- స్మృతి మంథానా సంచలన బ్యాటింగ్
- చేజింగ్ లో వరుసగా పదో హాఫ్ సెంచరీ
భారత మహిళా క్రికెట్ డాషింగ్ ఓపెనర్ స్మృతి మంథానా వన్డే క్రికెట్ చరిత్రలోనే ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొంది. లక్నో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికా మహిళాజట్టుతో జరిగిన రెండో వన్డేలో స్ట్ర్రోక్ ఫుల్ హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా ఈ రికార్డు సాధించింది. అంతేకాదు భారత్ కు 9 వికెట్ల విజయం అందించడంలో ప్రధాన పాత్ర వహించింది.
సౌతాఫ్రికాతో ఐదుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా జరిగిన కీలక రెండో వన్డేలో స్మృతి 64 బాల్స్ ఎదుర్కొని 3 సిక్సర్లు, 10 బౌండ్రీలతో 80 పరుగుల స్కోరుతో అజేయంగా నిలిచింది. మరో ఓపెనర్ జెమీమా రోడ్రిగేస్ తక్కువ స్కోరుకే అవుటైనా వన్ డౌన్ పూనమ్ రౌత్ తో కలసి స్మృతి రెండో వికెట్ కు అజేయ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సైతం స్మృతి కైవసం చేసుకొంది.
Also Read: క్రీడారంగంలో మహిళా తరంగాలు
తొలి క్రికెటర్ స్మృతి మంథానా…
వన్డే క్రికెట్ పురుషుల, మహిళల విభాగాలలో చేజింగ్ కు దిగిన సమయంలో వరుసగా 10 అర్థశతకాలు సాధించిన తొలి, ఒకే ఒక్క ప్లేయర్ గా స్మృతి మంథానా చరిత్ర సృష్టించింది. ఐసీసీ మహిళా వన్డే ర్యాంకింగ్స్ లో ప్రస్తుతం 7వ స్థానంలో కొనసాగుతున్న స్మృతి మంథానాకు చేజింగ్ లో ఒత్తిడి లేకుండా దూకుడుగా ఆడే ఓపెనర్ గా పేరుంది.
న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ సుజీ బేట్స్ పేరుతో ఉన్న వరుసగా 9 హాఫ్ సెంచరీల రికార్డును స్మృతి అధిగమించింది. 2015 నుంచి 2017 సీజన్ల మధ్యకాలంలో సుజీ వరుసగా తొమ్మిది అర్థ శతకాలు సాధించింది.ప్రస్తుత ఐదు మ్యాచ్ ల సిరీస్ లోని మూడో వన్డే లక్నో వేదికగానే మార్చి 12న జరుగుతుంది.
Also Read: 100 వన్డేల క్లబ్ లో హర్మన్ ప్రీత్ కౌర్