మందలేదో ఉందంటే
మాపటేల మల్లి మావ కాడ కెల్లా.
నల్ల చీను గాడు నెల్లూరు కెలతాడట.
“ఏందిరా ఇది” అన్న.
“ఈడేముందిరా పేడ, పెంట. ఆడ నారాయణ లో సేరత
సదూకుంట.”
మల్లి మావ అందుకున్నాడు.
“నువ్వూ పోరాదట్రా. నీ బాబుకు నే సెపత.”
“నాకు సదువేం వస్తది మామ?
నేల మీద నాగలి తో గీకడం తప్ప.
వోడ్ని బోనీ. మంచిదే గంద.”
నల్ల చీను గాడు అప్పుడప్పుడు వచ్చే టోడు.
మాట మారె. ఏడ… నెల్లూరు యాస బోయే.
మద్దిన, మద్దిన ఇంగిలీషు…
అదేందో షిట్ అంటాడు… ఇంకేదో అంటాడు.
వోడు రానప్పుడు మామ ఆడి మందల చెప్పేటోడు.
“బాగుండాడ్రా. జీతం పెరిగిందట. ఇల్లు కట్టుకున్నాడట. “
ఇంకేదో సెప్పే టోడు.
పదేళ్లు బోయినయ్. పట్నం లో లేదట.
రాడం లే. ఇంకెడకో బోయాడట… సముద్రం దాటి.
మల్ల రాలే. మల్లి మామ ముందట్ల లే.
లచ్చిమి అత్త అటు తిరిగి కళ్ళొత్తు కుంటాన్ది.
నేనేం జెప్పాల, ఎట్టాగ జెప్పాల.
దీనమ్మ బడవ… ఎమ్ బతుకబ్బా.
ఆపొద్దున్నే మల్ల మందలొచ్చింది…
మల్లి మామ ఇంటి కాడ నుంచి
అదే ఆఖరా మందల.
ఆ సాయంత్రం
మల్లి మామకు నేనే కొరివి పెట్టా.
(నెల్లూరు యాస లో ఈ కవిత. మందల అంటే సమాచారం.)
Also read: లోహ(క)పు బిందె
Also read: ఇల్లు
Also read: జ్ఞాపకాలు
Also read: ఆమె
Also read: సమయం లేదు మిత్రమా