Thursday, November 7, 2024

కరోనా కష్టాల మధ్య కర్ణపేయమైన వార్తలు

నేటి కరోనా కష్టకాలంలో మంచివార్తలు కూడా వినపడుతున్నాయి. మరణాలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, దురాగతాల మధ్యన ఈ ఎడారిలో ఒయాసిస్సులు కూడా కనిపిస్తున్నాయి. దేశంలో సుమారు 27 రాష్ట్రాల్లో నమోదైన కొత్త కేసుల కంటే, రికవరీ ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ ఇటీవలే తెలిపింది. కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై కేంద్ర మంత్రిత్వ శాఖ సమీక్ష నిర్వహించింది. ఈ నెల 3వ తేదీ నుంచే రికవరీ రేటు  పెరుగుతోందని ఈ నివేదికల ద్వారా తెలుస్తున్నాయి. లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనలు ఆరోగ్య పరంగా అక్కరకు వస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీ మొదలు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫలితాల్లో ప్రతిస్పందిస్తున్నాయి.

Also read: మరపురాని మహానాయకుడు

పెరుగుతున్న రీకవరీ రేటు

తెలంగాణలో రికవరీ రేటు 93శాతం నమోదైంది. దేశంలో సగటున 90.8శాతం రికవరీ రేటు కనిపిస్తోంది. తెలంగాణలో దేశ సగటు కంటే కూడా ఎక్కువగా ఉండడం ఆనందదాయకం.ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కేసుల నమోదులోనూ తగ్గుదల కనిపిస్తోంది. చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించడానికే ఇష్టపడుతున్నాయి. దీనివల్ల ఆర్ధికంగా కష్టాలు ఉన్నప్పటికీ, ప్రాణాలను కాపాడుకోడానికి, ఉధృతిని తగ్గించడానికి ఇదే మంచి మార్గమనే ఆలోచనలో ప్రభుత్వాలు ఉన్నాయి. సమాంతరంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలనే వత్తిళ్ల నేపథ్యంలో  ప్రభుత్వాలు ఆ దిశగా ముందుకు సాగుతున్నాయి.   కో వాక్జిన్, కోవీషీల్డ్ కు తోడు, స్పుత్నిక్ -వి కూడా జూన్ లో అందుబాటులోకి వస్తోంది. జూన్ రెండో వారం నుంచి వ్యాక్సిన్ ను ప్రజలకు అందజేస్తామని అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ప్రకటించింది. ఇక, ఆంధ్రప్రదేశ్ లో ఆనందయ్య మందుపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఈ మందు చాలా మంచిదనే ప్రచారం బాగా జరిగింది. నిజానిజాలు, అసలు స్వరూపం ఇంకా తెలియాల్సి వుంది. నిజంగా, ఈ మందు వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేక, కరోనాను అరికట్టడంలో ఉపయోగపడితే అంతకంటే ఇంకేం కావాలి? ఏది నాటు మందు, ఏది ఆయుర్వేదం, ఏది శాస్త్రీయం అనే విషయాలపై చర్చోపచర్చలు జరుగుతూనే వున్నాయి.

Also read: ఏడేళ్ళ మోదీ పాలన మోదమా, ఖేదమా?

వాక్సినేషన్ వేగంగా, ముమ్మరంగా జరగాలి

ఈ మందు నిజంగా ఉపయోగపడితే, నేటి కాలానికి అదే సంజీవని అవుతుంది. సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది.ఆనందయ్య మందు ప్రజోపకారి అయ్యివుంటే? దానిపై కుళ్ళు రాజకీయాలు చేయకూడదు.మెడికల్ మాఫియాను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. వ్యాక్సినేషన్ ఎంత త్వరగా, ఎంత ఎక్కువగా జరిగితే అంత మంచిదని అంటున్నారు. కరోనా వైరస్ – వ్యాక్సిన్ చుట్టూ గూడుకట్టుకున్న పలు సందేహాలపై నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే పాల్ వివరణ ఇచ్చారు. వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, రెండు వేర్వేరు డోసులు తీసుకోవచ్చా అనే అంశం కూడా చర్చలోకి వచ్చింది. తొలి డోసు ఒకటి, రెండో డోసు వేరే వ్యాక్సిన్ తీసుకున్నవారిలో తీవ్రమైన దుష్ప్రభావాలు ఏమీ కనిపించలేదని ఉత్తరప్రదేశ్ లో ఇటీవల జరిగిన సంఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇది పరిశీలించాల్సిన అంశంగా పేర్కొంది. నిబంధనల ప్రకారం తొలి డోసు ఏ వ్యాక్సిన్ తీసుకుంటే రెండో డోస్ కూడా అదే తీసుకోవాలి. వేర్వేరు వ్యాక్సిన్ డోసులు తీసుకోవడంపై అంతర్జాతీయంగా ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం, ఆస్ట్రాజెనెకా, ఫైజర్ వ్యాక్సిన్లపై ఆక్సఫర్డ్ యూనివర్సిటీ ప్రయోగాలు నిర్వహిస్తోంది. ఇది శాస్త్రీయంగా సహేతుకమని తెలితే, మంచి పరిణామంగా భావించాలి.

Also read: కన్నీళ్ళు కాదు, కార్యాచరణ కావాలి!

తెలుగు రాష్ట్రాలకు వాక్సిన్ కొరత

వ్యాక్సిన్ కొరత కారణంగా, చాలా చోట్ల పంపిణీ నిలిచిపోతోంది. అదే సమయంలో కొన్ని రాష్ట్రాల్లో వృధా అవుతున్నట్లుగా తెలుస్తోంది. అందులో మన తెలుగు రాష్ట్రాలు లేవు. మరికొన్ని వారాలు/ నెలల్లో మూడో వేవ్ ఉంటుందనే అంశాన్ని ఎక్కువమంది దృఢ పరచడం లేదు. కానీ, అత్యంత జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. అది లేకనే, సెకండ్ వేవ్ దెబ్బకు బెంబేలెత్తి పోతున్నాం. మూడో వేవ్ వస్తే, చిన్నపిల్లలపై తీవ్ర ప్రభావం ఉంటుందనే భయాందోళనలు అవసరం లేదని జాతీయ టీకా కార్యక్రమ సాంకేతిక సలహా మండలి (ఎన్ టి ఏ జి ఐ ) చైర్మన్ డాక్టర్ ఎన్ కె అరోడా భరోసా ఇస్తున్నారు. కోవిడ్ రెండో వేవ్ లో చిన్న పిల్లలు వైరస్ బారిన పడుతున్నప్పటికీ, వారిలో వైరస్ లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు కూడా వ్యాక్సిన్లు త్వరలో అందుబాటులోకి వస్తాయని వింటున్నాం. వైరస్ వ్యాప్తిని అవి అడ్డుకుంటాయని వైరాలజీ నిపుణులు ఉపాసనా రే వంటి వారు అభిప్రాయపడుతున్నారు. టీకాల ప్రభావాన్ని తెలుసుకునేందుకు జాతీయ స్థాయిలో వ్యాక్సిన్ ట్రాకింగ్ సిస్టమ్ రాబోతోంది. కోవాక్జిన్ రెండు డోసులకు అదనంగా మూడవ డోస్ కూడా ఇవ్వడానికి సిద్ధపడుతోందనే వార్తలు విన్నాం.

Also read: కరోణా కట్టడికి విశ్వప్రయత్నం

ఎయిమ్స్ లో కొవాక్సిన్ ప్రయోగాలు

మొన్న సోమవారం నాడు దిల్లీలోని ఎయిమ్స్ లో ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. మూడో డోస్ కూడా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మరింతగా పెరుగుతుందని, కరోనాను కట్టడి చేయడానికి మరింత దోహదకారిగా ఉంటుందని భారత్ బయోటెక్ అంటోంది. వైరల్ లోడ్ ను తగ్గించే క్రమంలో  నాసల్ స్ప్రే ను కెనడా రూపొందించింది. ఈ స్ప్రే అందుబాటులోకి వస్తే, కరోనాపై జరిగే పోరు కొత్త మలుపు తీసుకుంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ స్ప్రే కోవిడ్ బాధితుల్లో వైరల్ లోడ్ ను 99శాతం నిర్మూలిస్తుందని తయారు చేసిన సంస్థ అంటోంది. కెనడాకు చెందిన ‘శానోటైజ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ ఈ స్ప్రేను తయారు చేసింది. దీని వినియోగానికి ఇజ్రాయెల్, న్యూజిలాండ్ సంసిద్ధంగా ఉన్నాయి. మన దేశంలోనూ దీన్ని ఉత్పత్తి చేసేందుకు శానోటైజ్ సంస్థలు సంప్రదిస్తున్నట్లు సమాచారం. లాక్ డౌన్ మంచి ఫలితాలను ఇవ్వడం శుభసూచకం.  ఈ సెప్టెంబర్ -డిసెంబర్ కల్లా దేశంలో ఎక్కువమందికి వ్యాక్సిన్లు అందుతాయని కేంద్ర ప్రభుత్వ పెద్దలు భరోసా ఇస్తున్నారు. ధైర్యంగా ఉండడం, భయాన్ని వీడడం, మానసిక వత్తిళ్లు, ఆందోళనలకు గురికాక పోవడం వల్ల మానసికమైన శక్తి పెరిగి, తద్వారా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని మానసిక వైద్య శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. కరోనా కష్టాల నేపథ్యంలో, ఇటువంటి కొన్ని మంచి వార్తలు, మాటలు కర్ణప్రేయంగా ఉంటున్నాయి.

Also read: తాత్పర్యం లేని టీకాలు

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles