వోలేటి దివాకర్
వలంటీర్ల వ్యవస్థ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. పవన్ కు వ్యతిరేకంగా వలంటీర్లు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. అధికార వైస్సార్సీపీ మంత్రులు, నాయకులు పవన్ పై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర తాజా మాజీ అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు పవన్ వ్యాఖ్యలను సమర్ధించేలా మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలిగి, జాతీయ కార్యవర్గ సభ్యుడి హోదాలో సొంత ఊరు రాజమహేంద్రవరం వచ్చిన సోము వీర్రాజు మంగళవారం మీడియాతో మాట్లాడారు.
Also read: సర్వేలన్నీ వైసీపీ వైపే, అందులో రాజమహేంద్రవరం టాప్!
ప్రమాదకరమైన రీతిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా కుట్రపూరితంగా రాజకీయ ప్రయోజనాల కోసం వాలంటీర్ల వ్యవస్థను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో తీసుకొచ్చిందన్నారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ కోసం ఐదు వేల కోట్ల ప్రజాధనాన్ని ఇప్పటి వరకూ ఖర్చు చేశారని అన్నారు. ఒక పక్క రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందులతో ఎదుర్కొంటున్నా ఈ విధమైన రీతిలో ప్రజాధనాన్ని రాజకీయ ప్రాబల్యం కోసం ఖర్చు చేయడం మంచిది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థ రాజ్యాంగానికి విరుద్ధమైనదని ఆయన పేర్కొన్నారు. తక్షణమే వాలంటీర్ల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవస్థ చాల ప్రమాదకరమైనదని ఆయన అభిప్రాయపడ్డారు. వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా మూడున్నర ఏళ్ళ క్రితం శాసనమండలిలో చర్చించామన్నారు. మహిళల అదృశ్యం వెనుక వలంటీర్ల హస్తం ఉందన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆ అంశం కేంద్ర నిఘా సంస్థలు చూసుకుంటాయన్నారు. ఆధారాలు ఇస్తే కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు వ్యాఖ్యలపై వలంటీర్లు, వైసీపీ నాయకులు ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాల్సిందే.
Also read: కొత్త డాక్టర్ వైసిపి రోగం కుదురుస్తారా?!