- జనసేన, బీజేపీ పొత్తుపై పవన్ కీలక వ్యాఖ్యలు
- క్షేత్రస్థాయిలో అవగాహనా లోపం వాస్తవమే
- చర్చల ద్వారా పరిష్కరించుకుంటామన్న పవన్
బీజేపీ, జనసేన మధ్య అవగాహన లోపం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. జాతీయ స్థాయి నేతలతో జనసేనకు బలమైన సంబంధాలున్నాయని స్పష్టం చేశారు. అభివృద్ధి, ధీర్ఘకాలిక లక్ష్యాల దృష్ట్యా జాతీయ స్థాయిలో ఇరు పార్టీల మద్య మంచి అవగాహన ఉందని అన్నారు. అయితే తెలుగు రాష్ట్రాలలో రాష్ట్ర స్థాయి నాయకత్వానికి జనసేనకు మధ్య సరైన అవగాహన లేదని పవన్ అంగీకరించారు. కరోనా నేపథ్యంలో ముఖాముఖి చర్చలు జరపలేకపోతున్నామని పవన్ తెలిపారు.
తిరుపతి ఉప ఎన్నికలో ఎవరు పోటీ చేయాలన్న విషయంపై మరో వారం రోజుల్లో చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటామన్నారు పవన్ కల్యాణ్. జీహెచ్ఎంసీ ఎన్నికలను ఎలా అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుని బీజేపీకి మద్దతిచ్చామో అంతే ప్రతిష్టాత్మకంగా తిరుపతి ఉపఎన్నికను కూడా తీసుకుకోవాలి. జనసేన బీజేపీలే భవిష్యత్తులో ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అని చెప్పడానికి తిరుపతి ఎన్నికల్లో విజయం తప్పనిసరి అని పవన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో జనసేన ఎంత బలంగా ఉందో తిరుపతి ఉప ఎన్నిక ద్వారా రాష్ట్ర బీజేపీ నేతలకు అవగాహన కలిగేలా చేయాలని జనసైనికులకు దిశా నిర్దేశం చేశారు.
పీఏసీతో భేటీ అయిన పవన్ కల్యాణ్:
ఈ క్రమంలో పవన్ కల్యాణ్ తిరుపతిలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించారు. తిరుపతిలో అభ్యర్థి ఎంపికపై సుధీర్ఘంగా చర్చలు జరిపారు. అయితే పొత్తులో భాగంగా బీజేపీతో చర్చించాకే అభ్యర్థిత్వంపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
పోటీపై చివరి క్షణంలో వెనక్కి తగ్గిన పవన్:
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన అన్ని డివిజన్ లలో పోటీచేస్తుందని పవన్ తెలిపారు. అభ్యర్థులు కూడా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే బీజేపీ అగ్రనేతల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు చివరి నిమిషంలో ఎన్నికల్లో పోటీనుంచి తప్పుకున్నారు. ఈ పొత్తు పై చర్చించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సహా ఇతర నేతలు పవన్ తో భేటీ అయ్యారు కానీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం హాజరుకాలేదు.
గతంలో సోము వీర్రాజు వ్యాఖ్యలు :
తిరుపతి ఉపఎన్నికపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో బీజేపీ నిర్వహించిన శోభాయాత్రలో వైసీపీ అవినీతి పాలనకు గుణపాఠం చెప్పాలంటే జనసేన బలపరిచే బీజేపీ అభ్యర్థికే ఓటేయాలని తిరుపతిలో బహిరంగ వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు కూటమి అభ్యర్థి పై చర్చలు జరుగుతున్న సమయంలోనే సోము వీర్రాజు ఈ ప్రకటన చేయడంతో జనసేన శ్రేణులు ఆగ్రహానికి గురయ్యారు. బీజేపీ, జనసేన సంయుక్త చర్చల తర్వాతే ఉమ్మడి అభ్యర్థిని ప్రకటిస్తామని బీజేపీ అధినాయకత్వం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెబుతూ వస్తున్నారు.
అంతుచిక్కని జనసేన వ్యూహం :
తిరుపతి ఉపఎన్నికల్లో జనసేన అనుసరిస్తున్న వ్యూహం ఎవరికీ అంతుబట్టడంలేదు. పార్టీ కార్యకర్తలు మాత్రం ఈ సారైనా ఎన్నికల్లో పోటీచేసి తమ సత్తా చాటాలని కృతనిశ్చయంతో ఉన్నారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో జనసేన అంత బలంగా లేదని బీజేపీ సహా ఇతర పార్టీలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలని జనసేన కార్యకర్తలు పవన్ కు సూచించినట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యం తరపున తిరుపతి నుంచి పోటీచేసిన చిరంజీవి విజయం సాధించారు. ఇపుడు ఆబలం ఉపయోగపడుతుందని జనసేన అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరపున గెలిచిన ఎమ్మెల్యే అధికార పార్టీతో లోపాయికారిగా వ్యవహరిస్తున్నారు. దీంతో చట్ట సభల్లో ప్రాతినిధ్యం కొరకు జనసేన తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
ఇదీ చదవండి: తిరుపతిలో పోటీకి జనసేన సై?
అభ్యర్థి ఎంపికపై తర్జనభర్జన :
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో జనసేన బీజేపీ పొత్తు ఉప్పు నిప్పును తలపిస్తున్నాయి. మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ జనసేనల వ్యూహం ఎవరికీ అంతుచిక్కకుండా ఉంది. ఉమ్మడి అభ్యర్థిని నిలిపితే ఆ అభ్యర్థి జనసేనకు చెందినవారా లేక బీజేపీ అభ్యర్థా రెండు పార్టీలు మేమే బరిలో ఉంటామంటూ ఎవరికి వారే ప్రకటనలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి అభ్యర్థి ఏ పార్టీ నుంచి ఉంటారన్నదానిపై ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠభరితమైన చర్చ జరుగుతోంది.
ఇదీ చదవండి: శ్రీవారి సేవలో జనసేనాని