- 14 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై సఫారీలు
వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ క్వింటన్ డి కాక్ నాయకత్వంలోని సౌతాఫ్రికా క్రికెట్ జట్టు 14 సంవత్సరాల విరామం తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టింది. ఉగ్రవాదుల అడ్డాగా మారిన పాకిస్థాన్ పర్యటనకు విదేశీజట్లు గత పదేళ్లుగా దూరంగా ఉంటూ వస్తున్నాయి. దానికితోడు పాక్ జట్టు సైతం తన హోమ్ సిరీస్ లను గల్ఫ్ దేశాలు అబుదాబీ, దుబాయ్, షార్జా వేదికగా నిర్వహిస్తూ వస్తోంది.
గత రెండు సంవత్సరాలుగా పరిస్థితి కాస్త మెరుగుపడడంతో..విదేశీజట్లు పాక్ పర్యటనకు రావటానికి సాహసం చేస్తున్నాయి. 2009లో శ్రీలంక జట్టు ప్రయాణిస్తున్న బస్‌పై ఉగ్రవాదులు దాడి చేయడంతో పాక్‌లో క్రికెట్ ఆడేందుకు ఇతర జట్లు విముఖత చూపాయి.
అయితే…14 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్తాన్ గడ్డపై సిరీస్ ఆడటానికి సౌతాఫ్రికాజట్టు ఆమోదం తెలిపింది. పాకిస్తాన్‌తో రెండు టెస్టులు, మూడు టి20లు ఆడేందుకు క్వింటన్ డికాక్ నాయకత్వంలోని జట్టు కరాచీ చేరుకొంది. ఆఖరుసారిగా పాకిస్తాన్ వేదికగా ఈ రెండు జట్లు 2007లో టెస్టు సిరీస్ ఆడగా… సౌతాఫ్రికాజట్టు 1-0తో సిరీస్ విజేతగా నిలిచింది. అనంతరం అక్కడ పాకిస్తాన్… దక్షిణాఫ్రికాతో 2010, 2013 సీజన్లలో టెస్టు సిరీస్‌లు ఆడటం విశేషం. ప్రస్తుత సిరీస్ లోని తొలి టెస్టు జనవరి 26 నుంచి 30 వరకూ కరాచీ వేదికగా నిర్వహిస్తారు. రావల్పిండి వేదికగా రెండో టెస్టు ఫిబ్రవరి 4 నుంచి 8 వరకూ జరుగనుంది. ఆ తరువాత జరిగే మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్‌కు లాహోర్ వేదికగా ఉంటుంది. ఈ మూడుమ్యాచ్ లూ ఫిబ్రవరి 11, 13, 14 తేదీల్లో నిర్వహిస్తారు.
Also Read : వందటెస్టుల క్లబ్ లో కంగారూ ఆఫ్ స్పిన్నర్