Sunday, December 22, 2024

ప్రభుత్వాన్ని ఎదిరించిన ఒంటరి వీరుడు సోల్జినిత్సిన్

నిప్పులు నిజాల్ని వెలిగక్కినవాడు, విలువల నీతులు బోధించిన నిజాయితీపరుడు, స్వేచ్ఛకోసం, న్యాయం కోసం ఆక్రోశించిన ఒకే ఒక్కడు – అలెగ్జాండర్ ఇసయవిచ్ సోల్జినిత్సిన్ (11 డిసెంబర్ 1918-03 ఆగస్టు 2008) ఒక గొప్ప సాహితీవేత్త, చరిత్రకారుడు, విమర్శకుడు. అన్నింటికీ మించి ఒక మహోన్నత దార్శనికుడు. సాహిత్యరంగంలోంచి, తాత్త్వికత, మతం, రాజకీయాలు, అంతర్జాతీయ సమస్యల్లోకి తన దూరదృష్టిని సారించినవాడు. తనకు మందూవెనకలు ఎవరూ లేకపోయినా, తన దృక్పథంలో ఉన్న బలంతో, తన ఆలోచనా సరళితో ప్రభుత్వాల్నే ఎదిరించగలిగారాయన. ఆ పట్టుదల, కార్యదీక్ష, నిబద్ధతే ఆయనను నిలబెట్టింది. ఆయనకు నోబెల్ సాహిత్య పురస్కారం ప్రకటింపబడ్డప్పుడు స్వీకరించడానికి స్టాక్ హోమ్ కు వెళ్ళనివ్వని ప్రభుత్వం తర్వాత కాలంలో దిగివచ్చింది. తమ దేశపు అత్యున్నత పరస్కారం స్టేట్ అవార్డు ఇచ్చి గౌరవించుకోవాల్సి వచ్చింది. AKEKSANDR SOLZHENITSYN (90)కు రష్యన్ నవలాకారుడిగా, జ్ఞాపకాలు నమోదు చేసుకున్నరచయితగా, తన జాతి ఔన్నత్యాన్ని చాటి చెప్పినవాడిగా ఒక ప్రత్యేక స్థానం ఉంది. విరివిగా రాసినా, తన స్థాయిని, రచనలో స్పష్టతను, నాణ్యతను నిలుపుకున్నాడు. ముఖ్యంగా 1968-78 మధ్య కాలంలో ఆయన మేరునగధీరుడిగా నిలబడ్డాడు. తన జాతి ప్రజల బాధను, వేదనను, ఎలుగెత్తి చూటుతూ ప్రభుత్వాన్ని ధిక్కరించిన ఆయన ఆత్మవిశ్వాసానికి ఎటువంటి వారైనా జోహారు అనవలసిందే.

Also read: జాతి భక్షకులు నరభక్షకులకన్నా ప్రమాదం!

ప్రవాస జీవితం

అమెరికా, రష్యాలు ప్రపంచంలో రెండు బలమైన దేశాలుగా, బలాలుగా ఉన్నప్పుడు సోల్జినిత్సిన్ అందులో తన మాతృదేశమైన రష్యాను ఎదిరించి నిలబడ్డాడు. ఒక సామాన్యుడికి అది సాధ్యమయ్యే పని కాదు. ఆయన కలం, గళం  ఎంత శక్తివంతమయితే అది సాధ్యపడిందో ఊహించుకోవలసిందే. జోసెఫ్ స్టాలిన్ లేబర్ కేంప్ లో ఎనిమిదేళ్ళు, దేశం వదిలి ఇతర దేశాల్లో దేశదిమ్మరిగా మూడేళ్ళు, అమెరికాలో మరో ఇరవై ఏళ్ళు గడిపిన సోల్జినిత్సిన్ – మిఖైల్ గోర్బచెవ్ పెరిస్ట్రోయికా ప్రవేశపెట్టిన తర్వాత బోరిస్ యెలిత్సిన్ కమ్యూనిజాన్ని ముక్కలు చేశాక మే 1994లో మళ్ళీ స్వదేశానికి తిరిగివెళ్ళాడు. మితవాది, దేశభక్తుడు అయి కూడా నాటి పాలకులకు ఆయన మాటలు, రచనలు రుచించలేదు. రచనలు బహిష్కరించబడ్డాయి. పుస్తకాలు అతికష్టం మీద ఇతర దేశాల్లో ముద్రించుకోవాల్సి వచ్చింది. తిండి లేకపోవడం వల్ల, విపరీతమైన పని ఒత్తిడి వల్ల సోల్జినిత్సిన్ లేబర్ కేంప్ లో చనిపోయేవాడే. గుడ్డిలో మెల్లగా ఒక చిన్న అవకాశం లభించింది. లేబర్ కేంప్ నుండి ‘శరష్క’ అనే వైజ్ఞానిక సంస్థకు బదిలీచేయబడ్డాడు. ఆ సంస్థ జైలు జీవితం గడుపుతున్న విద్యావంతులమీద, మేధావుల మీద పరిశోధన జరిపేది. ముఖ్యంగా లేవ్ కొపిలెవ్, డిమిట్రి పానిస్ అనేవారు సోల్జినిత్సిన్ ను సుదీర్ఘమైన చర్చల్లో పాలుపంచుకునేట్లు చేశారు. ఆ చర్చలు రాజకీయపరంగా, తాత్త్వికపరంగా  సాగుతుండేవి. అలాగే చిత్రకారుడు సెర్గె ఇవషోవ్ ముసతోవ్ సోల్జినిత్సిన్ ఆలోచనా విధానంలో మార్పుకు కారణమయ్యాడు. వాస్తవికతావాదం, ప్రతీకవాదాల సమ్ళేళనం సంభవమని సూచించాడు. ‘ఇవాన్  డెనిసోవిట్ జీవితంలో ఒక రోజు (1962) శీర్షికతో సోల్సినిత్సిన్ తన జైలు జీవితపు తొలి అనుభవాల్ని నవలగా గ్రంథస్థం చేశాడు. ఆ తరువాత కూడా సోల్జినిత్సిన్ మరో రెండు మంచి కథలు ‘వోలిమీర్’ పత్రికలో ప్రచురించాడు. అందులో ‘మెట్రిమోనాస్ ఫామ్ (1963) అనేది ఎంతో ప్రశస్తమైనది.

Famous books by Sozhenitsyn

రచయిత గుర్తింపు, రాజకీయాల మధ్య సంబంధం

రచయిత గుర్తింపుకు – రాజకీయాలకు నేరుగా సంబంధముంటుందన్న విషయం సోల్జినిత్సిన్ విషయంలో బాహాటంగానే తేలిపోయింది. 1964లో కృశ్చెవ్ అధికారం కోల్పోయాడు. సాహిత్యానికి లభించే లెనిన్ ప్రైజ్ సోల్జినిత్సిన్ కు అందినట్టు అంది, మాయమైంది. తర్వాత బ్రెజ్నేవ్ అధికారంలోకి రాగానే మేధావులపై ఆంక్షలు విధించాడు. ఆ సమయానికి సోల్జినిత్సిన్ కాన్సర్ వార్డు (1968) రచన ఇంకా పూర్తి కాలేదు. కొంతభాగం ‘నోలిమీర్’లో అచ్చయి సంచలనం సృష్టించాక ఆపివేయబడింది. 1968లో జకొస్లవాకియా ప్రమేయం కూడా ఉండడంతో సోవియెట్ లో అసమ్మతివాదుల్ని అణగదొక్కడం నిరాఘాటంగా సాగిపోయింది. సోల్జినిత్సిన్ ను రచయితల సమాఖ్య నుండి బహిష్కరించారు. 1970లో ఆయనకు నోబెల్ బహుమతి ప్రకటిపడబినా స్టాక్ హామ్ కు వెళ్ళడానికి అనుమతి అబించలేదు.  మరి కొంతమంది ఇతర అసమ్మతివాదులు ఆ కారణాన్ని ప్రముఖంగా చూపి, ఐక్యంగా గొడవచేయడానికి పూనుకున్నారు. కాని, వాటికి సోల్జినిత్సిన్ దూరంగానే ఉండి, తన మార్గమేదో తనే ఒంటరిగా నిర్ణయించుకున్నాడు. కజకస్థాన్ లో దేశబహిష్కృతుడిగా ఉన్నప్పుడు సోల్జినిత్సిన్ వేలవేల చరణాలతో దీర్ఘకవితలెన్నోరాశాడు. బబియాంక్ జైలులో జీవితం అతి భయంకరంగా ఉంటుందని పేరు పడిపోయింది. అలాంటి చోట సోల్జినిత్సిన్ ‘గులార్చిపిలాగో’ నవలలోని ముఖ్యమైన ఘట్టాలు రాశాడు. తన అసమ్మతిరాగం వినిపిస్తూ ఫలితంగా జీవితాంతం అనేక రకాల శిక్షలు అనుభవించినా ఆయనలోని దృఢసంకల్పం మరింత బలపడుతూ వచ్చిందే కాని, బలహీనపడలేదు.

Also read: ‘హకూన మటాటా’: బాధలూ, ఒత్తిళ్లూ లేకుండా ఉండండి!

మంచికీ, చెడుకీ మధ్య రేఖ

మంచికీ, చెడుకీ మధ్య రేఖ – రెండు వర్గాల మధ్య, రెండు దేశాల మద్య మాత్రమే ఉండదు. అది మనుషుల హృదయాల మధ్య కూడా ఉంటుంది! – అని అన్నాడు సోల్జినిత్సిన్ పురోగతి సాధిస్తున్న రష్యా – అమెరికాతో విభేదించాలని, తన అస్థిత్వాన్ని తాను నిలుపుకోవలనీ శతవిధాల చెప్పి చూశాడు. వ్యక్తులైనా, జాతులైనా మొత్తానికి మొత్తంగా సోవియెట్ దేశమైనా సరే, సంప్రదాయాల్ని గౌరవించుకుంటూ తమ ప్రత్యేకతల్ని తాము కాపాడుకోవాలని ఆయన కోరుకున్నారు. సోవియెట్ మేధావులు చిన్నచిన్న వాటికి ఆశపడి వలసపోవడాన్ని ఆయన నిరసించాడు. ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ, ఎక్కడా అమ్ముకోవద్దన్నది ఆయన సిద్ధాంతం! అమెరికాను మహోన్నతంగా ఊహించుకొని దానిపట్ల ఆశగా చూసే రష్యన్ ఉదారవాదులకు సోల్జినిత్సిన్ ఆలోచనలు నచ్చలేదు. అందుకే ఆయన ఎల్లవేళలా ఆంక్షలకు బలి అవుతూ వచ్చాడు.

Also read: ట్రావెన్ కోర్ లో రొమ్ము పన్ను

1994లో రెండు సార్లు సోల్జినిత్సిన్ సోవియెట్ పార్లమెంట్ లొ మాట్లాడాడు. రష్యా పునరుజ్జీవనం గురించి కలలుగన్నాడు. ‘రీబిల్డింగ్ రష్యా,’ హౌ షల్ వుయ్ ఆర్గనైజ్ రష్యా’ అనే రెండు పెద్ద వ్యాసాలు ప్రచురించి, రాజకీయ రంగాన్ని ఆలోచింపజేశాడు.

Also read: అస్తమించిన భారతీయ వెండితెర వెలుగు దిలీప్ కుమార్

‘ఫస్ట్ సర్కిల్ ’ నవల 1996లో టెలివిజన్ షోగా మాలచబడి ప్రసారమవుతూ ఉండగా మధ్యలో ఆపివేయబడింది. అయితే మరో ఐదేళ్ళ తర్వాత రాజకీయంగా వచ్చిన మార్పుల వల్ల, ప్రేక్షకుల అవగాహనాస్థాయిలో వచ్చిన మార్పుల వల్ల … ప్రభుత్వానికి సోల్జినిత్సిన్ పై పెరిగిన గౌవరం వల్ల అదే సీరియల్ 2006 లో పున:ప్రసారం చేయబడి అఖండ విజయం సాధించింది. దానితో ఆయన విజయాన్ని తన చివరి రోజుల్లో చూసుకున్నట్లయింది. వీటన్నిటి ఫలితంగా రష్యా అద్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ 12 జూన్ 2007న స్వయంగా సోల్జినిత్సిన్ ఇంటికి వెళ్ళి, తమ దేశపు అత్యున్నత పురస్కారాన్ని అందించి, అభినందించి వచ్చాడు.

Also read: హృదయంలో మేధస్సు

‘విక్టరీ సెలబ్రేషన్ (నాటకం) చారిత్రక నవల ‘ఆగస్టు 1914’-‘రెడ్ వీల్ ’ ‘ద ఓక్ అండ్ ద కాఫ్(1995),’ ‘టూ హండ్రెడ్ ఇయర్స్ టుగెదర్ (2002);’ ‘ఇన్విజిబుల్ ఎల్లీస్,’ (జ్ఞాపకాలు(1995) మొదలైనవి ఆయన ప్రసిద్ధ రచనలు.

చిత్రమైన వైవాహిక జీవితం

ఆయన వైవాహిక జీవితం విచిత్రంగా గడిచింది. డిగ్రీ పూర్తి కాగానే 22-23వ యేట తనతోపాటు చదువుకున్న స్నేహితురాలు నటాలియా రెస్టోవేస్కియాను 1940లో పెళ్ళి చేసుకున్నాడు. ఆయన లేబర్  కేంప్ లోనరకయాతన అనుభవిస్తున్న దశలో ఆమె పరిశోధక విద్యార్థిగా ఉండేది. సమాజంలో తన స్థాయి నిలబెట్టుకోవడానికి, గౌరవంగా బతకడానికి తను విడాకులు తీసుకుంటానని ఆ రోజుల్లో ఆయనకు పలుమార్లు చెబుతూ ఉండేది. అలా అలా పన్నెండేళ్ళు గడిచిపోయిన తర్వాత 1952లో వారు విడాకులు తీసుకున్నారు. పరిస్థితులు మారి అన్నీ కాస్త చక్కబడ్డాక, మరో అయిదేళ్ళ తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ పెళ్ళి చేసుకున్నారు. పదిహేనేళ్ళు కలిసి జీవించాక 1972లో మళ్ళీ విడాకులు తీసుకున్నారు.

Also read: శాస్త్రజ్ఞులూ, నాస్తికులూ మానవతావాదులే!

1973లో అంటే ఆ మరుసటి సంవత్సరం, అంటే సోల్జినిత్సిన్ యాభయె అయిదేళ్ళ వయసులో, రెండో భార్య నటాలియా స్వెట్ లోవాను పెండ్లి చేసుకున్నాడు. ఆమెకు ముగ్గురు కొడుకులు పుట్టారు.

‘ఇవాన్ డాన్సోవిచ్ జీవితంలో ఒక రోజు’-  ‘కాన్సర్ వార్డు’- ‘ఫస్ట్ సర్కిల్’ – అలాగే ‘ద గులా ఆర్చిపెలాగో’ వంటి నవలలు విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి పోందాయి. ఒక నిజాయితీగల కమ్యూనిస్ట్ గా ఎదిగిన సోల్జినిత్సిన్, జీవితాంతం అలాడే నిలబడ్డాడు. ఎనభై తొమ్మిదేళ్ళ వయసులో 03 ఆగస్టు 2008న కన్నుమూశాడు. ఒక రచయితగా ఉంటూ, ఒంటరిగా హింసను భరిస్తూ కూడా, ప్రభుత్వాన్ని గడగడలాడించినవాడు అలెగ్జాండర్ ఇసయెవిచ్ సోల్జినిత్సిన్!

Also read: యోగాను సైన్సు ఎందుకు అంగీకరించదు?

అధికారంలో ఉండి ప్రభుత్వాన్ని నడుపుతున్నవారిదే ఎప్పుడూ తుది నిర్ణయం కాదు. నిరసనలు తెలుపుతూ దిశానిర్దేశం చేసే మేధావుల ఆలోచనలకు, సామాన్య ప్రజల ఆకాంక్షలకు, అభిప్రాయలకు కూడా ఎంతో విలువ ఉంటుంది. నిరసనల బలం  ఎంతో మనం భారతదేశంలో ప్రత్యక్షంగా చూశాం. పార్లమెంటులో బలం ఉంది కదా అని పౌరసత్వచట్టం తెచ్చుకోగానే అయిపోదుకదా? అధికార బలం ఎప్పుడూ ప్రజాబలం ముందు దిగదుడుపే!

Also read: కవి, వెండితెర కవిగా మారితే – బుద్ధదేవ్ దాస్ గుప్తా

(3 ఆగస్టు సోల్జినిత్సిన్ వర్థంతి)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles