Sunday, December 22, 2024

నిద్ర ఒక యోగం

  • అదమర్చిన నిద్ర భోగం
  • మానసిక శాంతికి ఉపయోగం
  • నిద్ర సర్వదా ఆరోగ్యం

అనేక యోగ ముద్రలు ఉన్నట్లే, ‘యోగ నిద్ర’ కూడా ఉంది. నిద్ర కూడా ఒక యోగమే. “నిద్ర పట్టడం ఒక యోగం, బాగా నిద్రపోవడం ఒక భోగం, నిద్ర పట్టకపోవడం ఒక రోగం” అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ కరోనా కాలంలో లాక్ డౌన్, వర్క్ ఫ్రం హోమ్, నిబంధనలు, పని లేకపోవడం, పని వేళలు మారిపోవడం, మారిన పని సంస్కృతి ( వర్క్ కల్చర్ ), వివిధ ఒత్తిళ్ల నేపథ్యంలో నిద్ర కొంతమందికి వరంగా,ఎక్కువమందికి శాపంగా మారి కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొందరికి నిద్ర ఎక్కువ కావడం, కొందరికి తగ్గిపోవడం ఈ మధ్యకాలంలో వచ్చిన ముఖ్య పరిణామంగా పరిశీలకులు భావిస్తున్నారు.

Also read: పండుగలొస్తున్నాయి, జాగ్రత్త!

జీవన గమనంపై నిద్ర ప్రభావం

 మన జీవన గమనంపై, మానసిక, శారీరక ఆరోగ్యంపై నిద్ర వేసే ముద్ర చాలా గొప్పది. “కంటికి నిద్ర వచ్చునే? సుఖంబగునే రతికేళి? ” అంటాడు శ్రీనాథ కవి సార్వభౌముడు ఒక సందర్భంలో. ” మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా” అన్నాడు ఆధునిక కవి కొసరాజు రాఘవయ్య చౌదరి. ఇలా నిద్ర చుట్టూ అనేక మాటలు, చర్చలు, సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. ‘నిద్ర’ శరీరానికి సంబంధించిన ఒక విశ్రాంత స్థితిగా చెప్పినప్పటికీ, అది మనసుకు, మెదడుకు కూడా వర్తిస్తుందని చెప్పాలి. శరీరానికి విశ్రాంతి ఎంత అవసరమో, మెదడుకు కూడా అంతే అవసరం. అవయవాల అలసట తీర్చి, తిరిగి రెట్టింపు శక్తితో దైనందిన కార్యక్రమాలను చేపట్టడంలో నిద్ర పోషించే పాత్ర చాలా కీలకమైంది. మానవ జీవితంలో నిద్ర ప్రాథమిక అవసరమని, అది పౌరుల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది.నిద్ర, నిశ్శబ్దం, విశ్రాంతి ఆరోగ్య రీత్యా మానవులకు తప్పనిసరి అవసరమని, నిశ్శబ్దం బంగారం లాంటిదని న్యాయస్థానాలు సైతం వ్యాఖ్యానించాయి. నిద్రపై అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం జరిపిన పరిశోధనల పరంగా చూస్తే, రోజుకు 8 గంటల కంటే తక్కువ నిద్ర పోయే వారిలో శారీరక సామర్ధ్యం తక్కువగా ఉంటుందని అర్ధం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం మార్చి నెల మూడో శుక్రవారం నాడు ‘ప్రపంచ నిద్ర దినోత్సవం’ జరుపుకుంటున్నారు. సాధారణంగా పెద్దవాళ్ల కంటే చిన్నపిల్లలకు ఎక్కువ నిద్ర ఎంతో అవసరం.  ఇది వారి శారీరక పెరుగుదలలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.  నెలబాలుడు నుంచి వృద్ధుల వరకూ నిద్ర పోవాల్సిన సగటు సమయంపై అనేక పట్టికలు విడుదలయ్యాయి. కానీ, పాటిస్తున్నవారి సంఖ్య పరిమితం మాత్రమే. ముఖ్యంగా ఆధునిక జీవనశైలి నిద్రపై పెను ప్రభావాలను చూపిస్తోంది.

Also read: విశాఖ ఉక్కుపై పునరాలోచన చేయరా?

ఆహారమే కీలకం

నిద్రకు సంబంధమైన అంశాల్లో ఆహారం పాత్ర ఎంతో కీలకం. మెలటోనిన్ స్థాయిల్ని పెంచే ఆహారం వల్ల గాఢ నిద్ర పడుతుందని ఆస్టన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తాజాగా విడుదల చేసిన నివేదికలో వివరిస్తున్నారు. మన ఆలోచనా విధానంతో పాటు మనం తీసుకొనే ఆహార,పానీయాల బట్టి కూడా నిద్ర ఆధారపడుతుందని కొందరు శాస్త్రవేత్తలు నమ్ముతుంటారు. ఈ అంశం ఇంకా శాస్త్రీయంగా రుజువుకావాల్సిన అవసరం ఉంది. మెలటోనిన్ అనేది ఒక హార్మోన్. మనం తీసుకొనే ఆహారం.. నిద్రకు అత్యంత అవసరమైన మెలటోనిన్ ను అనుకూలంగా, లేదంటే ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. దానికి అనుగుణంగా నిద్ర తీరు మారిపోతుంది. అమైనో ఆమ్లం (ట్రిప్టోపాన్ ) ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మెలటోనిన్ హార్మోన్  స్థాయిలు బాగా పెరుగుతాయి.  తద్వారా నిద్ర బాగా పడుతుంది. విటమిన్- డి, మెగ్నీషియం, జింక్ ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలు మంచి నిద్రకు ప్రేరకాలుగా నిలుస్తాయి. చేపలు, కివీ పండు, టార్ట్ చెర్రీలు నిద్ర పట్టడానికి ఎంతో ఉపయోగపడతాయి. పడుకునే ముందు గ్లాసు వేడి పాలు తాగితే మంచి నిద్ర పడుతుంది. ఇలా నిద్రకు – ఆహార, పానీయాలకు ఉండే సంబంధాలను నిపుణులు వివరిస్తున్నారు. నిద్రను – మత్తును వేరు వేరుగా చూడమంటున్నారు. మద్యపానం వల్ల మెదడు చైతన్య రహితంగా మారి మత్తుగా అనిపిస్తుంది. అది మత్తే కానీ, నిద్ర కాదని వైద్యులు అంటున్నారు. నిద్ర విషయంలో నిర్దిష్ట సమయాలను పాటించడం కూడా ఎంతో ముఖ్యమని చెబుతున్నారు. నేటి కాలంలో, పెరిగిన వృత్తుల వైవిధ్యం, వేళల నేపథ్యంలో సమయపాలన పాటించడం అందరికీ సాధ్యపడదు.

Also read: భారత్, రష్యాల చారిత్రక సంబంధాలు

నిద్రక్రమశిక్షణ

వారి వారి వీలునుబట్టి నిద్ర వేళల విషయంలో క్రమశిక్షణను అనుసరించాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్స్ నుంచి వచ్చే వెలుగులు కూడా హానికరం అని అంటున్నారు. నిద్రకు ఉపక్రమించే ముందు, పడక గదులలో వీటికి దూరంగా ఉండమని నిపుణులు చేసే సూచనలను గౌరవిస్తే మంచిది. వ్యాయామం,  నడక, శారీరక శ్రమ,యోగాభ్యాసం, ధ్యానం, ప్రాణాయామం నిత్యం సాధన చేయడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. సంగీతం వినడం, పుస్తకాలు చదవడం, మెదడుకు మేత వేసే పనులు చేయడం కూడా నిద్రపై మంచి ప్రభావాన్ని చూపిస్తాయని తరచూ మనం వింటున్నాం. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఎంత ముఖ్యమో ఈ కరోనా కాలంలో బాగా ప్రచారంలో ఉంది. నిద్ర అందుకు ఎంతో ఉపయోగపడుతుంది. నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలన్నా, మంచి నిద్ర అవసరం. నిద్ర తగ్గితే కాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘నిద్ర ఒక చిత్తవృత్తి’గా పతంజలి యోగ సూత్రాలు చెబుతున్నాయి. ఆహారంతో పాటు మనసును అదుపులో ఉంచుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన నిద్రకు శరీరం అలవాటు పడుతుందని యోగాచార్యులు సూచిస్తున్నారు. నిద్ర ఎంతసేపు పొయ్యామన్నదాని కంటే ఎంత బాగా నిద్ర పోయామన్నదే ముఖ్యం. ‘నిద్రించడం’ ఒక కళగా భావిస్తే ఆన్నీ సర్దుకుంటాయి. యోగం, భోగం, ఆరోగ్యం ఆన్నీ కలిసి వస్తాయి.

Also read: నిష్క్రమించిన నిలువెత్తు తెలుగుదనం

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles