Tuesday, December 3, 2024

జవాబు దొరకని ప్రశ్నలు ఎన్నో!

My Confession

                         ————————

                                             By Leo Tolstoy

                           నా సంజాయిషీ

                           ———————-

                                             లియో టాల్స్టాయ్

                          తెలుగు అనువాదం

                           ————————–

డా. సి. బి. చంద్ర మోహన్

డా. బి. సత్యవతీ దేవి

చాప్టర్ – 3

ఈ పిచ్చిలో పడిపోయి ఇంకో ఆరేళ్లు నా వివాహం అయ్యేవరకు అలాగే బ్రతికాను. ఆ రోజుల్లోనే నేను విదేశాలకు వెళ్లాను. యూరప్ లో నా జీవితమూ, ప్రముఖులూ, విద్యావంతులైన యూరోపియన్లతో నా పరిచయమూ — పరిపూర్ణత సాధించడంలో నా విశ్వాసాన్ని ధ్రువపరిచాయి. ఎందుకంటే,  ఆ విశ్వాసం వారిలో కూడా నేను  చూశాను. ఆ రోజుల్లో చాలామంది విద్యావంతులు అనుసరించే విధానానికి ఆ విశ్వాసం నన్ను కూడా తీసుకువెళ్లింది. అది “పురోగతి”  అనే మాటతో వ్యక్తీకరింపబడింది. ఆ మాటలో నాకు కొంత అర్థమేదో  ఉందనిపించింది. (ముఖ్యమైన) మనుషులందరినీ పీడించే “ఉన్నతంగా ఎలా బ్రతకాలి?”  అనే ప్రశ్నకు సమాధానం గా ‘పురోగతికి అనుగుణంగా బ్రతుకు’ అనే జవాబు  నాకు ఇంకా అర్థమవ్వాల్సి ఉంది. ఇది ఎలా ఉందంటే — ఒక మనిషి పడవలో గాలికి కొట్టుకుపోతుంటే అతనికి కలిగే ఒకే సందేహం తాను ఎక్కడికి  నడిపించబడుతున్నాడు? అనే కదా! దానికి సమాధానంగా — ‘ మనం ఏదో ఒక చోటుకు నడిపించబడుతున్నాం’ అని చెప్పినట్లు ఉంటుంది.

నేను అప్పుడది గుర్తించలేదు. కేవలం అప్పుడప్పుడు మాత్రమే ( హేతువుతో కాక ప్రవృత్తితో) మా రోజుల్లో చాలా సాధారణమైన ఈ మూఢ  విశ్వాసానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవాణ్ణి. (ఈ మూఢ విశ్వాసంలోనే ప్రజలు జీవితం పట్ల వారి దురవగాహనను దాచుకునేవారు) ఉదాహరణకు — నేను ప్యారిస్ లో ఉన్నప్పుడు, మరణశిక్షను అమలుపరిచే దృశ్యం నాకంట బడింది. ఆ సంఘటన నా మూఢవిశ్వాసపు నమ్మకం ఎంత అస్థిరమో నాకు వెల్లడి చేసింది. తలను మొండెం నుండి వేరుపరచి, వేరే పెట్టలోకి బలవంతంగా కుదించిన దృశ్యం చూశాను. నేను నా మనసుతో కాక నా అస్తిత్వంతో అర్థం చేసుకున్నది ఏమిటంటే — మన ఇప్పటి ‘పురోగతి’. చెప్పే ఏ సహేతుక వాదము కూడా పై కార్యాన్ని సమర్ధించలేదు! సృష్టి మొదలైనప్పటినుండి దీనిని ప్రతి ఒక్కరు అవసరం అని అనుకున్నా ( ఏ సిద్ధాంతంలోనైనా గాని) నేను మాత్రం ఇది చాలా అనవసరమైనదీ , చెడ్డదీ అని తలచాను. అందుచేత — మంచి ఏదో, చెడు ఏదో నిర్ణయించే మధ్యవర్తి — జనం చెప్పేది చేసేది కాదు.

Also read: నా సంజాయిషీ

పురోగతి నిర్ణయించేదీ కాదు — కేవలం నేను, నా హృదయమూ మాత్రమే. పురోగతిపై మూఢవిశ్వాసం జీవితానికి మార్గదర్శి అయ్యేటందుకు సరిపోదనీ గుర్తించడానికి ఇంకో ఉదాహరణ — నా సోదరుని మరణం. తెలివి ,మంచితనం, గంభీరమైన వ్యక్తిత్వం ఉన్న ఆ మనిషి యుక్త వయసులోనే జబ్బు చేసి దాదాపు సంవత్సరం పాటు బాధపడ్డాడు.  ఆ బాధతోనే మరణించాడు. ఎందుకు బ్రతికాడో, ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో అనేది అర్థం కాని విషయాలుగానే మిగిలిపోయాయి. అతనికి వచ్చిన సుదీర్ఘకాలపు  బాధతో కూడిన మరణం గురించి ఏ సిద్ధాంతమూ అతనికి గాని, నాకు గాని సమాధానం ఇవ్వలేదు. కానీ ఇవి కొన్ని అరుదైన సందేహాలు మాత్రమే. నిజానికి నేను  ‘పురోగతి’ మీద నమ్మకాన్ని మాత్రమే బోధిస్తూ జీవించసాగాను.

“ప్రతిదీ పరిణామం చెందుతుంది. నేను కూడా దానితోపాటు పరిణామం చెందుతాను. అన్నిటితోపాటు నేను కూడా ఎందుకు పరిణామం చెందుతున్నానో ఏదో ఒక రోజు తెలుస్తుంది.” అందుకని ఆ సమయంలో నేను నా విశ్వాసాన్ని రూపొందించుకోవలసి వచ్చింది

విదేశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత, నేను గ్రామీణ ప్రాంతంలో స్థిరపడ్డాను. అక్కడ రైతు కూలీల పాఠశాలల్లో గడపటానికి నాకు అవకాశం దక్కింది. ఆ పని నాకు నచ్చింది. ఎందుకంటే, సాహిత్యం ద్వారా జనాలకు బోధించాలంటే అబధ్ధాలు చెప్పక తప్పేది కాదు. ఇక్కడ కూడా ‘పురోగతి’  పేరు మీదే చెప్పాను. కానీ అప్పటికే నేను పురోగతిని విమర్శనాత్మకంగా చూసేవాణ్ణి. నాతో నేను ఇలా అనుకునేవాడిని.

” కొన్ని అభివృద్ధి ఘట్టములలో  ‘పురోగతి’  తప్పుగా కొనసాగింది. ప్రాచీన రైతు కూలీల బిడ్డలతో ఎవరైనా పరిపూర్ణ స్వేచ్ఛాయుతంగా వ్యవహరించాలి. వారికి వారు ( ఆ బిడ్డలు) ఏ నచ్చిన పురోగతి మార్గం నైనా ఎన్నుకునేటట్లు ఉండాలి. “నిజానికి నేను ఎప్పుడూ ఒకే ఒక అపరిష్కృత సమస్య చుట్టూ తిరుగుతుండేవాడిని. అదేమిటంటే   ఏమి బోధించాలో తెలియకుండా — ఎలా బోధించాలో అని ఆలోచించడం. పెద్దపెద్ద సాంస్కృతిక కార్యకలాపాల్లో నేను కనుగొన్నది ఏమిటంటే — ఏది ఏమిటో తెలియకుండా ఎవరూ బోధించలేరు. ఎందుకంటే జనాలు రకరకాలుగా బోధించబడ్డారు. వారిలో వారు పోట్లాడుకుంటూనే వారి వారి అజ్ఞానం దాచి పెట్టుకోవడంలో సఫలీకృతులయ్యేవారు. కానీ ఇక్కడ ఈ రైతు బిడ్డలతో వారికి నచ్చింది నేర్చుకో నిచ్చి, ఈ సమస్యను అధిగమించదలచుకున్నాను. బోధన చేయాలనే నా కోరికను సంతృప్తి పరిచే క్రమంలో, నేను ఎంత క్రిందా, మీదా అయ్యానో తలచుకుంటే నాకే వినోదభరితంగా ఉంటుంది. కానీ నా అంతరాంతరాల్లో అవసరమైనదేదీ నేను బోధించలేదని నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఏది అవసరమో నాకు నిజంగా తెలియదు. ఆ గ్రామీణ పాఠశాలలో ఒక ఏడాది పని చేసిన తర్వాత — నాకు ఏమీ తెలియకుండా ఇతరులకు బోధించడం ఎలా? — అనే విషయాన్ని శోధించడానికి నేను రెండోసారి విదేశాలు వెళ్లాను.

విదేశాల్లో ఈ విషయాన్ని నేను నేర్చుకున్నాననిపించింది. రైతాంగ విమోచన సంవత్సరం (1861) లో, నేను ఈ జ్ఞానం అంతా కూడగట్టుకొని రష్యాకు తిరిగి వచ్చాను. న్యాయ  నిర్ణేతగా ఉంటూ — విద్య లేని రైతులకు ( పాఠశాలల్లో) ఒకవైపు, చదువుకున్నవారికి ( నేను అచ్చు వేసిన పత్రికల ద్వారా) రెండో వైపు — బోధించసాగాను. అన్ని విషయాలు సజావుగా సాగుతున్నట్లు అనిపించేది. కానీ నేను మానసికంగా సరిగాలేనని నాకే అనిపించేది. పరిస్థితులు అలాగే ఎక్కువ కాలం కొనసాగవని అనిపించేది. ఇంకా అన్వేషించబడని, నాకు సంతోషం కలిగించగలిగే ఒక జీవిత పార్శ్వము (నా వివాహం) లేకపోతే — నేను ఒక నిరాశాజనక స్థితిలోకి పోయి ఉండేవాడినేమో! ఒక ఏడాది స్కూల్ తోను,  పత్రికా ప్రచురణలతోనూ మధ్యవర్తిగా పని కల్పించుకొని నాకు నేను బిజీగా ఉండిపోయాను. నా మానసిక గందరగోళం వల్ల నేను చాలా అలసిపోయాను. న్యాయ నిర్ణేతగా నా పోరాటం చాలా కష్టంగా ఉండేది. స్కూల్లో నా కార్యకలాపాలు అర్థం కానివిగా ఉండేవి. పత్రిక విషయంలో కూడా ఏ ఆకర్షణీయతా ఉండేది కాదు.(అది ఒకే విషయం తెలిపేది — అదేమిటంటే, అందరికీ బోధించాలనే కోరికా, ఏది బోధించాలో నాకే తెలియదనే నిజాన్ని దాచిపెట్టడమూ!) వీటన్నిటితో — నేను భౌతికంగా కాకపోయినా మానసికంగా జబ్బు పడ్డాను. అన్నిటినీ వదిలేశాను. కొత్త గాలి పీల్చుకోవడానికి , కుమిస్ తాగడానికి (ఒకరకంగా జంతు జీవితం గడపడానికి) స్టెప్పీస్ లోని భాష్కిర్స్ కు వెళ్ళిపోయాను.

Also read: ‘చదువు’  అంటే ..  ఏమిటి?

అక్కడినుండి తిరిగి వచ్చి, నేను వివాహం చేసుకున్నాను. ఆనందదాయకమైన కుటుంబ జీవితం యొక్క నూతన పరిస్థితులు — ‘జీవితం  అర్థం ఏమిటి? అనే నా అన్వేషణ నుండి  నన్ను పూర్తిగా దారి మళ్ళించాయి. నా జీవితం మొత్తం కుటుంబం (భార్యా, ,పిల్లల) చుట్టూతానే తిరిగేది. మా జీవితానికి కావలసినవి సమకూర్చుకోవడం, పెంచుకోవడంతోనే సరిపోయేది. స్వీయ పరిపూర్ణత కోసం నేను పడ్డ కష్టాన్ని సాధారణ పరిపూర్ణత కోసం శ్రమగా మార్చేసుకున్నాను (అంటే — పురోగతి). ఇది మరలా– నా కుటుంబం పిల్లల కోసం ఉన్నతమైన జీవితం పొందడం కోసం — దాన్ని మార్చుకున్నాను. మరో 15 ఏళ్లు గడిచాయి.

‘రచయిత’ అని పరిగణించబడడం అంత ముఖ్యం కాకపోయినప్పటికీ — రచయితగా అందుకునే అపారమైన పారితోషకాల ప్రలోభం, నా అల్పమైన (అంత ముఖ్యం కాని) రచనలకు వచ్చే ప్రశంస — ఈ రెండు కారణాల వలన నేను రచనకే అంకితమయిపోయాను. అది నాకు — నా భౌతికమైన స్థాయి సమాజంలో మెరుగుపరచుకోవడానికి , నా మనసును ఉక్కిరిబిక్కిరి చేసే ప్రశ్నల (ఉదా: నా జీవిత పరమార్ధం ఏమిటి? జనరల్ గా జీవితం యొక్క అర్థం ఏమిటి?) కు  సమాధానం వెతుక్కోడానికి దోహదం చేసింది. నేను ఇలా వ్రాశాను; నాకు, నా కుటుంబానికి ఏది అత్యుత్తమమైనదో అదే బోధన, అదే సత్యం.

అలా నేను జీవితం కొనసాగించాను. కానీ ఐదేళ్ల క్రితం చాలా వింతైన విషయం నాకు అనుభవం అవసాగింది. మొట్టమొదట — నేనేమి చెయ్యాలో, ఎలా బతకాలో తెలియని ఒక రకమైన గందరగోళం, జీవితంలో స్తబ్దత ఆ సమయంలో నేను అనుభవించాను. అప్పుడు నన్ను నేను

కోల్పోయాను. నిరుత్సాహం నన్ను ఆవరించింది. కానీ అది సర్దుకుని, మరలా నేను క్రితంలో లాగా జీవించసాగాను. అప్పుడు పైగందరగోళపు క్షణాలు తరచూ పునరావృతమయ్యాయి. మునుపటిలానే  వ్యక్తం అయ్యేవి. ఎప్పుడూ — ‘ ఇదంతా ఎందుకోసం? ఇది ఎక్కడికి దారి తీస్తుంది?’ అనే ప్రశ్నలతోనే వ్యక్తీకరణ జరిగేది.

మొదట ఇవి లక్ష్యరహిత, సందర్భ రహిత ప్రశ్నలుగా నాకు తోచేవి. ఇదంతా బాగా తెలిసిన విషయమే అని భావించేవాడిని. వీటికి పరిష్కారం నేను కోరుకుంటే — లేదనిపించేది. ఇప్పటికిప్పుడు నాకు సమయం లేదు కానీ, నేను తలచుకుంటే చాలా తేలికగా సమాధానాలు రాబట్టవచ్చు అనుకునేవాడిని. ఆ ప్రశ్నలు వాటంతటికవే తరచుగా పునరావృతమయ్యేవి. సమాధానాల కోసం పట్టుదలగా డిమాండ్ చేసేవి(ఎలాగంటే –సిరా చుక్కలు ఒకే చోటపడి, అన్నీ కలిసి పెద్ద సిరామరకగా మారినట్లుగా). మరణాంతక, అంతర్గత వ్యాధితో అనారోగ్యం పాలయ్యే ప్రతి ఒక్కరికీ జరిగేదే నాకూ జరిగింది. ముందుగా జబ్బు మనిషి పట్టించుకోనంత అల్పమైన సంకేతాలతో అస్వస్థత మొదలవుతుంది. అవే జబ్బు చిహ్నాలు తరచుగా మళ్ళీ మళ్ళీ కనిపిస్తూ, చివరకు అన్నీ కలిసి ఎడతెగని (నిరంతరమైన) బాధగా రూపొందుతాయి. ఆ బాధ పెరుగుతూ ఉంటుంది. ఆ రోగి స్వల్ప అస్వస్థత అనుకున్నది పెరిగి పెరిగి — జీవితంలో అంతకంటే ముఖ్యమైనది లేదు అనుకునే వరకు వెళుతుంది — అదే ‘మరణం.’

నాకు జరిగింది అదే! అది ఆషామాషీగా తీసుకునే విముఖత కాదు, చాలా ముఖ్యమైనది అనిపించింది. పై ప్రశ్నలు నిత్యమూ మనసులో మొలకెత్తుతుంటే వాటికి తప్పక జవాబులు వెతకవలసిందే! వాటికి జవాబులు ఇవ్వడానికి నేను ప్రయత్నించాను. నాకు అవి తెలివి తక్కువ, సాధారణ, పిల్ల తనపు ప్రశ్నలుగా అనిపించాయి. నేను వాటి గురించి ఆలోచించడం మొదలెట్టగానే — అవి పిల్లతనపు లేదా తెలివి తక్కువ ప్రశ్నలు కావు; అతి ముఖ్యమైన, లోతైన జీవితపు ప్రశ్నలని ఒక అభిప్రాయానికి వచ్చేసాను. ఇక రెండో విషయం — సమారా ఎస్టేట్ వ్యవహారాల్లో మునిగి ఉండడం, నా కొడుకు చదువు, గ్రంథ రచన — ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నానో తెలుసుకోవాలి.

‘ఎందుకు ‘ చేస్తున్నాను? — అని నాకు తెలియకపోతే — నేనేమీ చేయలేను, నేను బ్రతకలేను. ఎస్టేట్ వ్యవహారాలు నా మనసంతా ఆక్రమించినప్పుడు — అకస్మాత్తుగా నాకు ఒక ప్రశ్న వచ్చేది ” సమారా ప్రభుత్వంలో — నీకు (అంటే నాకు) 6000 డేసి యాటినాల భూమి, 300 గుర్రాలు ఉంటాయి. ఆ తర్వాత ఏమిటి?.” అప్పుడు నేను చాలా గందరగోళానికి గురయ్యాను. ఏమి ఆలోచించాలో తెలిసేది కాదు. లేకపోతే, నా పిల్లల చదువుల గురించి ప్రణాళిక వేసుకునే సమయంలో — “ఎందుకోసం ఇదంతా?” అనిపించేది. లేదా — రైతులు ఎలా వృద్ధిలోకి వస్తారు? అనుకునేటప్పుడు అకస్మాత్తుగా ” ఇదంతా నాకు అవసరమా?” అనిపించేది. నాకు నా రచనల ద్వారా వచ్చే కీర్తిని తలుచుకున్నప్పుడు ఇలా అనిపించేది ” నువ్వు (అంటే నేను) గొగోల్, పుష్కిన్, షేక్స్పియర్,  మోలియర్ లేక ప్రపంచంలోని రచయితలందరి కన్నా ప్రసిద్ధుడవవుతావు — అయితే ఏమిటి?” అనిపించేది. నాకు సమాధానం దొరికేది కాదు. ఆ ప్రశ్నలు వేచి ఉండేవి కావు. వాటికి వెంటనే సమాధానాలు కావాలి. వాటికి సమాధానం ఇవ్వకపోతే బ్రతుకే అసాధ్యం అనిపించేది. అయినా సమాధానం ఉండేది కాదు.

 నేను దేని మీద నిలబడ్డానో అది కూలిపోయిందనే భావన కలిగింది. నా కాళ్ళ క్రింద ఏమీ మిగల్లేదు. ఇప్పటివరకు దేని మీద బతికానో అది ఉనికి కోల్పోయింది. ఏమి మిగల్లేదు.

Also read: నేనూ, నా మిత్రులూ పిచ్చాసుపత్రిలో ఉన్నట్టున్నాం: టాల్ స్టాయ్

              ——     ——-     ———–

Dr. C. B. Chandra Mohan
Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles