రామాయణమ్ – 136
రావణుడి ప్రేలాపనలింకా సాగుతూనే ఉన్నాయి.
ఓ అపూర్వసౌందర్యరాశీ, నీ ముందు నా భార్యల అందము దిగదుడుపు. వారి సౌందర్యమూ ఒక సౌందర్యమేనా! నా కన్నులు వారిని చూచుటకు ఇష్టపడుటలేదు ..
అందమైన నీమోము మా డెందముపై నిలుపుము.
మాకందము వలె జుర్రుకొందును.
Also read: సీతను సుముఖం చేసుకోవడానికి రావణుని ప్రేలాపన
సురాసురగంధర్వులలో నన్నెదిరించి రణముననిలుచు వారెవ్వరూ లేరు. మానవుడైన రాముడు నాకు సరిజోడనుకొన్న నీ ఊహ తప్పు.
నారబట్టలు కట్టి చెట్టుపుట్టలు పట్టి తిరుగుచూ, నేలపై పరుండు దేశదిమ్మరి రాముడు నీకేమి ఇవ్వగలడు?
ఓ ముద్దులపట్టీ, నను చేపట్టి అష్టైశ్వర్యములనుభవించి నీవారికి కూడా పెట్టి సుఖపెట్టుము.
Also read: భీతిల్లే లేడికూన సీత
రాముడట రాముడు! వాడికి నాకు పోలిక ఎక్కడ? తపస్సులోనా? తేజస్సులోనా? వర్చస్సులోనా?
బలములోనా? బలగములోనా?
ధనములోనా? రాజ్యములోనా?
ఎందులో నాతో తూగగలడు?
వాడు ఇచటికి రాగలడన్నపిచ్చి ఆశలు కట్టిపెట్టి నను చేపట్టుము.
ఉత్తుంగతరంగాలతో భయంకరమైన శతయోజన విస్తీర్ణము గల సంద్రము దాటి అతడు రాగలడా? అయినా ఇప్పటికింకా బ్రతికి ఉన్నాడనేనా నీ నమ్మకం?
Also read: ఆమె ఎవరు?
రా. నాతో కలువు. రమించు. సుఖించు!
రావణుడి ప్రేలాపనలన్నీ విని ఇరువురికీ మధ్య ఒక గడ్డి పోచ అడ్డము ఉంచి సీతమ్మ మాటాడ సాగింది!
(గడ్డిపోచ అడ్డము ఉంచటానికి గల కారణాలు …..కొందరి ఊహలలో …ఇలా ఉన్నాయి.
1) ఈ గడ్డిని తుంచినట్లు నీ తలను తుంచుతాను
2) నీవు ఇప్పుడు నా అతిధివి కావున ఈ గడ్డి తిను నా వద్ద ఇదే ప్రస్తుతము ఉన్నది, నీ ది పశుప్రవృత్తి కావున గడ్డి మేయి.
3) నీవు , నీ ఐశ్వర్యం నాకు గడ్డిపోచతో సమానము.
4) ఇరువురి మధ్య పంక్తిభేదము కోసము గడ్డిపరక ఉంచినది.
Also read: అశోక వనమున వెదకలేదని గుర్తించిన హనుమ
5) పతివ్రతలు పరపురుషుడిని చూస్తూ మాటాడరాదు కావున గడ్డిని చూస్తూ మాటాడటం కొరకు..
ఇంకా చాలా అర్ధాలు మన పెద్దలు చెప్పారు.)
…. చిగురుటాకులా వణికి పోయింది వైదేహి,
తుఫానుగాలికి ఊగి పోయే అరటి చెట్టులా ఉన్నది సీతమ్మ,…
ఆ సమయంలో ఊహలగుర్రాలనుపూన్చిన కోరిక అనే రధమెక్కి రాజులలో శ్రేష్ఠుడైన రాముడిదగ్గరకు వెళ్లిందా!
అన్న రీతిలో ఉన్నది సీతామహాసాధ్వి,
రాముడి చేతిలో వీడికి పరాభవం కలగాలి అనికోరుకొంటూ,
వాడి ప్రేలాపనలన్నీ విని ఒక గడ్డిపోచ తీసుకొని వాడికీ తనకూ మధ్య ఉంచి వాడిని హెచ్చరించింది…
నీవు పాపపు ఆలోచనలు మానివేసి నీ భార్యలతో సుఖంగా ఉండు.
నేను ఉత్తమ వంశం లో పుట్టి ఉత్తమ వంశంలో మెట్టిన దానను.
నీవు ధర్మం తెలిసిన వాడవు ,పరభార్యలను ఆశించడం తగదు,పరభార్యల పట్ల ఆసక్తి పతనానికి హేతువు !…
నీ బార్యలు ఎట్లా రక్షింపతగినవారో పరుల భార్యలు కూడా ఆ విధంగా రక్షింపతగిన వారే!…
నీకు సద్బుద్ధి బోధించేవారెవరూ లేరా? ఒక వేళ వారు చెప్పినప్పటికీ వారి మాటలు నీ తలకు ఎక్కడం లేదా? నీ బుద్ధి,ప్రవర్తన రాక్షస వినాశనానికే పరుగులు పెడుతున్నట్లుగా ఉన్నది!
మనస్సు అదుపులోలేని పాలకుల వల్ల ప్రజలు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు! వారివలన రాజ్యములు నశించిపోతాయి!
రాముడొకటి నేను ఒకటి కాదు. మేమిరువురమూ కలిపి ఒకటి!
రామునినుండి నేను వేరుకాదు.
ఆ రాముడి భుజము తలగడగా నిద్రించిన నేను ఆ రాముడెలాంటి వాడో చెపుతావిను!
ఆయన మహావీరుడు. ఆయనకు ఎదొరొడ్డి నిలువ గల వీరుడు ముల్లోకాలలో ఇంకా పుట్టలేదు,ఇహ పుట్టడు…
ఆయనకు కోదండం ఒక ఆట వస్తువు!
Also read: చింతాక్రాంతుడైన ఆంజనేయస్వామి
రామచంద్రుడు అనే గరుత్మంతుడు రాక్షసులు అనే పాములను పట్టి చీల్చివేస్తుంటే నేను చూసే రోజు ఇంకెంతో దూరంలో లేదు!
ఇంకొన్ని రోజులలో నీవు రామ లక్ష్మణుల ధనుస్సు నుండి బయల్పడిన శరపరంపరతో కప్పివేయబడిన లంకానగరపు ఆకాశాన్ని చూస్తావు ..
దొంగ చాటుగా …రాముడు లేనప్పుడు ఒంటరిగా ఉన్న నన్ను తీసుకొనివచ్చిన నీ వీరత్వం శ్రీ రామసింహం ముందు ఏపాటిది?
పెద్దపులుల వాసన వస్తేనే కుక్కలు పలాయనం చిత్తగించేటట్లు రాముడిని చూసి నీవు పారిపోయే రోజు దగ్గరలోనే ఉంది!…
నీకు ఏమాత్రము బ్రతుకు మీద ఆశ, తీపి ఉన్నచో తక్షణమే నా రాముని వద్దకు నన్ను చేర్చుము.
ఈ సంభాషణంతా చెట్ల కొమ్మల్లో దాగి ఉన్న ఆంజనేయ స్వామి ఆలకించారు……
(రావణుడికి ఎదనిండా కోరిక, ఎదుట సీత, వెనుక సీత ఎటుచూస్తే అటు సీత. నిల్చోలేడు, కూర్చోలేడు, రమణులతో రమించలేడు, నిదురించలేడు. అతడి మనోజగత్తును ఆక్రమించుకొని సీతాదేవి ఒక్కతే ఉన్నది.
వేద వేదాంగ వేత్త అయినా వెకిలితనం పోలేదు
లక్ష్యం తప్పని పోటుగాడు అయినా ఆవిడ లక్ష్యపెట్టటంలేదు
గురితప్పని విలుకాడు అయినా ఆవిడ విషయంలో గురితప్పింది
చీకాకు పడి సీతమ్మను అనరాని మాటలన్నాడు. అంతులేని క్షోభకు గురిచేస్తున్నాడు.
కామం పొరలుకప్పిన కళ్ళు ఉచ్ఛనీచాలు గమనించలేక పోతున్నాయి.
కామాతురాణామ్ న భయమ్ న లజ్జ ……
అంటే కామం నిండిన వాడికి సిగ్గు ,శరము, భయము ఇవేవీ ఉండవట!
కామానికి ఆక లెక్కువ. అది మహాశన!
ఎంత తిన్నా తృప్తిపడదు.
ఇంకా ఇంకా కావాలనే అంటుంది!
అందుకోసం ఎంతటి పాపానికయినా ఒడిగడుతుంది)
Also read: హనుమ ఎంత వెదికినా కానరాని సీతమ్మ
వూటుకూరు జానకిరామారావు