“మానవ వాహిని”సంస్థ వ్యవస్థాపకులు, సామాజిక చింతనాశీలి అస్తమయం
ఇప్పుడే తెలిసిన విషాదకర మైన వార్త. జట్టు పద్మజ గారి ద్వారా సుమారు పదేళ్ళ నుండీ నాకెంతో ఆప్తులైన పెద్దలు, మిత్రులు, సమాజ హితైషి, ఎప్పుడూ నా శ్రేయస్సును ఆకాంక్షించే శ్రేయోభిలాషి,ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక మొదలు దేశంలోని గాంధేయ వాద, సామ్యవాద సమాజ సంస్థ లెన్నింటి తోనో ప్రత్యక్ష సంబంధాలు గల మహోన్నత వ్యక్తి, అసాధారణ బుద్ధిజీవి, ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కోసం అహర్నిశలు శ్రమించిన “మానవ వాహిని” వ్యవస్థా పకులు, ఉమ్మడి గోదావరి జిల్లా గండ్రేడులో జన్మించి జాతీయ స్థాయిలో అనితర సాధ్యమైన ఎత్తుకి ఎదిగిన మనీషి గరిమెళ్ళ నారాయణ గారు నిన్ననే ముంబయి లో మరణించారని తెలిసింది!
స్వాతంత్ర్యోద్యమాన్ని కళ్ల ముందు ఎక్సరేతీసి చూపెట్టి నంత స్పష్టంగా విశ్లేషించగల నిపుణులు. ఒక్క గాంధీయే కాదు, నెహ్రూ, జె.పి, అంబేద్కర్, లోహియా, రస్సెల్ వంటి దేశ విదేశీ బుద్దిజీవుల్ని లోతుగా అర్ధం చేసుకున్న నేత నారాయణ. ఆయనతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్. ఈ ఏడు ఫిబ్రవరిలో పిఠాపురంలో జరిగిన నాన్న సంస్మరణ సమావేశానికి ప్రత్యేకంగా రావడమే కాక, ‘ఏకవ్యక్తి సైన్యం’ పుస్తకాన్ని అప్పటికప్పుడే చదివి మాట్లాడిన ప్రేమాస్పదులు. “నిన్ను తల్చు కోని క్షణం లేదు. ఇవే ఆయన ఫోన్ లో నాతో మాట్లాడిన చివరి మాటలు. జయరావు, నేనూ, శివ ప్రసన్న తో కల్సి ముంబై వెళ్ళి చూసొద్దామనే అనుకున్నా. ఇంతలోనే ఈ వార్త వినాల్సి వచ్చింది!
చుండి జగన్నాథం ఆద్వర్యంలో నడిచిన ‘చక్రం’ పత్రికలో మద్య పాన నిషేధానికి సంబంధించిన నిర్మాణాత్మక రచనలు చేయడం మొదలు, మేథాపాట్కర్ వంటి సామాజిక ఉద్యమకారులతో కల్సి ఉమ్మడి కార్యాచరణ రూపొందించడం వరకూ ఆయనో తిరుగులేని స్వాప్నికుడు. కనీసం వారంలో ఒకసారైనా ఫోన్ చేసి మరీ పలకరిస్తూ, తెలుగు ప్రాంతం లో ప్రజాచైతన్య యాత్రని నన్ను ప్లాన్ చేయమని పదేపదే కోరిన వ్యక్తి. దాదాపు తొంభై ఏళ్ళ వయసులో కూడా తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారోద్యమం చేయాలని తపించిన ఆలోచనాపరుడు. నా అక్షరాల్ని, ఆచరణని నాకంటే ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి!
అటు పార్వతీపురం మొదలుకొని ఇటు గుంటూరు వరకూ, విశాఖపట్నం నుండి హైదరాబాద్ దాకా, ఒడిషాతో మొద లెడితే గుజరాత్ దాకా నెలలో కనీసం నాలుగైదు కార్య క్రమాలకి హాజరయ్యే వారు. దేశంలోని ఎక్కడెక్కడి సామాజిక కార్తకర్తలతోనూ ఎప్పుడూ సంబంధాలు కలిగిఉండేవారు. విపరీతంగా అధ్యయనం చేసేవారు. అలాంటి సామాజిక ఆలోచనా పరులు, ప్రజాపక్ష మేధావి గరిమెళ్ళ నారాయణ అమర్ రహే! ఆయన ఆశయాల్ని కొనసాగిస్తామనే మాటిస్తూ, కన్నీటి నివాళులతో…
(ఆయన మిత్రులు, అభిమానులు పూనుకుని త్వరలోనే ఆయన గురించి జయరావు రాసిన నోట్స్ ఆధారంగా ఆయన జీవితం కోసం చిన్న పుస్తకాన్ని ప్రచురిస్తే బావుంటుంది. అలాగే, మరణించే వరకూ తెలుగు ప్రాంతాన్ని మనసారా ప్రేమించిన ఆయన సంస్మర ణార్థం సామాజిక ఆలోచనా పరులతో చిన్న సమావేశం కూడా ఏర్పాటు చేసేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను. ఇతర మిత్రులకు వార్త తెలపడం కోసం ఇప్పటికిలా ఈ చిన్న రైటప్ !)
- గౌరవ్