Thursday, November 7, 2024

ఈటెల వంటి మాటలతో లక్ష్మణుడిని బాధించిన సీత

రామాయణమ్ 76

ఎదో స్వరము దీనముగా వినపడుతున్నది.

అది ఎవరిదో ఆర్తనాదమే.

 అవును! ఆ స్వరము నా నాధుడిదే.

ఏమి ఆపదలో చిక్కుకున్నాడో ఏమో,

 పాపము ఆమె హృదయము తల్లడిల్లిపోయింది.

వెంటనే లక్ష్మణునితో ” నీవు వెళ్లి రామునికి ఏమైనదో తెలుసుకోనిరా” అని పలికింది సీతమ్మ.

Also read: మారీచుడిని మట్టుపెట్టిన రాముడు

ఆ అరుపులు సింహము నోట్లో చిక్కి విలలవిల లాడుతూ రక్షించమని అంబారవములు చేసే ఎద్దు దీనాలాపములుగా ఉన్నవి. నా ప్రాణము, హృదయము పరితపిస్తున్నాయి రామునికి ఏ ఆపద వచ్చినదోయని. నీ సోదరుడు రక్షణ కోరుతున్నాడు. నీవు త్వరగా వెళ్ళు’’ అని సీతాదేవి మరలమరల పలికింది.

సీతాదేవి అంతగా చెప్పినప్పటికీ లక్ష్మణుడు అన్నగారి ఆజ్ఞకు బద్ధుడై అంగుళము కూడా కదలలేదు.

సీతాదేవి కుపితురాలైంది. ఒక ప్రక్క తన భర్తకు ఏమైందో అన్న ఆందోళన ఆమెలోని ఆలోచనను, విచక్షణను కోల్పోయేలా చేసింది.

లక్ష్మణా! నీకు నామీద గల కోరిక చేత నీ అన్నకు వచ్చిన ఆపదను పట్టించుకోవటములేదు. నీవు మిత్రుడి రూపములో ఉన్న శత్రువు. ఆ విషయము నీ అన్న తెలుసుకోలేకపోయాడు. నీకు నా మీద ఆశ ఉండుట చేత అన్నకు కష్టము వచ్చినప్పటికీ అడుగు ముందుకు వేయడములేదు. ఆయనకా కష్టము కలగాలనే నీవు కోరుకొంటున్నావు.

Also read: సీతమ్మ కంటబడిన మాయలేడి

‘‘ఇప్పుడు రాముడు కష్టాలలో ఉన్నాడు. ఆయనను రక్షించడమే నీ  ప్రధాన కర్తవ్యము, నన్ను రక్షించడము కాదు’’ అని ఒక ఉన్మాదినిలాగా మాట్లాడుతున్న సీతాదేవిని చూసి,

“రాముడంటే ఏమనుకున్నావు? పరాక్రమములో ఆయన సాటి నిలువగల వారు మూడులోకాలలో ఎవరూ లేరు. పన్నగ, గంధర్వ, అసుర, మానవ ,దేవతా గణాలలో నీ భర్తను జయించగలవారెవ్వరూ లేరు. రాముణ్ణి యుద్ధములో జయించగలగటము కలలో కూడా జరుగని పని. నీవు ఈ విధముగా మాటలాడటము తగదు. నిన్ను ఒంటరిగా ఈ అడవిలో విడిచి వెళ్ళను. ఇది రామాజ్ఞ. నిన్ను నా రక్షణలో ఉంచి ఆయన వెళ్ళాడు. నీవు విన్నది రాముని స్వరము కాదు. అది మాయావులైన రాక్షసుల పని.  అది ఒక ఇంద్రజాలము. ఖరుడితో మనకు కలిగిన వైరము, అతనిని సంహరించడము వలన మన మీద ప్రతీకారము తీర్చుకొనుటకు రాక్షసులు పన్నిన ఎదో పన్నాగమది” అని పలికి నిలుచున్నాడు రామానుజుడు.

Also read: మారీచుని చంపుతానని బెదిరించిన రావణుడు

తను ఆ విధముగా ఆందోళన పడుతూ మాట్లాడినప్పటికీ ఏమీ పట్టించుకోకుండా స్థిమితముగా, నిమ్మకు నీరేత్తినట్లున్న లక్ష్మణుని చూసి సీతాదేవికి వళ్ళు మండిపోయింది.

చాలా కోపముతోఎర్ర బడ్డ  కళ్ళతో, నీవు కులములో  చెడబుట్టావు. మనసులో దుష్టపు ఆలోచనతో రాముడి ఆపద గురించి ఏ మాత్రమూ ఆలోచించటము లేదు. ఆయనకు ఆ విధముగా జరగాలని కోరుకుంటున్నావు’’ అని గట్టిగా అరిచింది సీతాదేవి.

పాపపు అభిప్రాయాలు కడుపులో పెట్టుకొని రహస్యముగా ప్రవర్తించే నీ వంటి వాడు మిత్రుడి రూపము లోని  శత్రువు. దుష్టబుద్దివి నీవు. భరతుడిచే ప్రేరేపింపబడి మమ్ములను అనుసరిస్తూ వస్తున్నావు. ఇది నీ పన్నాగమైనా, భరతుడి పన్నాగమైనా, మీ కోరిక సిద్ధించదు. ప్రాణాలైనా నేను తీసుకుంటాను కానీ మీకెప్పటికీ వశము కాను.

ఉన్మాదినిలా మాట్లాడుతున్న ఆవిడ మాటలు విని ఇంద్రియ నిగ్రహ వంతుడైన లక్ష్మణుడు అంజలిఘటించి నమస్కరిస్తూ, ‘‘అమ్మా, నీ మాటలకు బదులు చెప్పటము నా కిష్టము లేదు. నీవు నాకు దైవము. ఈవి ధముగా మాటలాడటము స్త్రీ సహజ లక్షణమే.జనకుని కొమరితవైన ఓ సీతాదేవీ పదునైన బాణముల వంటి నీ పలుకులు ములుకులలాగా నా హృదయాన్ని పీడిస్తున్నాయి. సహించలేకున్నాను.

Also read: రావణుడికి మారీచుడి హితబోధ

స్త్రీవైన నీవు అన్నగారి ఆజ్ఞ పాటించుచున్న నన్ను అనరాని మాటలంటున్నావు. ధర్మవిరుద్ధముగాప్రవర్తిస్తున్నావు. అందుకు ఈ వన దేవతలే సాక్షి. 

ఛీ! నీ విప్పుడు నశించెదవుగాక! నేనిప్పుడే రాముడున్న చోటికి వెళ్లెదను. ఇప్పుడు అగుపడుతున్న శకునాలు చూడబోతే నేను మరల నిన్ను తిరిగి చూస్తాననే నమ్మకము కలగటము లేదు’’ అని బాధ నిండిన హృదయముతో పలికిన లక్ష్మణుని చూసి, ‘‘రాముడు లేకపోతే నేను ఇప్పుడే ఇదుగో ఈ గోదావరిలో దూకిచస్తాను. లేదా ఉరి వేసుకుంటాను. లేదా అదుగో ఆ కనపడుతున్న ఎత్తైన గిరిశిఖరము మీదనుండి దూకి చస్తాను’’ అని పలికింది సీతాదేవి.

‘‘విషమైనా త్రాగుతాను. అగ్నిలో దూకనైనా దూకుతాను. కానీ అన్యుడైన పరపురుషుని పాదములతోనైనా తాకను’’అని అంటూ గుండెలు బాదుకొంటూ ఏడుస్తున్నది సీతమ్మ.

ఆవిడను ఓదార్చడానికి విఫల యత్నము చేసి తన వల్ల గాక ఆవిడకు అభివాదము చేసి మాటిమాటికీ వెనుదిరిగిచూస్తూ విడిచిపెట్టలేక ,విడిచిపెట్టలేక రాముడి కొరకు అడవిలోకి పయనమయ్యాడు సుమిత్రా నందనుడు.

Also read: సీతాపహరణానికి రావణుడిని ప్రేరేపించి పంపిన శూర్ఫణఖ

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles