- అతిగా పోకుండా 26 జిల్లాలకు పరిమితం కావడం మంచి నిర్ణయం
- విమర్శలు ఎప్పుడూ ఉంటాయి, వాటిని తప్పని నిరూపించడం విజ్ఞత
- మెరుగైన పరిపాలన చూపించడం ఒక్కటే లక్ష్యం కావాలి
ఎన్నాళ్ల నుంచో అనుకుంటున్న కొత్తజిల్లాల ఏర్పాటు ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. 72 రెవిన్యూ డివిజన్లతో 26 జిల్లాలు ఏర్పడ్డాయి. అనేక కసరత్తులు,విమర్శలు, ఆందోళనల మధ్య ఈ యజ్ఞం సంపూర్ణమైంది. లోక్ సభ స్థానాలను ప్రాతిపదికగా తీసుకొని ఈ మహానిర్మాణం చేశారు. విస్తీర్ణంలో ప్రకాశం,జనాభాలో నెల్లూరు అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. అన్నింటికంటే చిన్నజిల్లాగా విశాఖపట్నం రూపుదిద్దుకొంది. రాయలసీమలో కడప, ఉత్తరాంధ్రలో అల్లూరి సీతారామరాజు, మధ్యాంధ్రలో ప్రకాశం జిల్లాలు పెద్దజిల్లాలుగా రూపాంతరం చెందాయి. సరికొత్త భౌగోళిక ముఖచిత్రంతో ఆవిష్కృతమైన నవ్యాంధ్రప్రదేశ్ నవనవోన్మేషంగా ముందుకు సాగినప్పుడే ‘కొత్త జిల్లాల ఏర్పాటు’అనే సంకల్పానికి సార్ధకత చేకూరుతుంది.
Also read: కష్టాల కడలిలో శ్రీలంక
లోక్ సభ నియోజకవర్గాలే ప్రాతిపదిక
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం తొలిగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. లోక్ సభ స్థానాలకు రెండింతలుగా జిల్లాలు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం లోక్ సభ స్థానాల సంఖ్యకు సమానంగా జిల్లాలు ఏర్పాటయ్యాయి. గిరిజన ప్రాంతం మాత్రమే మినహాయింపు. పరిపాలనా సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరం మేరకే కొత్త జిల్లాలను ఏర్పాటుచేశామని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. పరిపాలనలోనూ, అభివృద్ధిలోనూ వికేంద్రీకరణ జరగడం అత్యంత అవసరం. ఈ రెండూ సమాంతరంగా సాగాల్సిన ప్రక్రియలు. మూడోది సంక్షేమం.నాల్గవది ఆ యా పార్టీల రాజకీయ ప్రయోజనాలు. నిజం చెప్పాలంటే జిల్లాల విస్తరణ ఎప్పుడో జరిగి ఉండాల్సింది. మొత్తం మీద ఇప్పుడు ఆ శుభముహూర్తం వచ్చింది. కొత్త జిల్లాలు వచ్చిన వేళ సరిహద్దులు మారిపోయాయి. కొన్ని జిల్లాలకు కొత్తపేర్లు వచ్చాయి. ఈ పరిణామం వెనకాల ప్రజల మనోభావాలు కూడా దాగివుంటాయన్నది సత్యం. నిన్నటి దాకా 13 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలయినట్లే, ప్రగతి కూడా రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు వేగంతో సాగాలి. ప్రజాభిప్రాయాలను పట్టించుకోలేదని, లోపభూయిష్టంగా జిల్లాల విభజన జరిగిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గిరిజనులకు, రాయలసీమ వాసులకు అన్యాయం జరిగిందని ఆయన అభిప్రాయం. అశాస్త్రీయంగా, రాజకీయ కోణంలోనే ఈ ప్రక్రియ జరిగిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే కొత్తజిల్లాలను సరిదిద్దుతామని ఆయన అంటున్నారు. రేపటి సంగతి పక్కన పెడితే, ఈనాడు తీసుకొచ్చిన విధానం సర్వజనహితమని నిరూపించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వై ఎస్ జగన్ పట్ల ఎంతో విశ్వాసంతో అద్భుతమైన విజయాన్ని వైసీపీకి అందించారు. వేసే ప్రతిఅడుగులో ఆ విశ్వాసం, ఆ విజయం ప్రతిస్పందించాల్సివుంది.
Also read: కాలుష్యం కోరలు పీకే హైడ్రోజన్ కారు
కొత్త భూమి విధానం
కొత్త జిల్లాలు ఏర్పడిన వేళ భూముల పరంగా కొత్త విధానం అమలులోకి వచ్చింది. కొత్తగా ఏర్పడిన జిల్లాలు, జిల్లా కేంద్రాల సమీప ప్రాంతాల్లోని భూముల విలువను సవరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్కెట్ విలువలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగడం 6వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. దీనివలన ప్రభుత్వ ఆదాయం పెరగనుంది. కొత్త జిల్లా కేంద్రాలకు మాత్రమే ఈ సవరణ వర్తిస్తుందని స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ ఉత్తర్వులు కూడా జారీచేశారు. జిల్లాల పునఃవ్యవస్థీకరణ వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయని ప్రభుత్వం బలంగా చెబుతోంది. చిన్నజిల్లాల ఏర్పాటు ద్వారా జిల్లా కేంద్రం నుంచి మారుమూల సరిహద్దు గ్రామాలకు దూరభారం తగ్గనుంది. పరిపాలనా యంత్రాంగం ప్రజలకు మరింత చేరువకానుంది. పాలనాపరంగా పర్యవేక్షణ పెరగనుంది. అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించే వెసులుబాటు ఉంటుంది. ఇలా… అనేక ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల ముందు ఉంచుతోంది. నిజంగా ఆచరణలో ఇవన్నీ జరిగితే అంతకు మించి కావాల్సింది ఏముంటుంది? స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా, భాషాప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగి దశాబ్దాలు దాటిపోయినా.. జరగాల్సినంత అభివృద్ధి జరగలేదన్నది వాస్తవం. ముఖ్యంగా ప్రకాశం, అనంతపురం, విజయనగరం జిల్లాలు అత్యంత వెనకబడిన జిల్లాలుగానే మిగిలిపోయాయి. ఇప్పటికైనా ఈ ప్రాంతాలకు న్యాయం జరగాలి. ఈ జిల్లాల్లో ఉన్న సహజ వనరులను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నది చేదునిజం. రాజకీయ అవసరాలు వేరు -ప్రజల అవసరాలు వేరు.ఈ రెండింటి మధ్య కూడా సరిగ్గా సమన్వయం జరుగలేదు. ఇప్పటికీ చాలా భూమి నిరూపయోగంగా ఉంది. ఏ నేలలో ఏ పంట బాగా పండుతుంది, ఎక్కడ నుంచి ఎటువంటి ఉత్పత్తులను పెంచుకోవచ్చు. తద్వారా మార్కెట్ ను ఎలా విస్తరించవచ్చు. ప్రజల ఆదాయవనరులను ఎలా మెరుగుపరచవచ్చు…అనే విషయాలలో శాస్త్రీయమైన మార్గాలలో, ఆచరణ ఆశించిన స్థాయిలో వేళ్లూనుకోలేదు. జలవనరులను అనుసంధానం చేసుకోవడంలో ఇంకా చాలా ప్రయాణం చేయాల్సివుంది. గిరిజన ప్రాంతాలు సహజ సంపదకు నెలవులు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సుదీర్ఘమైన తీరప్రాంతం ఏ రాష్ట్రంలోనూ లేదు. గుజరాత్ లో ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో తీరప్రాంతం సమాంతరంగా నిర్మాణమైవుంది. అలాగే దట్టమైన అడవులు కూడా ఉన్నాయి. సహజవనరుల నుంచి గొప్ప సంపదను సృష్టించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ లో గొప్ప అవకాశం ఉంది.
Also read: అప్రమత్తతే అవశ్యం
నవ్యాంధ్ర సాకారం అవుతుందా?
నీటి ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా పూర్తవ్వాలి. ‘వెలిగొండ’ వంటి ప్రాజెక్టులు సంపూర్ణమైతే ఆంధ్రభూమి సస్యశ్యామలమవుతుంది. వెనుకబడిన సీమలకు న్యాయం జరుగుతుంది. ఆ ప్రజల బతుకులు బాగుపడతాయి. ప్రగతిరథ చక్రాలకు వనరుల సద్వినియోగం- అనుసంధానం ఇంధనంగా పనిచేస్తాయి. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమన్యాయం జరగాలి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి చెందిన కార్యక్రమాలు ముందు వరుసలో ఉండాలి. రియల్ ఎస్టేట్, పరిశ్రమలు, వ్యాపారం ఎంత ముఖ్యమో, వ్యవసాయక అభివృద్ధి అంతకంటే ముఖ్యం. మౌలిక సదుపాయాల రూపకల్పన ఇంకా ఊపందుకోవాలి. సంస్కృతి,సాహిత్యం, కళలు, క్రీడలకు కూడా పెద్దపీట వెయ్యాలి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మహనీయుడు జన్మించారు. ఒక్కొక్క సీమలో ఒక్కొక్క కళాస్వరూపం, క్రీడారూపం వికసించాయి. ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి అడుగుకూ ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. వీటన్నింటినీ పరిరక్షించుకోవాలి. అధ్యయనం జరగాలి, పరిశోధనలు పెరగాలి. చరిత్రపుటల్లోకి ఎక్కాలి. ప్రతి కళ,సాంస్కృతిక, సారస్వత రూపానికి ప్రోత్సాహం, ప్రచారం పెరగాలి. సాంస్కృతిక, చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటకంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. జిల్లాల పునఃనిర్మాణంలో మిగిలిన రాష్ట్రాల అనుభవాల నుంచి ప్రగతి నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. ప్రతి కార్యక్రమం క్షేత్ర స్థాయిలో, పారదర్శకంగా అమలవ్వాలి. వెరసి,కొత్తజిల్లాల ఏర్పాటుతో రాష్ట్రానికి కొత్తనెత్తురు ఎక్కాలి. నవ్యాంద్ర నిర్మాణం ఆచరణలో సాకారమవ్వాలి.
Also read: తెలుగు తేజాన్నిచాటిన త్రిబుల్ ఆర్