ఫొటో రైటప్: సుందర్ లాల్, విమలా బహుగుణ
(నేను సందర్శించిన సమున్నత శిఖరాలు)
జనవరి 2015 లో అంటే ఎనిమిదేళ్ళ క్రితం వచ్చిన నా మొదటి భావోద్యమకారుల ఇంటర్వ్యూల పుస్తకం “ధిక్కార స్వరాలు” ఒక మరపురాని జ్ఞాపకం. భిన్న స్రవంతులకి చెందిన మహోద్యమ స్వరాల్ని ఒక్క దరికి చేర్చి నేను రూపొందించిన తొలి ఇంటర్వ్యూల పుస్తకం. తెలుగులో అనితరసాధ్యమైన అంకిత భావం కలిగిన కొందరి చివరి స్వరాలు రికార్డు చేయగలగడం నా వరకూ నాకొక గొప్ప పనే!
అదే ఏడాది తీసుకువచ్చి సరిహద్దు గాంధీ ‘ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్’ కి అంకితం ఇవ్వబడిన గాంధేయవాదుల ఇంటర్వ్యూలు “విస్మృత స్వరాలు,” అలాగే డా.బాబాసాహెబ్ అంబేద్కర్ కి అంకితం ఇచ్చిన వివిధ బౌద్ధోద్యమకారుల ఇంటర్వ్యూలు ” సద్ధమ్మ స్వరాలు” కూడా ఎందరో విస్మరించబడిన ఆలోచనాపరులు, అంకిత భావంతో పనిచేసే కార్యకర్తల్ని అనేక పరిమితుల్లో అయినా, సామాజిక కార్యరంగానికి పరిచయం చేయగలిగినందుకు ఆనంద పడుతుంటాను!
ఆ తర్వాత సరిగ్గా ఏడాదికి జనవరి 2016 కి ప్రచురించిన “ధీరోదాత్తులు”(కొందరు సామాజిక కార్యకర్తల పరిచయాలు) బి.డి.శర్మగారి స్మృతి చిహ్నంగా ఇప్పటికీ నాకెంతగానో తృప్తినిచ్చే ప్రాజెక్ట్ ఇది. తర్వాత 2017 లో అసామాన్య పర్యావరణ వేత్త కీ. శే. సుందర్లాల్ బహుగుణగారిని ప్రత్యేకంగా డెహ్రాడూన్ వెళ్ళి కలిసి విమలా బహుగుణా జీతో సహా ఇంటర్వ్యూ చేసి ప్రచురించిందే జార్జ్ జేమ్స్ రచన ‘ప్రకృతి శాశ్వత ప్రగతి’ వర్క్!
ఇక 2019 సంవత్సరంలో తెచ్చిన, “మరువలేని మనుషులు – మరపురాని జ్ఞాపకాలు” (కొందరు గతించిన ఆత్మీయుల స్మృతులు) భారమయిన రచన. ఇంకా ఇంటర్వ్యూ చేసి నోట్స్ రాసుకుని కూడా ప్రచురించలేకపోయిన మహానుభావులు ఎందరో ఉన్నారు. అప్పట్లో బొత్తిగా అస్థిరమైన జీవనయానంలో అలాంటి ఎన్నో స్మృతులు పోగొట్టుకున్నాను. అందుకు నాకు నేనెప్పటికీ క్షంతవ్యుణ్ణి కాను. ఇతరేతర భావోద్యమాల్ని అంటే, సంస్కరణవాద శాఖలు మొదలు వామపక్ష విప్లవోద్యమం వరకూ, కళాకారులు అనేక మంది ఇంటర్వ్యూల పని అలాగే మిగిలిపోయింది!
ఇవన్నీ భావితరాలకు భావోద్యమాల్ని ఎంతో కొంత పరిచయం చేయాలనే తపనా, సామాజిక కార్యాచరణ రంగంలో కృషి చేసిన వారి భావాలకి, నా పరిమితుల్లో ప్రజా ఉద్యమ స్వరాలకి కనీసం నమోదు (Documentation) అవసరమనే ఆతృతతో ప్రయాణమే ప్రస్థానంగా కాలికి చక్రాలు కట్టుకు తిరిగి చేసినవే. అప్పటికీ ఇప్పటికీ కూడా నావన్నీ చేయికాల్చుకునే సొంత ప్రాజెక్టులే తప్పా వెనక వెన్నెముక తప్పా మరేమీ లేదు. ఐనా, ఇవన్నీ కేవల వ్యక్తిత్వాలు కావు, కొన్ని సమాజ వికాసం కోసం జీవితాంతం పరితపించిన సమున్నత శిఖరాలు!
—————————————————————-
చాలా కారణాల వల్ల ప్రయాణాలు తగ్గాయి. Interactions లేవు. తెలుగు సమాజంలో కొత్త ఆవిష్కరణల కోసం స్వప్నించిన ఒక కలం కాలం జడిలో కలగా ఉండిపోయింది. ఏవో ఈ మేరకు కొద్దిపాటి ప్రయత్నాలు చేయగలిగాను. ఇప్పుడిక ప్రతీ పనికీ ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చేసింది. చేయాలని పూర్తి చేయలేకపోయిన అసంపూర్ణ కార్యక్రమాల పట్ల అసంతృప్తి, పెద్దగా ఏమీ చేయలేకపోయాననే ఎరుకను నిరంతరం యాదిలో ఉంచుతుంది. అదే ఎప్పుడైనా నిద్రలేపే ఎడతెరిపిలేని ఒడిదుడుకుల చైతన్యానికి సుస్థిరమైన నిర్మాణం దిశగా ఒక కొనసాగింపునిస్తుంది!
(విశాఖపట్నం నుండి ఎవరో ఫోన్ చేసి ధిక్కార స్వరాలు, సద్ధమ్మ స్వరాల గురించి అడిగారు. బౌద్ధ ఇంటర్వ్యూలు వెతికినా దొరకలేదు. సాఫ్ట్ కాపీ కూడా లేదు. వీటిలో ఉన్నవేవో చూసి కాస్త భద్రపరచడం, వ్యక్తిగతంగా నాకు కాకున్నా ప్రజాఉద్యమ స్రవంతుల్ని అధ్యయనం చేయడం ఒక చారిత్రక ప్రాధాన్యత కలిగిన కార్యక్రమంగా గుర్తించే శ్రేణులకి సాంస్కృతిక అవసరం అని భావిస్తూ ఆ అజరామర స్వరాలకి మద్దతుగా పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఈ చిన్న రైటప్.)
– గౌరవ్