- 3వందల మంది చరిత్రకారులు, జర్నలిస్టులు హాజరు
- సదస్సు సంచాలకుడు మైనాస్వామి
లేపాక్షి, నవంబర్ 28: “లేపాక్షి వీరభద్రాలయం – యునెస్కో శాశ్వతగుర్తింపు ఆవశ్యకత” అనే అంశంపై డిసెంబర్ 14-15 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ సదస్సులో లేపాక్షి ఆలయ సముదాయం గురించి విశేష ప్రచారం నిర్వహించనున్నట్టు చరిత్రకారుడు – సదస్సు సంచాలకుడు మైనాస్వామి చెప్పారు. లేపాక్షి పర్యాటక అతిథి గృహంలో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, వీరభద్రాలయంలోని శిల్పకళ, తైల వర్ణచిత్రాలు, శాసనాలు, విజయనగర రాజ్య నిర్మాణ శిల్ప శైలి, విజయనగర కాలంలో ఆలయాల వైభోగాలను ప్రపంచానికి తెలుపడం కోసం డిసెంబర్ 14 వ తేదీ మధ్యాహ్నం’ పర్యాటక రచయితలు – పర్యాటక పాత్రికేయుల’ కోసం ప్రత్యేక సదస్సును. నిర్వహిస్తున్నామన్నారు. లేపాక్షి వైభవానికి విస్తృత ప్రచారం కల్పించడమే ప్రత్యేక సదస్సు లక్ష్యమని సంచాలకుడు వివరించారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, వంటి నగరాలతో పాటు వివిధ పట్టణాల నుంచి పర్యాటక రచయితలు – పర్యాటక పాత్రికేయులు వస్తున్నారని మైనాస్వామి తెలిపారు. జాతీయ సదస్సు ప్రారంభోత్సవం 14 వ తేదీ ఉదయం జరుగనుండగా, మధ్యాహ్నం ప్రత్యేక సదస్సు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు వుంటాయి. 15వ తేది మధ్యాహ్నం ముగింపు సమావేశం జరుగుతుంది. పర్యాటక రంగ నిపుణులు, చరిత్రకారులు, రచయితలు, పాత్రికేయులు సుమారు 300 మంది సదస్సులో పాల్గొంటున్నారు. సదస్సు వివరాలకు 9502659119 ను సంప్రదించవచ్చు. రెండు రోజుల జాతీయ సదస్సుకు ఇండియా టూరిజం హైదరాబాద్( భారత పర్యాటక మంత్రిత్వ శాఖ) వారు, అపోలో ఆసుపత్రి గ్రూప్, అనంత్ టెక్నాలజీస్-హైదరాబాద్ వారు పాక్షిక ఆర్ధిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు.