“సకలం” వెబ్ పోర్టల్ లో నేను కొండ దొరల ఆదివాసీ “ కుంతీకుమారి ” కధ రాశాను ( POSCO కేసు కారణంగా పేరు మార్చాను). “కొండదొరల కుంతీ కుమారి కధ”, ఫిబ్రవరి 5, 2024, (https://www.sakalam.in/demudu-jailed-wife-kunti-kumari-helpless/) వచ్చింది. ఆ కధ తరువాత జరిగిన సంగతులను “ ఫాలో అప్” గా రాసాను. “మా ఇంటికొచ్చింది మన కుంతి”, ఫిబ్రవరి 9, 2024, (https://www.sakalam.in/kunti-has-come-home/). ఇది మూడవ కధ.
అల్లూరి జిల్లా నుండి కొండదొర యువకులు
నిన్నఅల్లూరి సీతరామ రాజు జిల్లా, పాడేరు మండలం ( మొన్నటి వరకూ విశాఖపట్నం జిల్లా భాగం) ఐయినాడ పంచాయితీ నుండి ముగ్గురు కొండదొర యువకులు మా ఇంటికి వచ్చారు. “ఆ నాలుగు కొంపలకు కరెంట్ ఎప్పటి నుండి లేదు?” నేను అడిగిన ఆ ప్రశ్నకు కొన్ని సెoకoడ్స్ మౌనం తరువాత, “అప్పటి నుండి లేదు” అని జవాబు వచ్చింది. “ అప్పుడు” అంటే ఎప్పడు?. ఆ వచ్చిన ముగ్గురి వయస్సు 30 నుండి 40 మధ్యలో వుంటుంది. అంటే వారికీ తెలిసిన దగ్గిర నుండి అక్కడ కరెంటు లేదు. వారికి ఎప్పుడి నుండి తెలుసో అప్పటి నుండి వారికి రాత్రి పగటి వెలుగు, రాత్రి లేదు. వుంటే గింటే, రాచకొండ విశ్వానాధ శాస్త్రి అన్నట్లుగా “ ఎన్నేలా! కన్నతల్లి, పేదోడి దీపమా”, ఆ వెన్నెల దీపం మాత్రo వుంది. కాని అమవాస్య రోజు ఆ దీపం కూడా వుండదు. మొన్న అమవాస్య నాడు, ఇది “కొత్త అమవాస్య” అనుకుoటు భక్తులు గుళ్ళు, గోపురాలకు పోటేత్తుతున్నప్పుడు ఆ నాలుగు కొండదొర ఆదివాసీ కుటుంబాలు మాత్రం ఇది మాకు “పాత” అమవాస్యే” అనుకుంటూ సర్దుకు పోయారు.
ఆ నాలుగు ఇల్లు, పాడేరు మండలం, ఐనాడ పంచాయితీలో, అడవుల దాక్కున్న రాకోట ఆవాస గ్రామానికి చెందినవి. రాకోట గ్రామమే అడవిలో వుంటే, ఈ నాలుగు ఇల్లు బాగా ఆవల లోతట్టు అడవిలో వున్నాయి. ఆ నాలుగిల్లలో కుంతి దేవి ఇల్లు ఒకటి. ఆ ఇంటి యజమాని POSCO చట్టం కేసులో అరెస్టుకాబడి విశాఖపట్నం సెంట్రల్ జైలులో వున్నాడు.
రాత్రిపూట వెలుగు కోసం ఏo చేయాలి? విద్యుత్తు లేకపోతె కిరోసిన్ దీపం వెలిగించుకోవాలి. చౌక ధరల రేషన్ దుకాణం నుండి కిరోసిన్ ఇవ్వడం నిలిపివేసి చాలకాలం అవుతోoది. ఇక వేరే మార్గం? నూనే దీపం. పెరిగిన ఉల్లిపాయల ధరలను గూర్చి అడిగితె, చిరాకుగా మొహం పెట్టి “తాను ఉల్లిపాయలు ఎద్దగా వాడనని అందుకోసం వాటిని కొనుగోలు చేయనని” మన విత్తమంత్రి నిర్మలమ్మ గారు చెప్పారు. దీపం వెలుగు కోసం నూనే, కొవ్వొత్తులు కొనుగోలు చేసుకోగలిగే జీవితాలు కావు వారివి. కుంతీకుమారి, ఆమె చట్టు వున్న ఆ మూడు ఇళ్ళకు వెలుగు కావాలి. వారు ఉంటున్నది అడవి మధ్యలో.
ఆ నాలుగు ఇళ్ళలో ఒకదానిలో ఇద్దరు కుష్టు వ్యాధి గ్రస్తులైన తల్లి కొడుకు వుoటున్నారు. (ఆమె మరో కొడుకు, మన కధలోని కుంతీదేవి భర్త). కుంతీకుమారి ఆమె సోదరుడు కలసి పక్కనే మరో ఇంటిలో వుంటారు. ఈ రెండు ఇళ్ళకు వెనుక మరో రెండు. కుంతీకుమారి భర్తను పాడేరు పోలీసు వారు POSCO కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. కుంతీదేవి ఇప్పుడు 6 నెలల గర్బవతి. తన పేరు “ దేముడు” పేరులోనే కాదు నిజంగా దేముడే. ఎందుకంటే, తన భార్య తరపున మానసిక వికలాంగుడైన ఆమె సోదరుడ్ని, ఇద్దరు వ్యాధి గ్రస్తులైన తల్లి, అన్నలను తన రెక్కల కష్టంతో చూసుకుoటు వస్తున్నాడు. ఇప్పుడు దేముడు జైలులో వుండటంతో, తన కడుపులోని బిడ్డనే కాదు మిగిలిన ముగ్గురిని చూసుకోవలసిన బరువు ఈ బాల కుంతీపై పడింది.
అఖిలమ్మ అడవిలోకి వెళ్ళింది
అనకాపల్లిలోని వైద్యులు తనను పరీక్షించి, బిడ్డ బాగానే వుందని, కాకపొతే అమ్మాయికి రక్తం లేదని, రెండు నెలలకు సరిపడా మందులు ఉచితంగా ఇచ్చారు.
అఖిల గారు ఆమె బృందం, అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం (AIPOW) సభ్యులైన గోరా దేవి, పీఎస్ కోటమ్మ మార్చి నెలలో అక్కడికి వెళ్ళారు. పోషక విలువలతో కూడిన ఆహార పదార్దాలు, వ్యాధి గ్రస్తులకు మందులు అఖిల తమ సంస్త నుండి అందజేశారు. ఇచ్చారు. మహిళ సంఘం ప్రతినిధులు కుంతీదేవి చేతిలో 1000 రూపాయలు సాదర ఖర్చులకు పెట్టారు.
కుంతీదేవి పేరున ఒక పోస్టల్ ఎకౌంట్ తెరిచాము. దానికి 5 వెల రూపాయల నగదును పంపారు డాక్టర్ రుక్మిణి రావు గారు. ఆమెకు ఒక పొస్టల్ ATM కార్డు కూడా అందజేయగలిగాము. ఇప్పుడు “సంత” ( మార్కెట్) ఖర్చులకు కొంత ఆసరావుంది.
సౌర వెలుగులు
ఉదయం నుండి సాయింత్ర వరకు తన వెలుగులతో లోకాలను నింపే ఆ ఉదయభానుడు రాత్రికాగానే తన గూటికి చేరుతాడు. కాని ఆయనకు తెలుసా అప్పుడు ఆ కారు చీకటి కుంతీదేవి ఇంటికి చేరుతుందని? భారత ప్రభుత్వపు ఇంధన శాఖకు కార్యదర్శిగా నాయకత్వం వహించిన ఇఏఎస్ శర్మగారు, ఐఏఎస్ ( విశ్రాంతి) ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ కమీషనర్ గా, శ్రీ ఎస్ ఆర్ శంకరన్ గారి నేతృత్వంలో పని చేశారు. ఆయనకు ఆదివాసీలు అంటే ఎవరో , వారిని ఆవరించిన చీకట్లు ఏమిటో బాగా తెలుసు. ఆయన, వారి శ్రీమతి రాణి శర్మ కుంతీదేవి కధను చదివారు. సోలార్ విద్యుత్ దీపాలను ఉత్పత్తి చేసే శ్రీ రంగనాయకులు గార్ని సంప్రదించారు. రంగనాయకులు గారు 1. నాలుగు సోలార్ ఇంటి దీపాలు 2. నాలుగు పాకెట్ సైజ్ టార్చి లైట్స్ 3. ఆ నాలుగు ఇళ్ళకు మధ్య ఒక సోలార్ వీధి దీపాన్ని అనకాపల్లికి పంపారు.
ఏప్రిల్ 11 వ తేది రాత్రి, రాకోట కొండదొర యుకుల సహయంతో ఈ దీపాలు వారికీ చేరాయి. ఆ నాలుగు ఇళ్ళ మధ్య సోలార్ వెలుగు దీపం సూర్య ధ్వజంలా లేచింది. సూర్యుడు అస్తమించ లేదు ఇప్పుడు కుంతీదేవి ఇంటికి చేరుకున్నాడు. ఆ దీపాల వెలుగులో వారు సంబరాలు చేసుకున్నారు. ఆ ఫోటోలు, వీడియో నాకు పంపారు.
విశాఖపట్నం జైలులో వున్న దేవుడి కధ నాకు కొత్త సంగతులు కొన్ని తెలిపింది. వాటిని “ బెయిల్ మాఫియా” పేరుతొ మరోసారి వివరిస్తాను. ఆయను బయటకు తీసుకురావడంపై మా శక్తులు పెట్టాము. ఈ రోజు, అనగా ఏప్రిల్ 12న మా మిత్రుడు గణేష్ గారు జైలుకు వెళ్లి దేముడ్ని కలసి దైర్యం చెప్పి వచ్చారు. తాను ఆవేదన చెందుతూ, కన్నీటిపర్యoతమయ్యాడని నాకు గణేష్ చెప్పారు. అడవిలో స్వేచ్చగా తిరిగిన ఆ స్వేచ్చ మానవుడు ఒక్కసారిగా , తాను చేసిన ఆ నేరం ఏమిటో తెలియకుండానే జైలుకు పోవడమంటే ఏమిటో మీరు వూహించగలరా!?. రాతి దేవుడి కోసం గుడులు కడతారు కాని మనిషి దేవుడ్ని జైలుకు నెడతారు. ఆ ఆదివాసీ “దేముడు” జైలు గోడలు దాటుకొని బయటకు వచ్చే వరకు మా మానవ ప్రయత్నం సాగుతూనే వుంటుంది.
పీఎస్ అజయ్ కుమార్