- కోల్ కతా అపోలో ఆస్పత్రిలో దాదా
బీసీసీఐ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని హృద్రోగ సంబంధ సమస్యలు ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. గుండెలోని రక్తనాళాలు మూసుకుపోడంతో..కొద్దిరోజుల క్రితమే యాంజియోప్లాస్టీ చికిత్స చేయించుకొన్నదాదా ఇంటిపట్టునే ఉండి విశ్రాంతి తీసుకొంటున్నారు. అయితే..మరోసారి గుండెలో నొప్పితో పాటు తలతిరిగినట్లుగా అనిపించడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు బెంగాల్ మీడియా తెలిపింది. కరోనా వైరస్ దెబ్బతో గత ఏడాదికాలంగా క్రికెట్ కార్యకలాపాలు స్తంభించిపోయినా..గంగూలీ మాత్రం విదేశీగడ్డపై ఐపీఎల్ ను నిర్వహించడంలో విజయవంతమయ్యారు. అయితే..జనవరి 2న గుండెలో మంటగా అనిపించడంతో తన కారులోనే డ్రైవర్ సాయంతో వచ్చి కోల్ కతా వుడ్ ల్యాండ్స్ ఆస్పత్రిలో చేరారు.
రక్తనాళాలలో నాలుగు బ్లాకులు:
క్రికెటర్ గా ఉన్నంతకాలం చక్కటి ఫిట్ నెస్ తో ఉన్న సౌరవ్ గంగూలీ రిటైర్మెంట్ తర్వాత సైతం ఆరోగ్యంగానే కనిపించారు. అయితే జనవరి 2న తొలిసారిగా గుండెలో నొప్పిగా ఉండడం, తలదిమ్ముగా మారిపోడంతో వుడ్ ల్యాండ్స్ ఆస్పత్రిలో చేరి పరీక్షలు చేయించుకొంటే గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు మూసుకుపోయినట్లు తేలింది. ప్రముఖ హుద్రోగ నిపుణుడు దేవిశెట్టి కోల్ కతాకు వచ్చి సౌరవ్ గంగూలీకి యాంజీయో ప్లాస్టీ చికిత్స నిర్వహించారు. జనవరి 2 నుంచి 6 వరకూ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకొన్న దాదాను జనవరి 7న డిశ్చార్జి చేశారు. అయితే కొద్దిరోజుల విరామం తర్వాత మిగిలిన మూడు బ్లాకులకు యాంజియోప్లాస్టీ చికిత్స చేయించుకోవాలని సలహా ఇచ్చారు.
ఇది చదవండి: సౌరవ్ గంగూలీకి గుండెపోటు
అప్పటి నుంచి 48 సంవత్సరాల సౌరవ్ గంగూలీని ఆయన నివాసంలోనే ఉంచి చికిత్స కొనసాగిస్తున్నట్లు వుడ్ ల్యాండ్స్ హాస్పిటల్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రూపాలీ బాసు ప్రకటించారు. అప్పటి నుంచి తొమ్మిదిమంది సభ్యుల వైద్యుల బృందం గంగూలీ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ వస్తున్నారు. రెండు లేదా మూడువారాలపాటు మందులు వాడిన తరువాత పూడుకుపోయిన మిగిలిన మూడు రక్తనాళాలను యాంజియోప్లాస్టీ ద్వారా బాగు చేయాలని నిర్ణయించారు. ఈ లోగానా దాదాకు మరోసారి గుండెనొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.
ఇదిలావుంటే గత మూడువారాలలో గుండెనొప్పితో రెండోసారి ఆస్పత్రిలో చేరిన సౌరవ్ గంగూలీకి అభిమానులు, శ్రేయోభిలాషులు సత్వరమే కోలుకోవాలంటూ సందేశాలు పంపారు.