వోలేటి దివాకర్
ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిగా రెండేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సోము వీర్రాజుకు శుభాకాంక్షలు . కరోనా సమయంలో దేశమంతా స్తబ్దుగా , ఆందోళనగా ఉన్న సమయంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి రాజకీయ వర్గాల్లో ఒక కదలిక తెచ్చారు సోము వీర్రాజు . రాజమహేంద్రవరంనకు చెందిన ఆర్థిక , అండబలం లేని నాయకుడు అధికారంలో ఉన్న జాతీయ పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదగడం గొప్పే . సామాజిక బలమే ఆయన్ని అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టిందంటే అసత్యం కాదు.
Also read: పోలవరం కొట్టుకుపోతే ….. ఆ నివేదిక ఏం చెప్పింది?
కులసమీకరణాలు కీలకం
దేశంలో అధికారంలో కొనసాగుతూ …. రానున్న రోజుల్లో రాష్ట్రంలో అధికారానికి రావాలని కోరుకుంటున్న భారతీయ జనతా పార్టీ పగ్గాలు చేపట్టడం ఒక విధంగా సవాలే . అప్పటి వరకు బిజెపి అధ్యక్షుడిగా వ్యవహరించిన కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ అడుగులకు మడుగులొత్తుతూ పార్టీని టిడిపి బి టీమ్ మార్చేశారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి . బిజెపి మహిళామోర్చా నేత పురంధేశ్వరి , ఎమ్మెల్సీ , బిసి వర్గానికి చెందిన మాధవ్ ఎపి అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు . రాజకీయ , కుల సమీకరణాల కారణంగా అదే సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజుకు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికల వరకు ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతారని చెబుతున్నారు.
Also read: విమానంలో బయలుదేరిన మిస్టర్ బ్యాలెట్ బాక్స్ ఎవరు?
దూకుడు పెంచిన వీర్రాజు
వీర్రాజు దూకుడు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించగానే ఎపి బిజెపిలో సోము వీర్రాజు అంతర్వేది , రామతీర్థం ఆలయాల్లో విధ్వంసంపై ఉద్యమాలు చేసి, పార్టీలో ఒక విధమైన దూకుడు తెచ్చారు. అప్పటి వరకు టిడిపి బి టీమ్ ముద్రపడిన బిజెపిలో తనదైన ముద్రవేశారు. టిడిపిపైనే విమర్శలు చేస్తూ తొలినాళ్లలో అధికార వైసిపికి అనుకూలంగా ఉంటారన్న పేరు తెచ్చుకున్న సోము వీర్రాజు ఆ తరువాత దాన్ని తుడిచేసుకోగలిగారు. అదే విధంగా స్థానిక సంస్థలు, అన్ని ఉప ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. అదే సమయంలో ఆమేరకు ప్రజాభిమానాన్ని, ఓట్లను సాధించడంలో వెనుకబడ్డారు. తాము అధికారంలోకి వస్తే మద్యాన్ని చీప్ గా విక్రయిస్తామని ప్రకటించి విమర్శల పాలయ్యారు. సోము వీర్రాజులో ఉండే సహజమైన దూకుడుతనం ఆయనను రాజకీయంగా కాస్త ఇబ్బందుల పాలు చేసిందని చెప్పవచ్చు.
Also read: తమిళనాడులోనూ ఏక్ నాధ్?.. మహారాష్ట్రకు…తమిళనాడుకు సారూప్యత ఇదే!
బండి సంజయ్ తో పోలిస్తే …. ఇబ్బందే
ఇరుగుపొరుగు రాష్ట్రాలైన ఆంధ్రా , తెలంగాణాల్లో బిజెపి పనితీరు, ప్రజాదరణలో పోలిక పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. ఒకే పార్టీకి చెందిన ఇరుగుపొరుగు రాష్ట్రాల అధ్యక్షుల పనితీరుపై సహజంగానే పోలిక తెస్తారు. ఈ విధంగానే తెలంగాణా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పోలిస్తే మాత్రం వీర్రాజు ఆశించిన ఫలితాలు సాధించలేదనే విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడంతో పాటు, దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల్లో విజయాలతో బండి సంజయ్ తెలంగాణాలో బిజెపికి మంచి ఊపు తెచ్చారు . తెలంగాణలో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బిజెపియే అన్న భావన తేగలిగారు. దుబ్బాక ఫలితాలను పునరావృతం చేస్తానన్న సోము వీర్రాజు తిరుపతి లోక్ సభ, స్థానిక సంస్థల ఎన్నికలు, తర్వాత జరిగిన బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో కూడా దుబ్బాక ఫలితాలను పునరావృతం చేయలేకపోయారు.
Also read: పినాకిని ఎక్స్‌ప్రెస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు!
సోముకు పవన్ సవాల్
పార్టీ నియమ నిబంధనల ప్రకారం సోము వీర్రాజుకు 2023 వరకు సారధిగా వ్యవహరించే అవకాశం ఉంది . ఎన్నికల ముందు పార్టీ అధ్యక్షుణ్ణి మార్చేందుకు బిజెపి అధిష్టానం సాహసించదని, సార్వత్రిక ఎన్నికల వరకు ఆయననే అధ్యక్షుడిగా కొనసాగిస్తుందని బిజెపికి చెందిన ఒక నాయకుడు చెప్పారు. అదే జరిగితే 2024 సార్వత్రిక ఎన్నికలు ఆయన సారధ్యంలోనే జరుగుతారు. అదే ఆయనకు సవాల్ గా నిలుస్తుంది. రాష్ట్రంలో అధికార వైసిపికి ప్రజాదరణ క్రమంగా తగ్గిపోతోంది. జన సేనతో కలిస్తే తప్ప ప్రతిపక్ష టిడిపి ఈఅవకాశాన్ని అందిపుచ్చుకునే పరిస్థితుల్లో లేదు. మరోవైపు బిజెపితో కలిసి పనిచేస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ రాజకీయ విన్యాసాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బిజెపి, జన సేన కలిసి పనిచేస్తే అంతిమంగా వైసిపికి ప్రయోజనం కలుగుతుంది. టిడిపి, బిజెపి, జనసేన కలిసి పనిచేస్తే వైసిపికి ఇబ్బందే. రాష్ట్రంలో అధికార వైసిపిని గద్దె దించడమే తన లక్ష్యమని, ఇందుకోసం ఏ పార్టీతోనైనా పొత్తుకు సిద్ధమని ప్రకటించారు.
Also read: రాజమహేంద్రవరం అసెంబ్లీ నియోజకవర్గం ఎంపి అడ్డానా?!
పవన్ ఉత్సాహం బీజేపీకి ఇబ్బందికరం
మరోవైపు ప్రధాని నరేంద్రమోడీని వ్యక్తిగతంగా దూషించడంతో పాటు, గత ఎన్నికలకు ముందు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు వ్యవహరించిన తీరుతో టిడిపితో కలిసి పనిచేసేందుకు బిజెపి ససేమిరా ఇష్టపడటం లేదు. టిడిపితో కలిసి పనిచేసేందుకు పవన్ కల్యాణ్ ఉత్సాహం చూపిస్తుండటం బిజెపికి ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ను బిజెపితో ఉండేలా ఒప్పించడమే సోము వీర్రాజుపై ఉన్న అతిపెద్ద బాధ్యతగా భావించవచ్చు. 2014 లో పవన్ కల్యాణ్ బిజెపికి మద్దతు ఇవ్వడంలో సోము వీర్రాజు తెరవెనుక కీలకపాత్ర పోషించారని చెబుతారు. ఇప్పుడు మాత్రం పవన్ ఆయన మాట వినేలా కనిపించడం లేదు.
Also read: 13 ఏళ్ల తర్వాత రాజమహేద్రవరం పోలీసు అర్బన్ జిల్లాకు కొత్త స్వరూపం