వోలేటి దివాకర్
రాజమహేంద్రవరం పార్లమెంటు సీటు దక్కితే బిజెపి నేత సోము వీర్రాజు ఆరోగ్యం బాగుండి..సుడిగాలి ప్రచారం చేసేవారేమోనన్న వ్యంగోక్తులు వినిపిస్తున్నాయి. ఎంపి సీటు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి దక్కడంతో సోము ప్రచారంలోనూ, పార్టీ కార్యక్రమాల్లోనూ ఎక్కడా కనిపించడం లేదు. దీనిపై పార్టీ నాయకులను వాకబు చేయగా సోము ఆరోగ్యం బాగోలేదని, ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని వివరణ ఇస్తున్నారు. తాత బొంత నాదే అన్నట్లు ఎన్నికలకు చాలా ముందే సోము వీర్రాజు ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. పార్లమెంటు లేదా రాజమహేంద్రవరం అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని సోము ఆశించారు. అయితే బిజెపి అధిష్టానం సోము ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో ఆయన కినుక వహించినట్లు కనిపిస్తోంది. అందుకే ఆయన దగ్గుబాటికి దూరం పాటిస్తున్నారు. జిల్లాలోని ఆయన వర్గీయులు కూడా అసంతృప్తిగా ఉన్నారు. సోము ప్రధాన అనుచరుడు బిజెపి జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, రేలంగి శ్రీదేవి మాత్రం తప్పదన్నట్లు పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. అయితే రాజమహేంద్రవరంలో పెత్తనమంతా దగ్గుబాటి వర్గీయులు, ఆమె సామాజిక వర్గీయులు చేతుల్లో పెట్టుకున్నారు.
మరోవైపు రాజమహేంద్రవరంనకు చెందిన ఎపిఐఐసి మాజీ చైర్మన్ శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం నగరాన్ని వదిలేసి రాజానగరం, రాజమహేంద్రవరం రూరల్‌లో వైసిపి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడం చర్చనీయాంశంగా మారింది. రెండురోజులుగా ఆయన రాజానగరం, రూరల్‌లో జక్కంపూడి రాజా, మంత్రి చెల్లుబోయిన వేణుకు మద్దతుగా ఆర్యవైశ్యులతో సమావేశాలు నిర్వహించారు. అయితే శ్రీఘాకోళపు అనుచర వర్గం ఎక్కువగా రాజమహేంద్రవరంలోనే ఉండటం గమనార్హం. గత కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులను కూడా రంగంలోకి దింపి గెలిపించుకున్నారు. 2014లో కూడా జై సమైక్యాంధ్ర పార్టీ తరుపున రాజమహేంద్రవరం సిటీ నుంచే పోటీ చేశారు.
వైసీపీలో విభేదాలు తారాస్థాయికి
ఆధిపత్య పోరులో భాగంగా జక్కంపూడి రాజా, శ్రీఘాకోళపు వర్గాలకు, ఎంపి రాజమహేంద్రవరం సిటీ వైసిపి అభ్యర్థి మార్గాని భరత్‌రామ్ కు మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ సూచించినా భరత్‌కు మద్దతుగా పనిచేసేందుకు శ్రీఘాకోళపు అంగీకరించలేదని సమాచారం. అందుకే ఆయన రాజమహేంద్రవరంలో తప్ప పక్క నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తుండటం విశేషం. శ్రీఘాకోళపు, జక్కంపూడి రాజా వర్గీయులు భరత్‌కు దూరంగా ఉంటున్నారు. భరత్‌పై వ్యతిరేకతతోనే జక్కంపూడి కుటుంబ అనుచరుడైన బిసి యువనేత బిజెపిలో చేరడం విశేషం. మరో చోటా నాయకుడు స్వతంత్రంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇలాంటి పరిణామాలను ముందే గుర్తించిన భరత్ బిసి వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావును దగ్గర చేసుకుని, రుడా చైర్మన్ పదవి ఇప్పించారు. సొంతంగా తయారుచేసుకున్న వర్గంతో పాటు, భరత్‌కు ప్రస్తుతం రౌతు వర్గమే దన్నుగా ఉంది.