- రెండింటిలోనూ విజయం సాధించగలనని బీజేపీ ధీమా
- ఉపఎన్నికలే జరిగితే అధికారపక్షం బలప్రదర్శన చేస్తుంది
- హుజూరాబాద్ ఫలితం బీజేపీ, టీఆర్ఎస్ పై ప్రభావం చూపుతోంది
అశ్వినీ కుమార్ ఈటూరు
హైదరాబాద్ : రానున్న రోజుల్లో మరికొన్ని ఉపఎన్నికలు తెలంగాణలో జరగవచ్చు. ఆ ఉపఎన్నికల ఫలితాలు దుబ్బాక, హుజూరాబాద్ దారిలో ఉంటాయని బీజేపీ నాయకులు ఢంకా బజాయించి చెబుతున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి
నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ పార్టీకీ, అసెంబ్లీ సభ్యత్వానికీ రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారని కాంగ్రెస్ వర్గాల భోగట్టా. కొన్ని మాసాలుగా రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పనిచేస్తున్న తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. బీజేపీలోకి గెంతడానికి తగిన సమయం, సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు. హుజూరాబాద్ లో బీజేపీ గెలుపొందడం, కాంగ్రెస్ అభ్యర్థికి ధరావతు గల్లంతు కావడం తాను బీజేపీలో చేరడానికి తగిన సమయమని కోమటిరెడ్డి భావిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
చెన్నమనేని రమేష్
మరో ఎంఎల్ఏ పేరు చన్నమనేని రమేష్, మాజీ సీపీఐ, టీడీపీ నాయకుడు చెన్నమనేని రాజేశ్వరరావు కుమారుడు. మహారాష్ట్ర గవర్నర్ గా పని చేసిన విద్యాసాగర్ రావు రమేష్ కు చిన్నాన్న అవుతారు. రమేష్ జర్మనీలో చాలా కాలం నివాసం ఉన్నారు. జర్మన్ పౌరసత్వానికి సంబంధించిన వివాదం హైకోర్టులో కొంతకాలంగా నడుస్తోంది. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో వరుసగా మూడు విడతల గెలిచిన రమేష్ కు వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ‘‘నియోజకవర్గంలో ఎన్నికలను ఎదుర్కోవడానికి ఎంఎల్ఏ సిద్ధం కావలన్నట్టు కనిపిస్తోంది,’’ అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. వేములవాడలో కూడా ఉపఎన్నిక అవసరం రావచ్చు.
రాబోయే కొన్ని రోజులలో కె. చంద్రశేఖరరావు (కేసీఆర్)కు సొంతపార్టీ నుంచే కొందరు ధిక్కారస్వరం వినిపించే అవకాశం ఉన్నదని రాజకీయవర్గాలలో ఊహాగానాలు సాగుతున్నాయి. హుజూరాబాద్ ఫలితం వచ్చిన తీరుపట్ల సంతోషించిన ఎంఎల్ఏలు టీఆర్ఎస్ లో కొందరున్నారంటే ఆశ్చర్యం లేదు. కొంతమంది ఎంఎల్ఏలు టీఆర్ఎస్ నుంచి రాజీనామా చేస్తారనీ, వారిలో కొందరు కాంగ్రెస్ లోనూ, మరికొందరు బీజేపీలోనూ చేరబోతున్నారనీ వదంతులు వినిపిస్తున్నాయి.
ఎంఎల్ సీ అభ్యర్థుల ఖరారు తర్వాత అసమ్మతి ముమ్మరం
కొంతమందిని ఎంఎల్ సీలుగా నియమించే అవకాశం ఉంది. ఎవరిని నియమిస్తారో చూసిన తర్వాత కొందరు తిరుగుబాటు బావుటా ఎగురవేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం ఎల్ రమణ (టీడీపీ నుంచి ఇటీవల టీఆర్ఎస్ లో చేరిన నాయకుడు. అందుకు కారణంగా హుజూరాబాద్ ఉపఎన్నికే), కౌశిక రెడ్డి (ఈయన కూడా హుజూరాబాద్ ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకొనే టీఆర్ఎస్ లో చేరారు. 2018లో కాంగ్రెస్ టిక్కెట్టు మీద పోటీ చేసి 62 వేల పైచిలుకు ఓట్లు సంపాదించాడు. టీఆర్ఎస్ లో చేరినందుకు నజరానాగా ఎంఎల్ సీ గా నియమించాలని కేసీఆర్ ప్రయత్నించారు. కానీ ఫైలు గవర్నర్ తమిళసై దగ్గర నిలిచిపోయింది)ని ఎంఎల్ సీ అభ్యర్థులుగా నిలబెడతారని తెలుస్తోంది. పెద్దిరెడ్డి, మోత్కుపల్లి నరసింహులు కూడా హుజూరాబాద్ ఎన్నికల సందర్భంలోనే టీఆర్ఎస్ లో చేరిపోయారు. వారి సంగతి ఏమి చేస్తారో తెలియదు. ఎంఎల్ సీ అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత టీఆర్ఎస్ లో అసంతృప్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని అనుకుంటున్నారు.
రెచ్చిపోయిన కేసీఆర్
ఆదివారంనాడు మీడియా సమావేశంలో కేసీఆర్ రెచ్చిపోయారు. పెట్రోలియం, డీజిల్ ధరలను 2014 నాటి స్థాయికి తగ్గించాలని మోదీ ప్రభుత్వానికి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రైతులకు బీజేపీ చేసింది శూన్యమని కూడా విమర్శించారు. మూడు వ్యవసాయ చట్టాలనూ టీఆర్ఎస్ వ్యతరేకిస్తున్నదనీ, రైతుల ఉద్యమాన్ని బలపర్చుతున్నదనీ కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి నిధులు అందుతున్నాయనీ, అనుమతులు లభిస్తున్నాయనీ, విత్తనాలు వస్తున్నాయనీ పచ్చి అబద్ధాలను బీజేపీ నాయకులు బండి సంజయ్ ప్రచారం చేస్తున్నారనీ, అటువంటివారి నాలుక చీల్చుతామనీ కేసీఆర్ ధ్వజమెత్తారు.
బీజేపీపైనా, కేంద్ర ప్రభుత్వంపైన చాలా రోజుల తర్వాత ప్రప్రథమంగా కేసీఆర్ శరసంధానం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని హుజూరాబాద్ ఎంఎల్ఏ ఈటల రాజేంద్ర సంకల్పం. పార్టీకి ఇటీవల జరిగిన నష్టాన్ని తగ్గించేందుకు నష్టనివారణ చర్యలు చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. రాబోయే ఉపఎన్నికలలో కూడా ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినట్లయితే కేసీఆర్ ముందస్తు ఎన్నికల వైపు మొగ్గు చూపేంచే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.