- అధిష్ఠానానికి లేఖలు రాసిన అసంతృప్త నేతలు
- సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్
అధిష్ఠానంపై ధిక్కార స్వరం వినిపిస్తున్న అసంతృప్తి నేతలతో సోనియా అత్యవసరం గా సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడితో పాటు సీడబ్ల్యూసీ సభ్యత్వ పదవులకు ఎన్నికలు నిర్వహించాలని అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ 23 మంది సీనియర్ నేతలు లేఖలు రాశారు. సమావేశానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ సీనియర్ నేతలు అజయ్ మాకెన్ అంబికా సోని, చిదంబరం, మనిషీ తివారి, గులాం నబీ ఆజాద్, భూపేందర్ సింగ్ హుడా, హరీష్ రావత్, శశిథరూర్, ఏకే ఆంటోనీ, కపిల్ సిబల్ ఆనంద్ శర్మ, ప్రథ్విరాజ్ చవాన్ లతో పాటు రాహుల్ , ప్రియాంక గాంధీలు కూడా హాజరయ్యారు. సమావేశంలో పార్టీ అధ్యక్ష ఎంపిక, సంస్థాగత ఎన్నికలు, కొద్ది నెలల్లో జరగనున్న అసోం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, కేరళ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది.
2019 లోక్ సభ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. మళ్లీ అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు రాహుల్ గాంధీ తీవ్ర విముఖత వ్యక్తం చేశారు. దీంతో చేసేదేం లేక తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అధ్యక్షుడు లేకుండానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో ఘోర పరాజయాన్ని చవిచూస్తోంది. దీంతో సీనియర్ నేతలు అధిష్ఠానంపై బహిరంగంగానే విమర్శలు కురిపిస్తూ లేఖాస్త్రాలు సంధించారు.
ఇదీ చదవండి: ఢిల్లీకి రావాలని రేవంత్ రెడ్డికి పిలుపు
సమన్వయ కర్తగా కమల్ నాథ్ :
అయితే అత్యంత సంక్లిష్టమైన పరిస్థితులను చక్కదిద్దేందుకు సోనియా వ్యక్తిగత సలహాదారు అహ్మద్ పటేల్ మరణించడంతో ఆయన లేని లోటు పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది. అనారోగ్య కారణాలతో సోనియా గాంధీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ సంక్లిష్ట సమయంలో అసమ్మతి నేతలతో సోనియా సమావేశానికి కమల్ నాథ్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ అగ్ర నాయకత్వానికీ సీనియర్ నేతలకు మధ్య సమన్వయ కర్తగా ఉన్న అహ్మద్ పటేల్ అకస్మిక మరణంతో ఆ బాధ్యతలను సీనియర్ నేత కమల్ నాథ్ నెత్తిన వేసుకున్నారు. అయితే అటు అసమ్మతి నేతలతో గాని, సోనియాగాంధీతో గాని కమల్ నాధ్ కు అహ్మద్ పటేల్ లా సన్నిహిత సంబంధాలు లేవు. కాని అసమ్మతి నేతలతో సమావేశమయ్యేందుకు కమల్ నాథ్ సోనియా గాంధీని ఒప్పించగలిగారు.
ఇదీ చదవండి:టీపీసీసీ అధ్యక్షుడి ఎన్నిక: ఏకాభిప్రాయం కుదిరేనా?