పత్రికలు, మీడియాకు సంబంధించి ఎవరైనా వ్యాఖ్యానాలు చేసినప్పుడు ఇష్టం లేకపోయినా, ఆ రంగానికి చెందిన ఒకప్పటి మనిషిగా ఒక్కోసారి కల్పించుకోవాల్సి వస్తోంది.
చాలామంది ‘పలానా పత్రిక చదవం, పలానా మీడియా చూడం’ అంటుంటారు. ఎందుకంటే అవి పాక్షికంగా ఏదో ఒక పార్టీకి వెన్ను కాస్తున్నాయి అనేది ప్రధాన ఆరోపణ. ‘చదవం, చూడం’ అని అంటూనే వాటిల్లో వచ్చిన వార్తలని గురించి ప్రస్తావిస్తుంటారు. అదో వైచిత్రి.
పత్రికల మధ్య పోటీ సహజం
నా వరకు నేను నలభై ఏళ్లనుంచి రోజూ మూడు నాలుగు పత్రికలు చందా కట్టి ఇంటికి తెప్పించుకుని చదువుతుంటాను. ‘అవి ఏం రాస్తున్నాయి?’ అనే దానికంటే, అవి వార్త ఇచ్చే విధానంలోని వైవిధ్యాన్ని గమనిస్తుంటాను. పత్రికల నడుమ వృత్తి పరమైన పోటీ వుండడం తప్పేమీ కాదు. పై చేయి అనిపించుకోవడానికి ప్రయత్నించడం తప్పుపట్టేదేమీ కాదు. కానీ క్రమంగా ఈ పోటీ పాత్రికేయుల చేతుల్లోనుంచి ఆ పత్రికల యజమానుల చేతుల్లోకి పోతోంది. దానితో ఏ పత్రికకు ఆ పత్రికకు ఓ రంగూ రుచీ వాసనా ఏర్పడుతున్నాయి. కొంచెం అటూ ఇటూగా ఈ దోషం అంటుకోని పత్రికంటూ కలికానికి కూడా కనిపించడం లేదు.
ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా మరికొందరు
నిజమే! మునుపటి రోజుల్లో మాదిరిగా మడి కట్టుకుని పత్రిక నడపడం సులభం కాని పరిస్థితి వున్న మాట వాస్తవమే. అయితే, మనుగడకోసం ఎంతో కొంత రాజీ పడే ధోరణి కాస్తా అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోయి ఇతరేతర రంగాల్లో వుండే అవలక్షణాలన్నీ కట్ట గట్టుకుని ఈ రంగంలో ప్రవేశించాయి. ఈ రంగానికి వున్న అపరిమితమైన ‘రీచింగ్’ వల్ల, యేది చెప్పాలన్నా, ప్రజలకు క్షణాల మీద యేది చేరాలన్నా మీడియాను మించిన మార్గం లేకపోవడంతో రాజకీయుల కళ్ళు ఈ రంగం మీద పడ్డాయి. ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా కొందరు తమ పెట్టుబళ్లను ఈ రంగంలోకి మళ్ళిస్తున్నారు. నేరుగా ‘రిటర్న్స్’ వెంటనే రాకపోయినా మరో మార్గంలో అందుతున్న ప్రయోజనాలు వారిని ఇందుకు ఆకర్షిస్తున్నాయి. డబ్బు పోయినా అంతకు మించిన గౌరవం, తద్వారా సామాజికంగా, రాజకీయంగా వొనగూడుతున్న లాభాలు వారిని ఇందుకు పురిగొల్పుతున్నాయి. అందుకే దేశంలో ఎక్కడా లేనన్ని టీవీ ఛానళ్ళు తెలుగునాట పురుడు పోసుకుంటున్నాయి. పెట్టుబళ్ల వరకు అయితే పరవాలేదు.
ఒక పత్రిక, మా పత్రిక కాదు…
రాజకీయాల్లో వుండే కల్మషం, కుళ్ళూ, ఒకళ్ళను మరొకళ్ళు కత్తులతో నరుక్కునే సంస్కృతి – కాఫీ డికాషన్ మాదిరిగా ఇందులోకి దిగుమతి అవుతున్నాయి. ఆ పత్రిక ఏం చెప్పింది అని గతంలో మరో పత్రిక గమనించేది. దాన్ని గురించి ప్రస్తావించాల్సివస్తే పాత్రికేయ మర్యాదలు పాటించేవారు. పేరు పెట్టకుండా ‘ఒక పత్రిక’ అనేవారు. లేదా ‘మా పత్రిక కాదు’ అని రాసుకునే వారు.
అందరూ అందరే
కానీ ఇప్పుడో. ఒక పత్రిక ఏదైనా రాస్తే దాన్ని తమ పత్రికలో ఖండఖండాలుగా ఖండించడం ఎల్లా అన్నదొక్కటే యావ.ఫలితం. ‘ఈ పత్రిక అలాగే రాస్తుంది, ఈ టీవీ అలాగే చూపిస్తుంది’ అని జనం తేలిగ్గా మాట్లాడుకునే పరిస్థితి. ఇది జర్నలిజానికి మంచిదా అంటే అంత ఆలోచించే తీరిక ఎవ్వరికీ లేకుండా పోతోంది.
ఇందులో ఒకర్ని నిందించే పరిస్థితి ఎప్పుడో దాటిపోయింది. అందరూ అందరే. ఎవరికీ మినహాయింపు ఇవ్వలేని స్తితి.పత్రికలు, టీవీల్లో పనిచేసే సిబ్బంది, వాటి యజమానులు, వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా తోడ్పడే పార్టీలు సొంత ఎజెండాలతో ముందుకు పోవడాన్ని కొంత అర్ధం చేసుకోవచ్చు. అసలు విషాదం ఏమిటంటే ఆయా పార్టీల అభిమానులైన పాఠకులు సైతం వేర్వేరు పారావారాలుగా విడిపోయి తగువులు పడడం. సోషల్ మీడియాలో కూడా ఆ రంగుల్ని చల్లడం.
మీ ప్రశ్నలే మీకు ఎదురవుతాయి
ఎవరు ఏమైనా అనుకోండి కానీ, ఈ రంగంలో దశాబ్దాల తరబడి పనిచేసిన వాడిగా ఇది నా నిశ్చితాభిప్రాయం.ఇష్టం వున్న వాటిని చదవండి. ఇష్టం వున్నవాటిని చూడండి. ‘అలా యెందుకు రాశారు, ఇలా యెందుకు చూపారు’ అని ప్రశ్నిస్తే అవే ప్రశ్నలు మీకూ ఎదురవుతాయి.
ఎందుకంటే అన్నం తింటున్నది గొంగట్లో కనుక.
(నవంబర్ పదహారు జాతీయ పత్రికా దినోత్సవం)