చిరకాలం, కలకాలం జనం హృదయాలలో జీవించే మహనీయులందరూ చిరంజీవులే. వారు కవులు, కళాకారులైతే, రససిద్ధి పొంది యశఃకాయులై ఎప్పటికీ జీవించే ఉంటారు. అదిగో ఆ కోవకు చెందినవారే ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఘంటసాల వెళ్లిపోయి దాదాపు ఐదు దశాబ్దాలైంది. మనలో ఆయనను చూసినవాళ్ళు చాలా తక్కువమంది ఉన్నారు. కానీ, మరువగలిగామా? మరువగలమా? ఎక్కడ నుంచో… శుక్లాంబర ధరం విష్ణుం.. అని ఆ అమృతగానం వినపడగానే ఒక్కసారిగా చైతన్యవంతులమవుతాం. అబ్బా! ఏమి గాత్రం అనుకుంటాం. అలా మన మనసు పొరల్లోకి ఘంటసాల వచ్చిచేరతారు. దానినే అమరత్వం సిద్ధించడం అంటారు. బాలు అటువంటివారే. భౌతికంగా శరీరాన్ని వదిలి ఒక సంవత్సరం పూర్తయింది. బాలు వెళ్లిపోయి అప్పుడే సంవత్సరం అయిపొయిందా.. అని అనుకుంటున్నాం తప్ప, ఏదో ఒక రూపంలో మనకు కనిపిస్తూ, వినిపిస్తూనే ఉన్నారు. ఆ నిత్య స్మరణీయమే బాలసుబ్రహ్మణ్యం. అదే చిరంజీవత్వం. మాటలు వచ్చినప్పటి నుంచీ ఆయన పాటలు పాడుతూనే వున్నారు. ఊహ తెలిసినప్పటి నుంచీ నటిస్తూనే ఉన్నారు. బాలు పుట్టు కళాకారుడు, సహజ ప్రతిభావంతుడు. సకల కళావల్లభుడైన ఆ మూర్తిమత్వంలో గానం విశ్వరూపమై విరాజిల్లింది. ‘పాడుతా తీయగా’ మూలాన సుమారు రెండున్నర దశాబ్దాల పాటు ఆయనను చూస్తూ ఆ రసప్రసిద్ధమైన వాక్కులు వినగలిగే సౌభాగ్యం మనకు దక్కింది.ఎంత బాగా పాడతారో,అంత బాగా మాట్లాడతారని మనం అనుభవంలో ఆనందించాం. నిజం చెప్పాలంటే ఆ మాటలు వినడం కోసమే ఎక్కువమంది ఆ కార్యక్రమాన్ని చూసేవారు.
Also read: అమరశిల్పి అక్కినేని
దర్శించి, ఆలకించి, పులకించే అదృష్టం
మీడియా విస్తరించిన నేపథ్యంలో, ఇంటర్వ్యూలు, కచేరీలలో ఆయన్ని దర్శించి పులకించే అదృష్టం మనల్ని వరించింది. వివిధ సాంస్కృతిక సంస్థలు నిర్వహించిన సభలకు అతిధిగానో, సత్కార స్వీకర్తగానో వచ్చినప్పుడూ ఆయనను చూడగలిగాం, వినగలిగాం. అడపాదడపా కొన్ని సినిమాల్లోనూ నటించారు. ఆ పాత్రలన్నీ విలక్షణమైనవే. పవిత్రబంధం, మిధునం రెండు సినిమాలు చాలు ఆ నటవిరాట్ స్వరూపాన్ని ‘కొలవ’డానికి. కొన్ని పాత్రలకు గాత్ర దానం కూడా చేశారు. అందులో పాత్రలు కనిపిస్తాయి తప్ప, బాలు కనిపించరు. అదే నిజమైన గాత్రపోషణం. కమల్ హాసన్ ‘దశావతారం’, ‘అన్నమయ్య’లో సుమన్ పోషించిన వేంకటేశ్వరుని పాత్రలు చాలు బాలు ‘దశకంఠుడు‘ అని చెప్పడానికి. ఆ చేరాత, ఆ రాతలో వాక్యాలు చాలా అందంగా ఉంటాయి. పొందికగా భావస్ఫోరకంగా మాటలు ఒలికించే మంచి రాతగాడు. అనేకమంది ఆత్మీయుల ఉత్తరాల్లో, పుస్తకాల ముందుమాటల్లో బాలు మాటల మూటలు కనిపిస్తాయి. కేవలం గాత్రదానమే కాదు, అనేక దానధర్మాలు కూడా చేశారు. హితులు, స్నేహితులకు అనేక రూపాల్లో చేదోడువాదోడుగా నిలిచారు. ఆ గానం విలువ అందరికీ తెలుసు కానీ, ఆ దానం విలువ అందుకున్నవారికి మాత్రమే తెలుసు. గుప్తదాత. కొంతమంది స్నేహితులు సినిమాలు తీసినప్పుడు అప్పులకు ఆయన గ్యారంటీ సంతకాలు పెట్టారు. వాళ్ళు చేతులెత్తేస్తే, ఎన్నో ఏళ్ళపాటు వాటికి చక్రవడ్డీలు బారువడ్డీలు కట్టి ఆ అప్పులన్నీ ఆయనే తీర్చేశారు. ఇలా కష్టార్జితం, ధర్మార్జితాన్ని ఎంతో కోల్పోయారు. అయినా ఎప్పుడూ మనసు కష్టపెట్టుకోని మనస్విని.
Also read: తెలుగు సాహిత్య విశ్వరూపం విశ్వనాథ
మర్యాదరామన్నతో శ్రీకారం
ఆయన చిత్ర గాత్ర జీవితం ప్రారంభమైంది ‘ శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న’ సినిమా నుంచి. బాలు కూడా మర్యాద రామన్నే. ఎంతో మర్యాదగా మాట్లాడడం, పెద్దల పట్ల వినయంగా వర్తించడం ఆయన నుంచి నేర్చుకోవాలి. ‘వినదగు నెవ్వరు చెప్పిన..’ అన్న సుమతీ శతకకారుడి సూక్తులను బాలు అక్షరాలా ఆచరించారు. తొలి అవకాశం ఇచ్చిన సంగీత దర్శకుడు కోదండపాణి, తొలి పారితోషికం ఇచ్చిన నిర్మాత పద్మనాభం బాలుకు నిత్యస్మరణీయులు. తన ప్రగతి ప్రస్థానంలో, జీవిత గతిలో తోడునీడగా నిలిచిన ప్రతివ్యక్తినీ మదిలో నిలుపుకున్న కృతజ్ఞతాశీలం ఆయన సొత్తు. ఎత్తుపల్లాలను మరువని విచక్షణ ఆయన సొమ్ము. బాలు మావాడు.. మనవాడు..అని కన్నడిగులు,తమిళులు, తెలుగువారు గుండె చరుచుకొని చెబుతారు. ఆబాలగోపాలబాలుడైన బాలసుబ్రహ్మణ్యం అందరివాడు. అందనంత ప్రతిభాస్వరూపుడు, అచ్చమైన కళాకారుడు. ఇంతటి బహుముఖ ప్రజ్ఞామణుల పుట్టుక చాలా అరుదైనది. బాలు స్థానాన్నీ ఎవ్వరూ భర్తీ చేయలేరు.
Also read: మహామహోపాధ్యాయుడు సర్వేపల్లి రాధాకృష్ణ
తరగని నిధి
ఆయన సృష్టించిన గొప్ప సంపద మన ఎదుటనే ఉంది. తరతరాల పాటు అనుభవించినా అది తరగని నిధి. సంగీత సాహిత్యాలను హృదయపూర్వకంగా అనుభవించడం, భాషకు నిండైన గౌరవాన్ని ఇవ్వడం ప్రతి గాయకుడు బాలు నుంచి నేర్చుకోవాల్సిందే. అనుకరించే ప్రజ్ఞ ఉన్నప్పటికీ ఆయన ఎవ్వరినీ అనుకరించక, తన సొంత గాత్రధర్మం, మనోధర్మాన్ని మాత్రమే అనుసరించి, తనదైన విశిష్టమైన ముద్రవేసుకున్నారు. పాత్రోచితంగా వ్యవహరించారు. ఆ నటుడి గాత్ర ధర్మం, హావభావాలకు తగ్గట్టుగా ఒదిగారు తప్ప, మిమిక్రీ చెయ్యలేదు. ‘ప్లేబాక్’ అనే మాటకు నూరుశాతం న్యాయం చేశారు. బాలసుబ్రహ్మణ్యం నుంచి నేర్చుకోవాల్సిన ఎన్నో సుగుణాలు ఉన్నాయి. వినయం, వివేకం, సహనం,సాధన మొదలైనవన్నీ ‘మణి’పూసలే. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా,ఆ గానం వింటే చాలు..రసానందం, జ్ఞానానందం సంపూర్ణంగా అందుతూనే వుంటాయి. బాలు చిరంజీవి.
Also read: హరికథకు పర్యాయపదం ఆదిభట్ల