాలు మిత్రలోకం గురించి బానే చెప్పుకుంటారు. నెల్లూరు అంటే ప్రత్యేక అభిమానం. ఏదేశమేగినా, ఎందు కాలిడినా భోయనం చేస్తే మా నెల్లూరు లేత అరిటాకు భోజనం తర్వాతేనని మురిసి ముచ్చటపడేవారు. నలుగురు వాళ్ల ఊరివారు కలిసినప్పుడు, ‘‘ఏందన్నా…’ అంటూ చక్కటి నెల్లూరు శ్లాంగ్లో మాట్లాడి రంగనాయకస్వామి గుడిగంటలు మోగినట్లు చేసేవారు. పాటలు ఎన్నైనా పాడచ్చు. కబుర్లు ఎన్నైనా చెప్పొచ్చు. కాని అంత మంది గాయకుల్ని గాయనీమణుల్ని ఓర్పునేర్పులతో సరిదిద్ది సంగీత ప్రియులకు దోసిళ్లతో వారిని అంకితం ఇవ్వడం యస్పీ చేసుకున్న సుకృతం. వారంతా రంగురంగుల సీతాకోకచిలుకలై, పల్లవులై, పదనిసలై బాలుని తలపిస్తూనే ఉంటాయి. ఇంకో వందేళ్లు యస్పీ శ్వాసిస్తూనే ఉంటారు.
(రచయిత ప్రసిద్ధ కథకులు, ప్రఖ్యాత జర్నలిస్టు. మొబైల్ నంబర్: 9502084358)