నిజం నోరు దాటే లోపలే పుకారు ఊరు దాటుతుందంటారు. సోషల్ మీడియా ప్రవేశం తరువాత ఈ వదంతుల వేగం మరింత పెరిగింది.
కొందరు రాజకీయ నాయకుల గురించి, లేదా సినీ, సామాజిక రంగాల్లో ప్రముఖుల గురించి ఫోటో షాపో, మరో ప్రక్రియ ఏదో తెలియదు కానీ, అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఫోటోలు ఈ మీడియాలో విచ్చల విడిగా హల్ చల్ చేస్తున్నాయి. వారి గురించిన కాకమ్మ కబుర్లు వంతులవారీగా గిరికీలు కొడుతున్నాయి. వాటిల్లో నిజమెంతో వాటిని షేర్ చేసే వారికి తెలవదు. వాస్తవాన్ని నిర్దారించుకోకుండానే వాటిని షేర్ చేస్తూ పోతుండడంతో ఆ నీలివార్తలు ప్రచండ వేగంతో ప్రపంచాన్ని చుట్టబెడుతున్నాయి. విన్న వింత చదివినప్పుడు వాస్తవంగా అనిపిస్తుందన్న మాట ప్రకారం అవన్నీ నిజమేనేమో అన్న భ్రాంతికి కూడా కొందరు అమాయకులు గురవుతున్నారు.
లక్ష్మణరేఖను గౌరవించాలి
మీడియా, అది ప్రింటు కావచ్చు విజువల్ కావచ్చు, ఏదైనా విషయాన్ని రచనల ద్వారా లేదా చిత్రాల ద్వారా ఇతరులతో పంచుకోవడానికి కొన్ని పద్దతులు వున్నాయి. ఈ విధానాలకు చట్ట స్వరూపం లేకపోవచ్చు, కానీ లక్ష్మణ రేఖ వంటి స్వయం నియంత్రణలు వున్నాయి.
సోషల్ మీడియాకు ఈ పరిమితులు, స్వయం నియంత్రణలు లేవు. వున్నట్టు నిబంధనలు చెబుతున్నా వాటిని పాటిస్తున్న దాఖలా లేదు. నూటికో, కోటికో ఎప్పుడో ఎవ్వరో పోలీసులకు పిర్యాదు చేస్తే కంటి తుడుపు చందంగా చర్యలు తీసుకున్న వార్తలు సకృత్తుగా కానవస్తాయి. సోషల్ మీడియా రంగ ప్రవేశం తరువాత చోటుచేసుకుంటున్న రకరకాల వికృత పోకడల్లో నీలివార్తల వ్యాప్తి ప్రధానమైనది. ఈ మీడియాలో వేగం ముఖ్యమైన వెసులుబాటు కావడంతో ప్రచారకర్తల కన్ను కూడా ఈ మీడియాపై పడుతోంది. రాజకీయ నాయకులు సయితం ప్రజలకు చేరువగా వుండడానికి ఈ ‘మీడియం’ పైనే దృష్టి పెడుతున్నారు. వెనుకటి రోజుల్లో పత్రికా ప్రకటనల మీద ఆధారపడే పరిస్తితి క్రమంగా తగ్గి పోతోంది. కేవలం ట్వీట్లతో అటు మీడియా దృష్టిని, ఇటు ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే ప్రస్తుతం ప్రాధాన్యత ఇస్తున్నారు. విలేకరుల సమావేశంలో అయితే ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన తలనొప్పి వుంటుంది. ఈ ట్వీటింగులో ఆ గొడవ లేదు. ట్వీట్ చేసి కూర్చుంటే చాలు, కాగల కార్యం మీడియానే చూసుకుంటుంది అనేది వారి ధీమా.
సోషల్ మీడియా ప్రభావం గుర్తించిన రాజకీయ పార్టీలు
ఇక అన్ని రాజకీయ పార్టీలు ఈ సోషల్ మీడియా ప్రభావాన్ని గుర్తించి తమ ప్రచారాలకు ముఖ్య సాధనంగా మార్చుకుంటున్నాయి. తమ పార్టీ గురించి, తమ నేతల గురించీ సానుకూల సమాచారాన్ని మార్పిడి చేసుకుంటూ వుంటే అభ్యంతర పెట్టాల్సింది ఏమీ వుండదు. కానీ దానికి తోడు, అధికారికంగానో, అనధికారికంగానో కొన్ని గ్రూపుల ద్వారా ప్రత్యర్ధులపై దుష్ప్రచారానికి ఈ మీడియాను వాడుకునే ధోరణితో అవి ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో వ్యక్తిగత నిందారోపణలు, వ్యక్తిత్వ హననాలు ఆకాశమే హద్దుగా సాగుతున్నాయి. మార్ఫింగ్ చేసిన చిత్రాలతో ప్రత్యర్ధులపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నాయి. అనేక సందర్భాలలో శృతిమించి రాగాన పడుతున్న మాట కూడా వాస్తవం.
ఆలోచన రావడమే ఆలస్యం
నిజానికి వెనుకటి తరానికి తెలియని ఈ సోషల్ మీడియా, నేటి తరానికి, రానున్న తరానికి ఓ వరప్రసాదం. భావవ్యక్తీకరణకు సులభతరమైన మార్గం. వెనుకటి రోజుల్లో జనాలు తమ అభిప్రాయాలు తెలుపుకోవడానికి ఎటువంటి అవకాశమూ వుండేది కాదు, పత్రికల్లో ప్రచురించే పాఠకుల లేఖలు తప్ప. ఇప్పుడలా కాదు ఇలా మెదడులో ఆలోచన రావడం ఆలస్యం, చేతికి పనిచెప్పడం, చేతిలో వున్న మొబైల్ ద్వారా దాన్ని క్షణాల్లో ప్రపంచానికి తెలపడం. అది రాజకీయం కావచ్చు, సాహిత్య అంశం కావచ్చు, గృహసంబంధమైన విషయం కావచ్చు, కంటికి కనబడ్డ విషయం కావచ్చు, కెమేరాకు చిక్కిన దృశ్యం కావచ్చు, చెవిన పడ్డ సంగతి కావచ్చు అదీ ఇదీ అని లేదు, ఉచ్చమూ నీచమూ అన్నతేడా లేదు, ఎవరేమనుకుంటారో అనే సంకోచం లేదు అలా వున్నపళంగా ఆ ఆలోచనలను, ఆ భావాలను, ఆ స్పందనలను, ఆ విమర్శలను, ఆ మెచ్చుకోళ్ళను, ఆ వేళాకోళాలను అక్కడికక్కడే, అప్పటికప్పుడే వెళ్ళగక్కి మనసులో భారాన్ని తగ్గించుకోగల గొప్ప సాధనం ఇది. సరిగా వాడుకుంటే సత్ఫలితాలను ఇచ్చే ఓ మహత్తర సాంకేతిక ప్రక్రియ ఇప్పుడు అందరికీ ఓ కాలక్షేప సాధనంగా మారిపోయింది. సమాచార మార్పిడికి, ముక్కూమొహం తెలియని వ్యక్తుల నడుమ కూడా సాంఘిక సంబంధాలను ఏర్పరచడానికి ఎంతగానో వీలుకల్పిస్తున్న ఈ సోషల్ మీడియా క్రమంగా నీలివార్తల ఉత్పత్తి, పంపిణీ కేంద్రంగా మారిపోతోంది. నిజంగా ఇదొక పెను విషాదం.
పిన్న వయస్కుల నుంచీ నేర్చుకోవచ్చు
ముందే చెప్పినట్టు, వెనుకటి తరానికి చెందిన వాళ్ళు మొదటిసారి ఈ కొత్త ప్రపంచంలో తొలి అడుగు పెట్టినప్పుడు వాయువేగ మనోవేగాలతో సాగుతున్న సమాచార మార్పిడిని చూసి మాన్ప్రడి పోతున్న మాట వాస్తవం. జరుగుతున్న సాంఘిక, రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తూ యువతరం చురుగ్గా, భేషుగ్గా స్పందిస్తున్న తీరుని గమనిస్తూ మౌన ప్రశంసలు గుప్పించి వుంటారనుకోవడంలో కూడా సందేహం లేదు. చిన్న చిన్న వాక్యాలతో, తేలికయిన పదాలతో నేటితరం వెల్లడిస్తున్న అభిప్రాయాలను చూసి ‘నేర్చుకోవాలనే తపన ఉండాలే కానీ, వాటిని చిన్నవయసు వారి నుండి కూడా నేర్చుకోవడానికి పెద్ద వయస్సు పెద్ద అడ్డంకి ఏమీ కాదు’ అనుకుని సమాధానపడుతున్నది కూడా వాస్తవ దూరం కాదు. పాత సంగతులు గురించి, వెనుకటి రోజుల్లోని సంప్రదాయాలు, ఆహార విహారాలు గురించీ నవతరం రాస్తున్న విధానాలు గమనిస్తూ, విస్తుపోతూ, మురిసిపోతున్న మాట కూడా అంతే నిజం.
వీధి రౌడీల భాష వద్దు
అయితే, దురదృష్టం, ఈ సోషల్ మీడియాలో కొందరి నిర్వాకం వీరి ఆశలపై నీళ్ళు చల్లుతోంది. కొందరు వాడే పద ప్రయోగాలు వెగటు పుట్టిస్తున్నాయి. వీధి రౌడీల భాషను మరిపిస్తున్నాయి. రాజకీయ, సినీ రంగాల్లోని అభిమాన,దురభిమానాల క్రీ నీడలు మరింత ముదిరిపోయి ఈ మీడియాలో ఊడలు దించాయి. వెనుకటి రోజుల్లో సినీ అభిమానులు తమ అభిమాన నటుడి ప్రత్యర్హుల సినిమా పోస్టర్లపై పేడ కొడుతుండేవారు. అదే ఇప్పుడు తీరు మార్చుకుని సోషల్ మీడియా గోడలపై బురద చల్లే రూపం సంతరించుకుంది. వ్యాఖ్యలు, ప్రతి వ్యాఖ్యల స్థాయిని మించి, విమర్శలు, ప్రతి విమర్శల హద్దును అధిగమించి, ఆరోపణలు, ప్రత్యారోపణల చెలియలికట్ట దాటి ఈ సోషల్ మీడియా మూల స్వరూపాన్నే ఈ విష సంస్కృతి మార్చివేస్తోంది.
సోషల్ మీడియా నిప్పులాంటిది
ఈ మాట ఎవరి మనసుకయినా నొప్పి కలుగుతుందేమో, ఈ వ్యాఖ్య ఎవరినయినా మానసికంగా గాయపరుస్తుందేమో అన్న విచక్షణ చాలామందిలో కానరావడం లేదు. ‘ నా ఇష్టం, నేను ఇలానే రాస్తాను,మీకిష్టమైనది మీరు రాసుకోండి’ అనే తెంపరితనం కట్లు తెచ్చు కుంటోంది.
ఈ సందర్భంలో తిక్కన భారతంలో రాసిన ‘ఒరులేయవి ఒనరించిన…అనే పద్యం గుర్తుకువస్తోంది. ‘ఇతరులు ఏది చేస్తే మీకు ఇష్టం వుండదో, అదే పని మీరు ఇతరుల విషయంలో చేయకండి’ అని బోధించే ఈ పద్యం అరణ్య పర్వంలో వస్తుంది. ఈ నాటి సోషల్ మీడియాకు నూటికి నూరుపాళ్ళు వర్తించే నీతి ఇది. నిప్పుతో వంట చేసుకోవచ్చు, ఒళ్ళు కాల్చుకోవచ్చు. అలాంటి నిప్పులాంటిది ఈ సోషల్ మీడియా. అంతా వాడుకోవడంలోనే వుంది.
వేళాకోళానికి వ్యంగ్యానికీ తేడా వుంది. వ్యంగానికీ సునిశిత హాస్యానికీ బేధం వుంది. అవి తెలుసుకోకుండా వాడితే జోకు మేకవుతుంది.