Thursday, November 21, 2024

రాజకీయ సవ్యసాచి రామలింగారెడ్డి

కె. రామచంద్రమూర్తి

విభిన్న రాజకీయ సిద్ధాంతాలను ఆకళింపుచేసుకొని, క్షేత్రవాస్తవికతను గమనించి, ఆచరణాత్మకమైన దృక్పథంతో ప్రజలకు సేవచేసిన సిసలైన ప్రజాప్రతినిధి సోలిపేట రామలింగారెడ్డి. నక్సలిజాన్నీ, జర్నలిజాన్నీ రెండు కళ్ళుగా చేసుకొని సమాజాన్ని అధ్యయనం చేసిన విప్లవవాది. రెండు ఆయుధాలతో పోరాటం సాగించిన సవ్యసాచి. ఆ రోజుల్లో చాలామంది తెలుగు జర్నలిస్టులు, ముఖ్యంగా ప్రజలకు దగ్గరగా ఉండే విలేఖరులు, అదే బాటలో ప్రయాణం చేసేవారు.  తెలంగాణ రాష్ట్ర సమితి (టీ ఆర్ ఎస్ ) శాసనసభ్యుడుగా నాలుగో దఫా ఎన్నికైన తర్వాత కూడా విప్లవ కవి వరవరరావు నిర్బంధాన్ని నిర్ద్వంద్వంగా ఖండిస్తూ, ఆయనను వెంటనే విడుదల చేయాలని గట్టిగా విజ్ఞప్తి చేస్తూ ‘సాక్షి’లో ఘాటైన వ్యాసం రాసిన రాజీలేని మానవతావాది. అటు కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)కీ, ఇటు హరీష్ రావుకీ, కల్వకుంట్ల తారకరామారావు (కీటీఆర్)కీ తలలో నాలుకలా మెలగిన సమన్వయశీలి. ఒక శాసనసభ్యుడు మరణిస్తే అతని పార్థివదేహానికి అధికారపార్టీకి చెందిన ముగ్గురు అగ్రనాయకులూ, ఇతర పార్టీల నాయకులూ ముకుళిత హస్తాలతో, బాధాతప్త హృదయాలతో ప్రణామం చేసి వీడ్కోలు పలకడం అరుదైన సందర్భం. అటువంటి గౌరవం రామలింగారెడ్డికి దక్కింది. అందుకు ఆయన జీవించిన విధానమే కారణం.

ఒక వైపు వామపక్ష సిద్ధాంతాలు వల్లె వేస్తూ, నిజ జీవితంలో రాజీపడి సంప్రదాయపద్ధతులు అనుసరిస్తున్నవారు అనేకమంది సమాజంలో ఉన్నారు. పార్టీలు ఫిరాయిస్తూ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రాజకీయ నాయకులు సరేసరి. యవ్వనంలో కమ్యూనిస్టు భావజాలాన్ని విశ్వసించి, నాలుగు పదుల వయసు దాటగానే ఆ సిద్ధాంతాలను పక్కన పెట్టి బూర్జువాజీ సిద్ధాంతాలను తలకెత్తుకున్నవారిని సైతం చాలామందిని చూశాం. బాల్యం నుంచి మరణం వరకూ ఒకే విధమైన దృక్పథం కొనసాగించడం రామలింగారెడ్డి వ్యక్తిత్వ విశేషం. రాడికల్ విద్యార్థి సంఘం జిల్లా కార్యాదర్శిగా పని చేసిన పిన్నవయసు నుంచి చివరి శ్వాస తీసుకునేవరకూ ఒకే సిద్ధాంతంపట్ల అంకితభావం ఉండటం అతడికే చెల్లింది. టీఆర్ఎస్ శాసనసభ్యుడిగా వ్యవహరిస్తూనే తన వామపక్ష మూలాలను విస్మరించకుండా, ప్రజలలో మనిషిగా మెలుగుతూ, వారికి మూడు దశాబ్దాలకుపైగా ప్రత్యక్షంగా సేవ చేయడం రామలింగారెడ్డి ప్రత్యేకత. ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ, వారితో కలసి నడిస్తే చాలునని భావించి మంత్రిపదవికోసం అర్రులు చాచకుండా హుందాగా వ్యవహరించిన శాసనసభ్యుడు.

నక్సలిజాన్నీ, జర్నలిజాన్ని కలిపి జీవిస్తున్న రోజుల్లో ‘ఉదయం’ విలేఖరిగా సిద్ధిపేటలో పని చేస్తున్న రామలింగారెడ్డిని పోలీసులు టెరరిస్ట్ అండ్ డిజరప్టివ్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్)యాక్ట్ (‘టాడా’) అనే అమానవీయ చట్టంకింద కింద అరెస్టు చేసి ముషీరాబాద్ జైల్లో పెట్టారు. నేదురుమల్లి జనార్దనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పోలీసులు విజృంభించి నక్సలైట్లపైనా, వారికి సానుభూతిపరులుగా ఉన్నారనే అరోపణపై జర్నలిస్టులపైనా, పౌరహక్కుల నాయకులపైనా దాడులు చేశారు. ‘ఎన్ కౌంటర్’ అంటే నిరాయుధులను చంపివేయడం అనే అర్థం రూఢి అయింది 1980, 90లలోనే. రామలింగారెడ్డిని అరెస్టు చేసిన సమయంలో నేను ‘ఉదయం’ సంపాదకుడిగా హైదరాబాద్ లో ఉండేవాడిని. ఎన్ కౌంటర్ జరిగిన ప్రతిసారీ పౌరహక్కుల నాయకుడు  బాలగోపాల్ నాయకత్వంలో నిజనిర్ధారణబృందం ఘటనాస్థలికి వెళ్ళి వచ్చేది. ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి వాస్తవాలు వెల్లడించి పోలీసులను ప్రజల దృష్టిలో దోషులుగా నిలబెట్టేవారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో బాలగోపాల్ చెప్పిన వివరాలన్నీ పూసగుచ్చినట్టు ప్రచురించేవాళ్ళం. బాలగోపాల్ కి అంతటి విలువ ఇచ్చేవి పత్రికలు. ఆయన విశ్వసనీయత అటువంటిది. ముఖ్యంగా ‘ఉదయం’ పౌరహక్కులకు రక్షణకవచంలాగా నిలిచింది. ఒక ఎన్ కౌంటర్ జరిగినప్పుడు పోలీసుల కథనాన్ని ఎంత ప్రముఖంగా ప్రచురించేవాళ్ళమో అంతకంటే ఎక్కువ ప్రముఖంగా బాలగోపాల్ ప్రెస్ కాన్ఫరెన్స్ వార్తను ప్రచురించేవాళ్ళం. ఏ పౌరహక్కుల కార్యకర్త అయినా, నక్సలైట్ అయినా అర్ధరాత్రి అరెస్టు అయితే వెంటనే మాకు సమాచారం వచ్చేది. ఆ వార్తని ‘ఉదయం’ పత్రికలో మొదటి పేజీలో ప్రచురిస్తే అరెస్టయిన వ్యక్తి ప్రాణాలు దక్కేవి. లేకపోతే పోలీసులు చంపివేసి ఎన్ కౌంటర్ జరిగిందనీ, అతని పక్కన తుపాకీ, నక్సలైట్ సాహిత్యం దొరికాయనీ కట్టుకథలు చెప్పేవారు. నిజనిర్ధారణ బృందం నివేదికలను యథాతథంగా రాసినందుకు అప్పటి ఇండియన్ ఎక్స్ ప్రెస్ బ్యూరోచీఫ్ గా పనిచేస్తుండిన లక్ష్మీపతిని పేరు పెట్టి పోలీసులు బహిరంగంగా విమర్శించేవారు.

‘నువ్వు ఉద్యోగం మానేయాలి. నేను నిన్ను ఎన్ కౌంటర్ చేయాలి. జర్నలిస్టుగా ఉండగా ఎన్ కౌంటర్ చేయడం కష్టం,’ అంటూ రామలింగారెడ్డితో సిద్ధిపేట సర్కిల్ ఇన్ స్పెక్టర్ పచ్చిగా మాట్లాడాడంటే నాటి సంక్షుభిత కాలంలో ‘ఉదయం,’ ఇతర పత్రికలు  నిర్వహించిన పాత్రని ఊహించుకోవచ్చు. ఆదిలాబాద్ జిల్లా ఈనాడు విలేఖరి నరాల రమణయ్య, తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రభూమి విలేఖరి సింహంభొట్ల సూర్యసుదర్శనం, ఈనాడు మెదక్ జిల్లా విలేఖరి యాదగిరి, తమటం శ్రీనివాస్ గౌడ్ , సంజీవ్ కుమార్ వంటి చాలామంది విలేఖరులను అరెస్టు చేసినా, వారి పేర్లు ఎఫ్ ఐ ఆర్ లో చేర్చినా వారి ప్రాణాలు దక్కాయంటే పత్రికలలో వారి పేర్లూ, ఫోటోలూ ప్రచురించడమే కారణం.  ఈ వివరాలన్నీ ‘హ్యూమన్ రైట్స్ ఇన్ ఇండియా, పోలీస్ కిల్లింగ్స్ అండ్ రూరల్ వయొలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో ప్రచురించిన పుస్తకంలో ఉన్నాయి. నక్సలైట్లనూ, వారి సానుభూతిపరులనూ, జర్నలిస్టులనూ అణచివేయమని పోలీసులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ  అప్పటి ముఖ్యమంత్రులు పత్రికలలో వార్తలు ప్రకటించే స్వేచ్ఛను మాత్రం హరించలేదు, విలేఖరులు నిర్భయంగా రాసేవారు, సంపాదకులు ప్రచురించేవారు. ఆ వాతావరణం వేరు. 1995లో చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులకు అసాధారణమైన అధికారాలు ఇచ్చారు. మీడియాపైన ఆయన పట్టు పెరిగింది. కొన్నేళ్ళ  తర్వాత జరిగిన ఎన్ కౌంటర్లపై పోలీసులు చెప్పిందే వార్త. నిజనిర్ధారణ లేదు. విశ్లేషణ లేదు. బాలగోపాల్ మరణంతో ప్రశ్నించే గొంతుక మూగపోయింది. పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రామలింగారెడ్డికి భావజాలంపరంగా నక్సలిజంతో నిబద్ధత ఉన్నది కానీ తుపాకీ పట్టి యుద్ధం చేయడంలో ప్రవేశం లేదు. తుపాకీ జోలికి వెళ్ళకుండా పెన్నునే గన్నుగా వినియోగించినవాడు. అక్షరాలను శతఘ్నలుగా ప్రయోగించినవాడు. స్నేహబంధాలతో పార్టీ కార్యక్రమాలకు తోడ్పడినవాడు. సిద్ధాంతానికి నిబద్ధుడై పీపుల్స్ వార్ సానుభూతిపరురాలైన బీడీకార్మికురాలిని పెళ్ళి చేసుకున్నాడు. దండలమార్పిడి పెళ్ళికి ఆధ్వర్యం మంజీర రచయిత సంఘానిది. పెళ్ళిపెద్ద కేసీఆర్, పక్కనే హరీష్ రావు, ముఖ్యఅతిథిగా కాళోజీ నారాయణరావు. అదే రకమైన ‘స్టేజి’ మేరేజ్ శాసనసభ్యుడిగా ఉంటూ తన బిడ్డకూ, కుమారుడికీ సిద్ధిపేటలో నిర్వహించాడు. అప్పుడు కూడా కేసీఆర్ దే పెద్దరికం. హరీష్ రావుది ప్రధానపాత్ర. మంజీర రచయితల సంఘందే ఆధ్వర్యం. నందిని సిధారెడ్డి ఆశీస్సలు దండిగా ఉన్నాయి.  ఈ పెళ్ళిళ్ళకు నేనూ, ఇతర మిత్రులం కూడా హాజరైనాం. గుండెపోటుతో అకాలమరణం చెందిన ‘రామలింగం’ను చూసి కేసీఆర్ భోరున విలపిస్తే, గుండె చెరువైన హరీష్ రావు ఒక కిలోమీటరు దూరం పాడెమోశారు. అంత్యక్రియలను ఆసాంతం స్వయంగా పర్యవేక్షించారు. అంత గాఢమైన అనుబంధం వారిది. తెలంగాణ ఉద్యమంలో రామలింగారెడ్డి పాత్ర అటువంటిది. సిద్ధిపేట, దుబ్బాక ఇరుగుపొరుగు నియోజకవర్గాలు కనుక హరీష్ మద్దతు రామలింగారెడ్డికి బేషరతుగా, సంపూర్ణంగా ఉండేది.

ముషీరాబాద్ జైలులో రామలింగారెడ్డి ఉన్నప్పుడు నేను జైలుకు వెళ్ళి పరామర్శించి, జైలర్ తో మాట్లాడాను. రామలింగారెడ్డికి ధైర్యం చెప్పాను. విడుదల చేయించమని హోంమంత్రితో మాట్లాడాను. విడుదల చేయించి బయటకు తీసుకొని వచ్చాను. ఈ ఉదంతాన్ని రామలింగారెడ్డి అనేక సభలలో గుర్తుచేసుకునేవాడు. ఆ రోజుల్లోనే ‘ఉదయం’ విలేఖరిగా హైదరాబాద్ బ్యూరోలో పని చేస్తున్న గులాం రసూల్ ని పోలీసులు చంపివేశారు. ఆ రోజు రాత్రి పదకొండు గంటల వరకూ నా కేబిన్ లో కూర్చొని తాను సమాచారం సేకరిస్తున్న పరిశోధనాత్మక కథనం వివరాలు నాతో చర్చించి వెళ్ళిన రసూల్ తిరిగి రాలేదు. అతడిని అంబర్ పేటలో పోలీసులు అదుపులోకి తీసుకొని, కాల్చి చంపి శవాన్ని హైదరాబాద్ పొలిమేరలో మసీదుపాడులో పడేశారు. అతనితోపాటు విజయప్రసాద్ రావు అనే నిరుద్యోగిని కూడా పోలీసులు కాల్చి చంపారు. మర్నాడు సాయంత్రం నాలుగున్నరకు రసూల్ భౌతికకాయాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోస్ట్ మార్టం తంతు పూర్తి చేసి రాత్రికి రాత్రే రహస్యంగా ఎక్కడో ఖననం చేశారు. రసూల్ తండ్రి, తమ్ముడూ ‘ఉదయం’ ఆఫీసుకు వచ్చారు. నేను హోంమంత్రితో, రంగారెడ్డి జిల్లా ఎస్ పి భాస్కరరెడ్డితో మాట్లాడాను. రసూల్ భార్య జకీరాబేగంకు యాజమాన్యం ఉద్యోగం ఇచ్చింది. కొన్నేళ్ళ తర్వాత ఉదయం మూతపడింది. రసూల్ ను పోలీసులు హత్య చేశారంటూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ప్రభుత్వాలు చలించలేదు. నాబోటి జర్నలిస్టుల జీవితాలను నాటి ఘటనలు తీవ్రంగా ప్రభావితం చేశాయి. రామలింగారెడ్డిని గుర్తు చేసుకుంటే ఈ సన్నివేశాలన్నీ కళ్ళలో మెదులుతాయి. మనసు మూగపోతుంది. ‘సాక్షి’ పత్రికలో రామలింగారెడ్డి తరచుగా వ్యాసాలు రాసేవారు. అంతకు ముందు ఉదయం, వార్త, ఆంధ్రజ్యోతి పత్రికలలో, నేను ఏ పత్రికలో పని చేస్తే ఆ పత్రికలో వ్యాసాలు రాసేవాడు. హెచ్ ఎంటీవీ నిర్వహించిన చర్చాగోష్ఠిలో విధిగా పాల్గొనేవాడు. టీఆర్ ఎస్ లో వర్తమాన రాజకీయ, సామాజిక అంశాలపైన వ్యాసాలు రాసే అలవాటు కలిగిన  రాజకీయ నాయకులలో అగ్రగణ్యుడు రామలింగారెడ్డి. నక్సలైట్ గా ప్రారంభించి జర్నలిజంలోకి వచ్చినా నక్సలిజం భావజాలాన్ని వదిలిపెట్టలేదు. నక్సలిజం, జర్నలిజం వదిలిపెట్టి రాజకీయ ప్రధానస్రవంతిలో చేరి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మమేకమై, శాసనసభ సభ్యుడైనా నక్సలిజం భావజాలాన్నీ, జర్నలిజం ప్రవృత్తినీ వదలలేదు. నక్సలిజం, జర్నలిజం,  పార్టీ రాజకీయాలు కలగలిపి ప్రజాసేవ చేసిన అసాధారణ నాయకుడు రామలింగారెడ్డి. అతని మరణం టీఆర్ ఎస్ కీ, తెలంగాణ సమాజానికీ తీరని లోటు. నిష్కల్మషంగా, చెరగని చిరునవ్వుతో, నలగని ఖాదీ దుస్తులతో ప్రేమను పంచుతూ కనిపించే మిత్రుడికి ఇదే నా అక్షర నివాళి. రామలింగారెడ్డి కుటుంబ సభ్యులను నా ప్రగాఢ సంతాపం.

(సోలిపేట రామలింగారెడ్డిపై వ్యాసాల సంపుటి ‘స్వప్నసాధకుడు’ సంచిక ఆవిష్కరణ సందర్భంగా)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles