మాశర్మ
(జర్నలిస్ట్, కాలమిస్ట్)
భారతీయ నాట్య కళా రూపాలలో తెలుగువారికి చెందిన విశిష్ట కళ ‘కూచిపూడి’. ఈ రంగానికి జీవితాన్ని అంకితం చేసి,ఆ కళకు విశేష ఖ్యాతి తెచ్చిపెట్టిన విలక్షణ విదుషీమణి శోభానాయుడు. కూచిపూడికి పర్యాయపదంగా నిలిచిన ఈ కళాకారిణి కన్నుమూశారు. కూచిపూడి కళారంగానికి ఇది పూడ్చలేని లోటు. ఉద్దండులైన నాట్యాచార్యులు కూచిపూడి నాట్యానికి వన్నెచిన్నెలు అద్దారు. ఆ కోవలో వికసించిన ఈ కొమ్మ కొత్త శోభలు అందించారు. సుప్రసిద్ధులైన వెంపటి చిన సత్యం శిష్యులలో ఒక తరాన్ని శోభానాయుడు శాసించారు. ఈమె ఎందరో శిష్యులను తయారుచేసి కొత్త తరాలకు ఈ కళా వారసత్వాన్ని అందించారు.
నాట్యకళలో రాణించిన మహిళ
కూచిపూడి నాట్య రూపకాలను ఒకప్పుడు మగవారు మాత్రమే పోషించేవారు. ఆ తెరలను దించి ఆడవారికి కూడా ఈ కళను అందించిన ఘన నాట్యాచారులలో వెంపటివారు సిద్ధహస్తులు, ప్రసిద్ధులు. సిద్ధేంద్ర యోగి పుణ్య ప్రసాదంగా భావించే ఈ కళామతల్లికి నర్తన ద్వారా అర్చనచేసిన వారిలో ప్రతిభాశోభామూర్తి శోభానాయుడు. ఈ రంగంలోకి రావడానికి తల్లిదండ్రులు పెద్దగా ఆసక్తి చూపకపోయినా, వారిని ఒప్పించి, ఈ విద్యలోకి వచ్చి రాణించిన ప్రజ్ఞాసుశోభితురాలు శోభానాయుడు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ఈమె జన్మించారు. మొదటిగా రాజమహేంద్రవరంలో పి ఎల్ రెడ్డి దగ్గర నాట్య విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టారు. తర్వాత వెంపటి చిన సత్యం వద్ద సంపూర్ణంగా శిక్షణ పొందారు. ఇంత గొప్ప గురువు దొరకడంతో ఈమె విద్య మరింతగా వికసించింది. దాదాపు 12సంవత్సరాల పాటు కఠోరమైన సాధన చేశారు. నాట్య రంగంలో ప్రవేశించినప్పుడు సహనాన్ని సాధన చెయ్యమని గురువు చెబుతారు. ఇదే విద్యార్థికి అందించే తొలిపాఠం. సహన సాధనతో సాధించిన ఈ విద్య శోభానాయుడుకు గురువు వెంపటి చిన సత్యం నుండి ప్రశంసలు, ఆశీస్సులు చిరకాలంలోనే సంపాయించి పెట్టాయి. చిన్న వయస్సులోనే ప్రధాన భూమికలు పోషించే సౌభాగ్యం ఈమెకు దక్కింది. గురువు వెంపటివారితో కలిసి దేశవిదేశాల్లో వందలాది ప్రదర్శనలు ఇచ్చే అదృష్టం కూడా ఈమెను వరించింది. సహజ ప్రతిభ, గురు శుశ్రూష, కఠోరమైన సాధన, అంకితభావం, భక్తి మొదలైన సుగుణాల వల్ల చిన్న వయస్సులోనే ఈమెకు పెద్ద పేరు వచ్చింది. బృందంలోనూ,బృందంతోనూ, సోలో గానూ వేల ప్రదర్శనలు ఇచ్చారు. శాస్త్రాన్ని నూటికి నూరు శాతం పాటిస్తూ,అపురూపమైన హావభావాలతో, లాస్య విన్యాసం చేస్తూ ఆమె ఇచ్చిన ప్రదర్శనలు కోట్లాదిమందిని విశేషంగా ఆకర్షించాయి. సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రలలో ఆమె పోషించిన తీరు ముగ్ధమనోహరంగా, హృదయోల్లాసంగా, రసరంజితంగా ఉండేవి. తను ఎంతో ఇష్టపడి కష్టపడి నేర్చుకున్న ఈ విద్యను వందలాదిమందికి అందించడంలోనూ సిద్ధహస్తులుగా నిలిచారు.
ఆర్ట్ అకాడెమీ ప్రిన్సిపాల్ గా విశిష్ట సేవలు
కూచిపూడి ఆర్ట్ అకాడెమి ప్రిన్సిపాల్ గా అందించిన సేవలు మరువలేనివి. ఈమె నృత్య దర్శకత్వంలో ఎన్నో రూపకాలు రూపు దాల్చుకున్నాయి.ఎన్నో సోలో ప్రదర్శనలు, బాలెట్స్ ఎన్నో వేదికలపై అందించారు. భారతదేశం తరపున ప్రపంచంలోని అనేక దేశాలలో నిర్వహించిన సాంస్కృతిక వేదికలపై తెలుగువారికి చెందిన కూచిపూడిని ప్రదర్శించి, ఈ కళారూపానికి అఖండఖ్యాతిని తెచ్చిపెట్టారు. వేదాంతం లక్ష్మీనారాయణశాస్త్రి, వేదాంతం రాఘవయ్య, వేదాంతం పెద సత్యం, వేదాంతం చిన సత్యం వంటి మహనీయులు విప్లవాత్మకంగా, స్త్రీలు కూడా కూచిపూడి రూపకాలు అందించడానికి తెరదీస్తే, ఆ తెరకు వెండివెలుగులు అద్దిన కళాకారిణులలో నాలుగు దశాబ్దాలుగా అగ్రశ్రేణిలో వెలుగొందిన కళాకారిణి శోభానాయుడు. ఆమె కీర్తికిరీటంలో ఎన్నో బిరుదులు, పురస్కారాలు, సత్కారాలు చేరాయి. ఎప్పుడో 20ఏళ్ళ క్రితమే 2001లో పద్మశ్రీ పురస్కారం పొందారు. సంగీత నాటక అకాడెమి పురస్కారం కూడా ఆమెను వరించింది.
నృత్యచూడామణి
నృత్య చూడామణి, నృత్య కళా శిరోమణి వంటి బిరుదులు ఎన్నో అందాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘హంస’ పురస్కారంతో ఈమెను ఘనంగా గౌరవించింది.నృత్యంలో, నృత్తంలో (పలుకులో) విశేష ప్రతిభతో విరాజిల్లి, మన కూచిపూడి కళను శోభాయమానంగా భారతీయనాట్య కళల సరసన సింహాసనాధిపతిని చేసిన ప్రముఖులలో శోభానాయుడు స్థానం చిరస్మరణీయం. కూచిపూడికి కొంగ్రొత్త శోభలద్దిన శోభానాయుడు ఆరు పదుల ప్రాయంలోనే నటరాజ సన్నిధికి చేరారు. ఆమె తీర్చిదిద్దిన శిష్యులు ఎందరో ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఆమె నెలకొల్పిన సంప్రదాయాన్ని, వారసత్వాన్ని నిలబెట్టి, రేపటి తరాలకు అందించడమే వారు ఇవ్వాల్సిన నిజమైన నివాళి. తెలువారి తలపులలో శోభానాయుడు పదకదలికలు ఎప్పటికీ నర్తన చేస్తూనే ఉంటాయి, అందెల రవళులు అనంతంగా వినిపిస్తూనే ఉంటాయి.-మాశర్మ