వోలేటి దివాకర్
అధికార వై ఎస్సార్ సిపి ప్రభుత్వంలో ఎస్సీ , ఎస్టీ , బిసి , మైనార్టీలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు , ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేబినెట్లో ఆయా వర్గాలకు లభించిన ప్రాధాన్యతను తెలియజేసేందుకు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు సామాజిక న్యాయభేరి పేరిట బస్సు యాత్రను చేపట్టారు. ఈ నెల 26న ప్రారంభమైన బస్సు యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. వైసిపి నాయకులు ఎన్ని చెప్పినా వచ్చే ఎన్నికల్లో ఆయా వర్గాల ఓట్లు సాధించడమే ఈ యాత్ర అసలు లక్ష్యమన్నది సుస్పష్టం. గడపగడపకు వైసిపి ప్రభుత్వం కార్యక్రమాన్ని పక్కన పెట్టి మరీ ఈకార్యక్రమాన్ని తలపెట్టారు.
అయితే కారణాలేవైనా కావచ్చు … ఎంతో కీలకమైన ఈ కార్యక్రమంలో సామాజిక భేరిని సరిగ్గా వినిపించలేకపోతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యాత్ర తొలిరోజే విజయనగరంలో భారీ వర్షం కారణంగా బహిరంగ సభ రద్దయ్యింది.
తూర్పులో ప్లాప్
ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కీలకమైన మహానాడు వేడుకలు జరుగుతున్న వేళ … ఒకవైపు వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబుపై ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డ్రైవర్ హత్య కేసు … మరోవైపు కోనసీమ జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు వ్యతిరేకిస్తూ అమలాపురంలో విధ్వంసాలు జరిగాయి. ఈ సందర్భంగా దళిత, బిసి సామాజిక వర్గాలకు చెందిన మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ గృహాల దహనం వంటి దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. బస్సు యాత్ర విశాఖ మీదుగా తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం చేరుకుంది. ఇలాంటి సమయంలో ప్రాధాన్యత కలిగిన రాజమహేద్రవరం సభలో సామాజిక న్యాయభేరిని బలంగా వినిపించాల్సిన అవసరం ఉంది.
అయితే వివిధ కారణాల వల్ల జనసమీకరణలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వైసిపి నాయకులు విఫలమైనట్లు కనిపిస్తోంది. దీంతో మంత్రుల మాటలను వినేవారే కరవయ్యారు. పైపెచ్చు మంత్రుల ప్రసంగాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. బస్సు యాత్రలో జాప్యం కూడా ఇందుకు ఒక కారణంగా చెప్పవచ్చు. ప్రణాళిక ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు రాజమహేంద్రవరం చేరాల్సిన బస్సు యాత్ర రాత్రి 7 గంటలకు స్టేడియంలోని సభాస్థలి వద్దకు చేరుకుంది . అప్పటికే సభలో సగం మంత్రి సభకు తరలించిన జనాలు ఇళ్ల బాట పట్టగా, మంత్రుల ప్రసంగాలతో సభ ముగిసే నాటికి వైసిపి నాయకులు, పోలీసులు, పాత్రికేయులు మాత్రమే మిగిలారు. ఈ పరిణామాలతో సామాజిక భేరికి ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి ఏర్పాట్లు చేసిన జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజు , ఎంపి మర్గాని భరత్ రామ్ నిరుత్సాహ పడ్డారు. వైసిపి ప్రభుత్వం పట్ల, తమ సామాజిక వర్గాలకు చెందిన మంత్రుల పట్ల ప్రజలకు అభిమానం ఉంటే సభలో సగం మందైనా మిగిలేవారు కదా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది . అనంతపురం వరకు ఈ బస్సు యాత్ర ఇదే రీతిన సాగితే వైసిపి ఆశించిన ఫలితాలు లభించకపోవచ్చు. ఈవిషయమై అధికార పార్టీ తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.