వోలేటి దివాకర్
ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పట్ల ఇంటాబయటా వ్యతిరేకత పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కారణంగా ఆయన పట్ల వ్యతిరేకత ఢిల్లీ వరకు పాకింది. టిడిపి నుంచి వచ్చి బిజెపిలో చేరిన పార్టీలోని ఆయన వ్యతిరేకులు ఎప్పటి నుంచో అసంతృప్తి కుంపటి రాజేశారు. ఇటీవల బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సోము వీర్రాజు వైఖరి నచ్చకే బీజేపీని వీడుతున్నట్లు ప్రకటించి, తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. టీడీపీ అనుకూల వర్గీయులుగా భావిస్తున్న కొంతమంది నాయకులు ఢిల్లీకి వెళ్లి మరీ సోము వీర్రాజుకు వ్యతిరేకంగా పార్టీ. రాష్ట్ర ఇన్చార్జి, కేంద్రమంత్రి మురళీధరన్ కు ఫిర్యాదు చేశారు. తాజాగా సోము వీర్రాజు సొంత ఊరు రాజమహేంద్రవరంలో కూడా అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
Also read: రాష్ట్ర విభజనపై ఉండవల్లి కేసు ఏమైంది?
సొంత వర్గంలో సొంత మనుషులు వేరయా!
సుమారు 25 ఏళ్లుగా సోము వీర్రాజు వర్గీయుడిగా ముద్రపడిన సీనియర్ కార్యకర్త అడబాల రామకృష్ణారావు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా 15 ఏళ్ల పాటు పనిచేశారు. 63 ఏళ్ల అడబాల తూర్పుగోదావరి అధ్యక్ష పదవిని ఆశించారు. కనీసం రాష్ట్ర కార్యవర్గ పదవినైనా ఇప్పించాలని కోరారు. సోము మాత్రం అడబాలకు మళ్లీ జిల్లా ప్రధాన కార్యదర్శి పదవినే ఆఫర్ చేశారు. తన అనుంగు అనుచరుడు బొమ్ముల దత్తుకు మూడవ సారి అధ్యక్ష పదవిని కట్టబెట్టడంతో అడబాల రామకృష్ణారావు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. మరో రెండేళ్లు గడిస్తే 65 ఏళ్ల వయస్సులో పార్టీ కూడా తనను పక్కన పెడుతుందని అడబాల ఆవేదన చెందుతున్నారు. పార్టీ పదవులకు దూరంగా ఉంటూ బీజేపీ కార్యకర్తగా మాత్రమే కొనసాగాలని అడబాల నిర్ణయించుకున్నారు. పార్టీ ఇంచార్జీ మురళీధరన్ రాజమహేంద్రవరం వస్తున్న తరుణంలో అడబాల ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గతంలో సోము వీర్రాజు తీరు నచ్చని కొంతమంది బీజేపీ నాయకులు ఇప్పటికీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. అడబాల ఉదంతంతో సోము వర్గంలోనే సొంత మనషులు వేరుగా ఉన్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
Also read: వందేభారత్ కు ప్రయాణీకుల వందనం!
సోము ముద్ర సవాలే
కన్నా లక్ష్మీనారాయణ తరువాత బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు మాటల్లో దూకుడు చూపించారు తప్ప తెలంగాణా అధ్యక్షుడు బండి సంజయ్ లాగా బీజేపీకి విజయాలు చేకూర్చలేకపోయారు. బాధ్యతలు స్వీకరించిన తరువాత టీడీపీకి ఇష్టదాయకమైన అమరావతి, టిడిపి అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో సహజంగానే తెలుగుదేశం పార్టీతో పాటు ఒక సామాజికవర్గానికి, టీడీపీ అనుకూల మీడియాకు కూడా టార్గెట్గా మారారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మిత్రపక్ష జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని టిడిపి వైపు వెళ్లకుండా నిరోధించడం, కనీసం రెండంకెల అసెంబ్లీ సీట్లలో గెలిస్తేనే సోము వీర్రాజు సత్తా చాటి నట్టవుతుంది. ఇది ఆయనకు కష్టసాధ్యమైన సవాల్ కావచ్చు.
Also read: ఏపీ అన్యాయానికి 9 ఏళ్ళు!..ఇప్పటికైనా ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలి: ఉండవల్లి