Wednesday, January 22, 2025

ఆ ఆరుగురు …..

50 నుండి 60 మధ్యన వయసు ఉండే ఆరుగురు వ్యక్తులు చ్చాయ్ తాగుదాము అని వస్తారు. ఛాయ్ వాలాకు ఆర్డర్ ఇస్తారు, ఇంతలో ఆరుగురిలో నుండి ఇద్దరు డబ్బులు ఇచ్చేటందుకు పోటీ పడతారు. ఆ ఇద్దరిలో కొంచెం ఎక్కువ వయసు (60) ఉండే అతను ఎప్పుడూ నీవే డబ్బు కడతావు నేను ఈసారి ఛాయ్ డబ్బులు కడతాను… అని బ్రతిమిలాడుతాడు … ఎప్పుడూ డబ్బులు కట్టే వ్యక్తి … అవునా ఎప్పుడూ నేనే కడతానా ? చాలా ఆశ్చర్యంగా మొఖం పెట్టి … సరేలే, ఈ ఒక్కసారి నేనే కడతాను … రేపు నీవు కట్టెద్దువు .. అని, చాలా నమ్మకంగా .. జాగ్రత్తగా మాటలు చెపుతాడు … ఆ వెంటనే, వారిలో అందరికన్నా తక్కువ వయసున్న అతనికి జేబులో నుండి వంద రూపాయల నోట్ తీసి … నీవు కట్టెయ్యి డబ్బులు అని అతని చేతికి ఇస్తాడు … ఈ తతంగం మొత్తాన్ని గత వారం రోజుల నుండి రాజేష్ చూస్తున్నాడు, .. అందరి వయసు ఒకటి కాదు, ఒకరికి, ఒకరికి మధ్య వయసు తేడ బాగానే ఉంది, ఆ ఆరుగురి మధ్యన వున్న “అనుబంధం , బంధం , స్నేహం … ” ఏంటో అర్ధం కాలేదు, జుట్టు పిక్కున్నాడు .. ఈ విషయం పై తర్జన భర్జన పడ్డాడు.. హనీఫ్ అనే స్నేహితుడు కి అర్ధం అయ్యి, అర్ధం కాని ఈ విషయం చెప్పాడు…

ఉఫ్ … అంటూ హనీఫ్ గట్టిగా గాలి పీల్చుకుంటూ, ఒరే వాళ్ళను గమనించటం వదిలెయ్యిరా … నీవు ఒక వారం రోజులకే వాళ్ళను చూసి పరేషాన్ అవుతున్నావు … నేను నెల రోజులు వాళ్ళ వెనకాల తిరిగి … తిరిగి .. కనుక్కోలేక పోయా … చివరికి ఆ ఛాయ్ కొట్టోడిని అడిగా … ఆ ఛాయ్ వాడికి అర్ధం కాలేదు … గత రెండు సంవత్సరాలుగా అక్కడే … వాడి ఛాయ్ తాగుతున్నారు … అదే 11.30 మధ్య, ఒకవేళ మిస్ అవుతే 2.30 కి ఆ ఆరుగురు అక్కడికి వస్తారు … కాకతాళీయంగా వాళ్ళను గమనించటం మొదలయ్యింది … చివరికి అంతు చిక్కని క్యూరియాసిటి పెరిగింది … ఛాయ్ వాడిని అడిగాను ” .. .. అదేంటి నేను బిల్ పే చేస్తాను అనే ఆ పెద్ద మనిషితో ఇంకో పెద్ద మనిషి … ఆ రేపు నీ వంతు అంటాడేకానీ … ఎప్పుడూ అతనే డబ్బు తీసి మరో వ్యక్తి కి ఇచ్చి, ఆ వ్యక్తితో ఎందుకు పే చేపిస్తాడు …” అని , ఛాయ్ కొట్టువాడు తెలియదు అన్నాడు … అంతటితో ఆగకుండా వాళ్ళను వేటాడటం మొదలుపెట్టాను … చివరికి ఒకరోజు ” డబ్బులు పే చేసే వ్యక్తిని ” కలిసి … నా క్యూరియాసిటిని తన ముందు పెట్టాను … తను చెప్పిన మాట విని … అతన్ని కళ్ళు మాత్రమే చూస్తున్నాయి… మాటలు పెదవిని దాటి రాలేదు … నోరు విప్పేప్రయత్నం చేసే లోపే తాను వెళ్ళిపోయాడు ….

అబ్బ … ఏం చెప్పాడో చెప్పి చావురా ముందు … సస్పెన్స్ ను భరించలేకున్న …

చెపుతాను కదరా ఆగు … వాళ్లంతా ఒకే ఆఫీస్ లో పనిచేస్తారు .. రెండు సంవత్సరాల క్రితం ఆ టీమ్ లోని ఆ పెద్ద మనిషి రిటైర్డు అయ్యాడు … పెన్షన్ పై ఆ పెద్ద మనిషి, ఆయన భార్య, ఒక పిచ్చి కొడుకు .. బ్రతుకుతున్నారు … పట్టించుకోవలసిన ఇద్దరు మగ పిల్లలు భార్య చాటు వాళ్ళు …బిల్ కడతాను అనే పెద్ద మనిషి, వాళ్ళు బ్రతుకుతె చాలు అనుకుంటాడు …. బిల్ కట్టే మనీషి, మిగిలిన నలుగురు … రేపు కడుదువులే, ఈ పూట కట్టనివ్వు అని మర్యాద పూర్వకంగా … నచ్చ చెపుతున్నట్లు ఆ రిటైర్డు మనిషికి చెపుతారు … రిటైర్డు కాక ముందు ఆఫీస్ క్యాంటీన్ లోనే ఛాయ్ తాగి, ఒక రోజు ఒకరుగా బిల్ పే చేసే వాళ్ళు అట, ఎక్కువ సార్లు ఇప్పుడు పే చేస్తున్నతనే పే చేసే వాడు అట, … రిటైర్డు అయిన ఆ పెద్ద మనిషి కోసం బయటికి వచ్చి ” ఆ ఛాయ్ కొట్టు దగ్గర … ఏదో ఒక సమయంలో కలిసి ఆ రిటైర్డు పెద్ద మనిషితో ఆ ఆరుగురు మాటా మంతీ ” అని చెప్పాడు…

సరే బాగుంది … ఎప్పుడూ ఒకతనే ఎందుకు పే చేస్తాడు మరి…

ఈ విషయం నేను అడగక ముందే ఆ రెండవ పెద్ద మనిషి చెప్పాడు … తన పేరు సాగర్ అనియు … ఇంట్లో ఎలాంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు లేవని, ఒక్కతే కూతురు అని, పెళ్ళయ్యింది అని … కూతురు డాక్టర్, అల్లుడు కలెక్టర్ అని … డబ్బులు తాను కట్టకుండా మరో వ్యక్తికి ఇచ్చి ఎందుకు కట్టిస్తాడో … ఆ విషయం కూడా చెప్పాడు … డబ్బులు ఇస్తే కట్టే వాడి పేరు శైలేష్ అని, ఫ్రెండ్స్ కోసం కొంచెం ఖర్చు పెట్టాలి అనుకుంటాడు … కానీ పెట్టలేడు… జేబులో డబ్బులు ఉండవు … పెద్ద సంసారం … అందుకు శైలేష్ తో కట్టిస్తాను, శైలేష్ కోరిక తీరినట్లు … మిగిలిన ముగ్గురు, ముగ్గురు అనాధ పిల్లలకు ప్రతి సంవత్సరం వారికి అయ్యే స్కూల్ ఖర్చును వారే భరిస్తున్నారు … మా గురించి తెలుసుకోవాలి అనే ఆత్రుత బలంగా నీలో ఉంది … అందుకే ఇది అంతా చెప్పాను … ఏదైనా అవసరం మాతో తీరుతుంది అంటే … ఎప్పుడైనా ఆ ఛాయ్ కొట్టు దగ్గర కలువు అంటూ వెళ్లి పోయాడు… రా రాజేష్ …

రాజేష్ ఏమి విన్నాడో, అది బుర్రలోకి వెళ్లినట్లు లేదు … మళ్లీ చెప్పు అన్నాడు …

ఆ వాల్ పై రాసాను .. పోయ్ చదువుకో ఫో… అన్నాడు హనీఫ్ …      

(ఈ కథ రాసిన రోజు : 04-07-2019)

Jaya Vindhyala
Jaya Vindhyala
రచయిత్రి తెలంగాణ హైకోర్టులో న్యాయవాది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లో సభ్యురాలు. హైకోర్టు బార్ అసోసియేషన్ ప్యాట్రన్. మెహబూబ్ కా మెహందీ, బాండెడ్ లేబర్ వంటి అంశాలపైన కేసులు వాదిస్తారు. పోలీసుల వేధింపులకూ, పోలీసు కస్టడీలో మరణాలకు వ్యతిరేకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అధ్యక్షురాలిగా పని చేశారు. ప్రస్తుతం అదే సంస్థ తెలంగాణ విభాగానికి ప్రధానకార్యదర్శి. నక్సలైట్లకీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్య 2004లో జరిగిన చర్చలలో చురుకైన పాత్ర పోషించారు. అసంఘటిత కార్మికుల సమస్యలపై విదేశాలలో జరిగిన సమావేశాలకు హాజరైనారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఎల్ఎల్ బీ చదివారు. న్యాయవాదన వృత్తి అయితే కథలు రాయడం ఆమె ప్రవృత్తి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles