Sunday, December 22, 2024

బాలు రుణం తీర్చుకోవడం ఎలా?

మా శర్మ

కొన్ని రుణాలు తీర్చుకోలేము. కానీ, తీర్చుకొనే ప్రయత్నం చేస్తాం. అది ఆగకూడదు. చేస్తూనే ఉండాలి. బాలు ఋణం కూడా అంతే…. తన జీవితంలో తనకు అండగా నిలిచిన వారందరి ఋణాన్ని తీర్చుకొనే పనిచేసి బాలు కృతార్థుడయ్యారు. సినిమాల్లో  తొట్టతొలి అవకాశం ఇచ్చిన గురువు కోదండపాణి పేరును తను స్థాపించుకున్న  రికార్డింగ్ స్టూడియోకు పెట్టుకున్నాడు. తమిళంలో తొలి అవకాశం ఇచ్చిన ఎమ్మెస్ విశ్వనాథన్ ను నభూతో న భవిష్యతి అన్నట్లుగా ఘనంగా సత్కరించుకొని కృతజ్ఞతను చాటుకున్నాడు. తండ్రితో సమానంగా భావించే ఘంటసాల విగ్రహాన్ని హైదరాబాద్ లో నెలకొల్పి  తన ప్రేమను నిలుపుకున్నాడు.

నెల్లూరు ఇల్లు వేదవిద్య కోసం

తను పుట్టిన అమ్మమ్మగారి ఊరు కోనేటంపేటకు ఎన్నో సేవా కార్యక్రమాలు అందించాడు. తన సొంతఊరుగా మారిన నెల్లూరులో పిత్రార్జితంగా వచ్చిన కోట్లు విలువ చేసే ఇంటిని వేదవిద్య కోసం కంచి పీఠానికి సమర్పించి ఋషి ఋణం తీర్చుకున్నాడు. సహోదరుడుగా భావించే కె జె ఏసుదాసు పాదాలు కడిగి శిరసున చల్లుకొని భాతృప్రేమను హృదయం పరచి చూపించాడు.

తన చిన్ననాటి స్నేహితుడు, వ్యక్తిగత కార్యదర్శిగా ఎన్నో ఏళ్ళు తనతో ప్రయాణం చేసిన విఠల్ మొదలు ఎందరో ప్రాణ మిత్రులకు తనకు చేతనైనంత సహాయ సహకారాలు అందించాడు. ప్రతి ఏటా భిక్షాటనా  పూర్వక త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరిపి, హరికథ కళాకారులను ఉచితరీతిన గౌరవించి,  హరికథ కళాస్వరూపుడైన తండ్రి సాంబమూర్తి ఆత్మసంకల్పానికి ఆరతి పట్టి, పితృఋణం తీర్చుకున్నాడు. ఇలా.. ఒకటేమిటి, ఒకరేమిటి తన జీవన భాగస్వామ్యులు, తన  స్ఫూర్తి ప్రదాతలు మొదలు అందరి ఋణం తీర్చుకున్నాడు. మాతృభూమి, మాతృదేవత, ఋషులు, గురువులు, పితృదేవతలు, హితులు, స్నేహితుల ఋణం  తీర్చుకొని ఆదర్శంగా నిలిచిన  బాలు ఋణం మనం తీర్చుకోవాలి.

పాటకు పర్యాయ పదం

సినిమా పాటకు పర్యాయపదంగా నిలిచి, కోట్లాది మందికి ఆత్మానందాన్ని, రసానందాన్ని పంచిన అమరగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ  మొదలు అనేక  భాషా నటులకు, హీరోలకు వేల పాటలు పాడి, తన గొంతులో వాళ్ళ పాత్రలను పలికించి,  వారి విజయ సోపానంలో కీలక భూమిక పోషించిన నేపథ్య గాయక శిఖరం ఎస్పీబి. ఇటు ప్రేక్షకులకు, అటు నటులకు అందరికీ ఆనందాన్ని పంచాడు. ఇందరికి ఆత్మానందాన్ని పంచిన బాలు ఆత్మకు  అనందం, శాంతి ఇవ్వాలి. అదే నిజమైన నివాళి. అందులో అందరూ పాత్రధారులవ్వాలి. వీళ్లందరి కంటే ముందుగా బాలు ఆత్మకు శాంతి చేకూర్చాల్సిన బాధ్యత బాలు పిల్లలదే.

బాలు వారసత్వాన్ని చరణ్ కొనసాగించాలి

బాలును  ఇంతవాడిని చేసింది “పాట”. ఆ పాటపై ప్రేమతో కూతురుకు పల్లవి, కుమారుడుకి చరణ్ అని పేర్లు పెట్టుకొని బాలు మురిసిపోయాడు. ఈ మురిపం వెనుక బలమైన కోరిక  దాగివుంది. పల్లవి, చరణ్ లు సినిమాల్లో పాటలు పాడుతూ, బాగా పేరు తెచ్చుకొని, తన వారసత్వాన్ని నిలబెట్టాలని బాలు  సంకల్పం. అది పెద్దగా నెరవేరలేదు. పల్లవి  పాడిన సందర్భాలు  ఎక్కువగా లేవు. చరణ్ ఎప్పుడో ప్రారంభంలో కొంతకాలం, అప్పుడప్పుడు  పాడుతున్నాడు. చరణ్ కు నేపథ్య గాయకుడుగా ఇంకా  పెద్దగా గుర్తింపు  రాలేదు. బాలు 50 ఏళ్ళ సినీ ప్రస్థానం సందర్బంగా విదేశాల్లోనూ, ఈ మధ్య కొన్ని వేదికల్లోనూ చరణ్ కాస్త పాడుతున్నడు. ఈ కాస్త దానికే బాలు ఎంతో మురిసిపొయ్యేవాడు. ఇది బాలుకు కుమారుడు ఇచ్చిన తాత్కాలిక అనందం మాత్రమే. నిజం చెప్పాలంటే, పల్లవి, చరణ్ ఇద్దరు బాగా పాడుతారు. పాడించి మెప్పించే లక్షణం, గొంతు, ప్రతిభ ఇద్దరికీ ఉన్నాయి.  సంసారజీవితంలో ఉన్న పల్లవికి ఒకవేళ సంపూర్ణంగా సాధ్యపడక పోయినా, వీలైనప్పుడు పాడుతూ వుండాలి. ముఖ్యంగా, బాలు వారసత్వాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత చరణ్ కే వుంది. చరణ్ బాగా పాడతాడు, మంచి గొంతు, తనదైన ప్రతిభ కూడా ఉన్నాయి. బాలు కుటుంబం నుండి ప్రేక్షకులు కోరుకొనేది  మంచి పాటలు. ఆ బాధ్యత చరణ్ చేపట్టాలి.  పూర్తిస్థాయి గాయకుడుగా  అవతారమెత్తాలి. విరివిగా  పాడాలి. అందర్నీ మెప్పించాలి. తండ్రిని తలపించాలి. అప్పుడు అందరూ సంతోషిస్తారు.

ఆత్మలనేవి వుంటే దివ్య లోకాల్లో ఉండే బాలు ఆత్మ  అప్పుడు శాంతిస్తుంది, ఎంతో సంతోషిస్తుంది. ఆత్మలు లేకపోయినా, బాలు జీవించి ఉన్నప్పుడు పెట్టుకున్న కోరిక, ఆశయం, సంకల్పం నెరవేరుతాయి.  బాలు నుండి చరణ్ స్ఫూర్తి పొంది,  ఆ వారసత్వం కొనసాగించాలి. ప్రేక్షకులు, పాటల ప్రేమికులు బాలును ఎప్పటికీ మర్చిపోలేరు. మరచిపోకుండా ఉండాల్సింది సినిమా పరిశ్రమ. ముఖ్యంగా,  తెలుగు సినిమా రంగం.

బాలు పేరుమీద ఏదైనా చేయాలి

కోవిడ్ వల్ల, కరోనా సాకుతో బాలు భౌతికకాయ సందర్శనానికి తెలుగు పరిశ్రమకు చెందిన  వ్యక్తులు వెళ్లలేక పోయారు. వెళ్లలేక పోయినా, బాలు పేరు మీద చిరస్థాయిగా ఉండేలా తెలుగు సినిమా పరిశ్రమ ఏదైనా బృహత్ కార్యక్రమం చేపట్టాలి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) దానికి  నడుం బిగించాలి. రెండు తెలుగు ప్రభుత్వాలు  బాలు స్మృతిని గౌరవించాలి. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషించాలి. బాలు  సొంత ఊరు ప్రకాశం జిల్లా కందుకూరు దగ్గర మాచవరం, పెరిగిన నెల్లూరు, గడిపిన నగరి, శ్రీకాళహస్తి మొదలైన ప్రాంతాల్లో స్మృతి చిహ్నాలు ఏర్పాటు చెయ్యాలి. బాలు పేరు మీద పురస్కారాలు ప్రకటించాలి. బాలు ఆశయం సిద్ధించేలా నెల్లూరులో మహాకవి తిక్కన విగ్రహం, స్మృతి భవనం స్థాపించాలి.

చిరంజీవి చేయగలరు

కర్ణాటక, తమిళనాడు ప్రజలు తమ సొంతమనిషిగా బాలును గుండెకు హత్తుకున్నారు. అధికారంలో ఏ రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ,  తమిళనాడు ప్రభుత్వాలు  బాలును మొదటి నుండీ తమ  భూమి పుత్రుడుగా భావించాయి. పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి గౌరవాలన్నీ తమిళనాడు ప్రభుత్వ సిఫారసుల తోటి, నాయకుల ప్రభావంతోనే వచ్చాయి.మన త్యాగయ్యను, మన నాగయ్యను కూడా తమిళులే సొంతం చేసుకున్నారు. బాలు నూటికి నూరు శాతం మన తెలుగు బిడ్డ. మన బిడ్డ. బాపుకు పద్మశ్రీ  రావడంలో చిరంజీవి చేసిన కృషి గణనీయమైంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరి దగ్గర చిరంజీవికి ఎంతో  పరపతి, చనువు ఉన్నాయి. వారు కూడా చిరంజీవి మాటకు ఎంతో విలువనిస్తున్నారు. బాలుతో, వారి కుటుంబంతో చిరంజీవికి ఎంతో ఆత్మీయ అనురాగబంధం ఉంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బాలుకు అత్యంత ఆప్తులు. నేను సైతం… అంటూ అందరూ ఈ యజ్ఞంలో ఏకమవుతారని ఆశిద్దాం. మమేకమవ్వాలని అభిలషిద్దాం.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles