ఇంత కన్నా ఎత్తయినది లేదు,
వింతైన దీ లేదు
నా పేద దేశంలో !
అరవై ఒకటవ అంతస్థు, అదే ఆఖరుది…
అక్కడ నిటారుగా, గర్వం గా మెరిసే కళ్ళతో
శ్రీమాన్ ధన రాజ్ …
ఆ ఆకాశ హర్మ్యం అంత ఠీవిగా.
అవును, ఎనిమిదివందల ముఫయిమూడు అడుగుల ఎత్తు.
క్రింది ఇళ్లన్నీ తన కాళ్ళ క్రింది చెప్పులలా.
గుడిసెలు గడ్డిపోచలుగా,
మనుషులు మూగి ఉన్న మక్షికాలుగా…
మూడేండ్ల క్రితం చుక్కల గీత పై
తన సొగసైన సంతకం చేసేటప్పుడు
ఇంపీరియల్ టవర్స్ చేసిన బాస అదే…
అక్కడ నుంచుని అతను ఎప్పుడు ఆకాశం వైపే చూస్తాడు…
క్రిందే ముందని అందం చూడడానికి?
చల్లని వర్షపు చినుకులు, వెచ్చని సూర్య కిరణాలకు అడ్డం పడినప్పుడు
అతను రెండు చేతులు చాస్తాడు…
ఏడు రంగులు ఒడిసి పట్టాలని.
“ఊ… ఎదో ఒకరోజు
ఈ ఇంద్ర ధనుస్సు ను ఎక్కు పెట్టక పోను !”
తనలో తాను నవ్వుకుంటాడు…
“ఇది నా ముచ్చటైన కోరిక… ” పగల పడి నవ్వుతాడు.
“మేర ప్యారా క్వాయిష్ !”
………….
బురద బురద గా ఉన్న మోకాలు లోతు
వర్షపు నీటిలో ముంబై రోడ్డు పై
మూటలు నిండిన తోపుడు బండి తోస్తు
వంగి వాలిపోయిన వీపు తో,
కళ్ళలో దైన్యపు నలుపు తో
భూమంత బల్ల పరపుగా,
ఆకలంత బాధ గా,
బాధ్యతంత భారంగా,
లాగేస్తున్న నడుం తడుముకొనే
ఒడుపు లేని… .
శ్రీమాన్ కుచేల్ నారాయణ్…
(నిజానికతన్ని శ్రీమాన్ అని ఎవరు సంబోధించరు.)
ఏభై ఏండ్ల ముందు తను పుట్టిన కూలీల వాడ,
పిడికెడంత రేకుల ఇల్లు,
పొంగి పొర్లే మురికి కాలువ
అతనికి పెట్టిన గట్టి ఒట్టు ఇదే !
అతనికీ ఆ దృశ్యం ఇష్టమే…
ధగ ధగ లాడుతూ, పొడుగ్గా, నిటారు గా,
నిక్కచ్చి గా, కర్కశంగా
ఇంపీరియల్ టవర్స్…
ఆరాధనగా చూపులతో
ఆ చక్కదనాల కట్టడాన్ని తడుముతూ,
తనలో తాను గొణుగు కొంటాడు.
“ఏదో ఒక రోజు
ఆ నున్నని చలువ రాళ్లపై అడుగు పెట్టితే బాగుణ్ణు ,
ఆ మెరిసే అందమైన గోడలు
ఒక్క సారి తాను తాకి తే
…ఆమ్మో మాసిపోతాయేమో?
అక్కడ విచ్చలవిడిగా విసురుతున్న
ఘాటైన డబ్బు వాసన ఒక్క సారి
గుండెల నిండా పీలిస్తే
ఉక్కిరి బిక్కిరి అయ్యేదాకా…!”
ఒకసారి
తానూ, తన అవతారం చూసుకొని
అతనూ నవ్వుకుంటాడు.
“ఊహు! ఇది ఒక కల… కలమాత్రమే…
ఏక్ అధూరి సప్నా !”
Also read: బాస
Also read: సుదీర్ఘ ప్రయాణం
Also read: అట, అకటా
Also read: మందల
Also read: లోహ(క)పు బిందె