రామాయణమ్ – 137
అదరక, బెదరక నీవెంత, నీలెక్కెంత అన్నట్లు పలికిన సీతాదేవి పలుకులు విని రావణుడు రోషముతో బుసలుకొట్టి కనులెర్రచేసి ‘రాముడట రాముడు! ఆతడేమిచేయునో ఇప్పుడే చూసెదను! నిన్ను ఈక్షణమే నశింపచేస్తాను. రామునిపై మక్కువకల ఈ సీతను నాకు వశమగునట్లుగా నయముగానో ,భయముగానో మీకు తోచిన పద్ధతి ప్రయోగించి నా దారికి తెండు!’అని అక్కడ ఉన్న రాక్షస స్త్రీలను ఆజ్ఞాపించాడు.
Also read: ‘నువ్వు గడ్డిపోచతో సమానం’ అని రావణుడికి స్పష్టం చేసిన సీత
‘సామ,దాన,భేదములు ఏదైనాసరే ఉపయోగించండి. ఈమె నా దరికి రావలె.’
రావణుని ఈ ఆవేశము చూసి ధాన్యమాలిని అనే రాక్షస స్త్రీ త్వరగా రావణుని వద్దకు వచ్చి ఆయనను కౌగలించుకొని ‘‘దీనురాలు, హీనురాలు అయిన ఈ సీత నీకేమి సుఖమీయ కలదు? నిన్ను ప్రేమించని స్త్రీ నీకేమి ఆనందము పంచగలదు? రా, నాతో హాయిగా విహరించు’’ అని మరులు పోయింది. అప్పుడాతడు నవ్వుచూ ఆమెను ఆదరించి వెనుకకు మరలెను.
రావణుడు తిరిగి వెళ్ళగనే రాక్షసమూక అంతా సీతాదేవి చెంత చేరి పరిపరి విధాలుగా ఆమెను భయభ్రాంతులకు గురి చేయసాగారు.
‘‘ఓసి తెలివితక్కువదానా, రావణుడంతటి గొప్పవంశజుడు తనంతతాను నీదరికి వస్తే ఆదరించక చీదరించుకొందువా? బ్రహ్మమానస పుత్రుడైన పులస్త్యప్రజాపతి పుత్రుడు విశ్రవసుడు. మహాతేజఃశాలి. ఆయన పుత్రుడే ఈ రావణుడు. కుబేరుని సోదరుడు.
Also read: సీతను సుముఖం చేసుకోవడానికి రావణుని ప్రేలాపన
దేవేంద్రుడు దాసోహమన్నాడు.
ఈతని పరాక్రమ ధాటికి కుబేరుడు కుదేలయ్యాడు.
మడమతిప్పని వాడు.
మాటతప్పని వాడు.
తన భార్యలను కూడా మరచి నీ పై మరులుకొన్నాడు.
ఈయన ఆజ్ఞకు తల ఒగ్గి సూర్యుడు తన కిరణాలలో తీవ్రత తగ్గించుకొంటాడు.
వాయువు మందమందముగా ఆహ్లాదముకరముగా వీస్తాడు.
తరులన్నీ విరులవాన కురిపిస్తాయి.
గిరులన్నీ నీటి ఊటలను పారిస్తాయి.
ఆయన ఆజ్ఞాపిస్తేనే మేఘము వర్షిస్తుంది.
Also read: భీతిల్లే లేడికూన సీత
మహామహిమాన్వితుడు మా రాక్షస రాజు నీ పాదక్రాంతుడై దరిచేరితే
మూర్ఖురాలా, తిరస్కరిస్తావా? నీవిక జీవితము మీద ఆశ వదులు కోవలసిన.
అని సీతమ్మను బెదిరించసాగారు వికృత రూపిణులయిన రక్కసిమూకలు.
నన్ను మీరంతా ఎందుకింత బాధపెడుతున్నారు? రాముని విడిచి నేనుండలేను.
పాపపు మాటలు మాటలాడి నా మనస్సును మీరేల క్షోభపెట్టెదరు?
దీనుడైనా, రాజ్యభ్రష్టుడైనా, నా భర్త నాకు పూజ్యుడు.
సువర్చల-సూర్యులవలె,
శచీదేవి-దేవేంద్రులవలె,
అరుంధతి-వసిష్ఠులవలె,
రోహిణీ-చంద్రులవలె,
లోపాముద్ర-అగస్త్యులవలె,
సుకన్య-చ్యవనునివలె,
సావిత్రి-సత్యవంతునివలె
,శ్రీమతి-కపిలునివలె,
మదయంతి- సౌదాసునివలె
కేశిని-సగరునివలె,
దమయంతి–నలునివలె…
నా భర్తయందు మాత్రమే నేను అనురాగముతో యుందును.
Also read: ఆమె ఎవరు?
అని దృఢముగా పలికిన సీతాదేవి పలుకులు విని ఇక సహించలేక!… రాక్షసస్త్రీలు బెదిరించసాగిరి.
‘‘ఏయ్ సీతా, అందమైన నీ శరీరములో ఒక్కొక్కభాగము కోసుకొని ఒక్కొక్కరము పంచుకొని సురాపానము చేసి నికుంభిలా ఆలయములో ఆనందముగా నాట్యము చేస్తాము’’ అని అంటూ కళ్ళెర్ర చేసినదొకతి. పిడికిలి ఎత్తిపట్టి మీదమీదకు వచ్చినది ఇంకొకతి!
‘‘సీతా, అందమైన నీగుండె రేపటి నా ఉదయపు పలహారముకానున్నదిలే’’ అని ఒకతి
‘‘ఏయ్ లేడికళ్ళదానా, రావణుడు పట్టితెచ్చినప్పుడే నిన్నొకపట్టు పట్టాలని నాకు తెగ కోరిక కలిగింది. అయినా ఇప్పుడు మాత్రము ఏమి మునిగిపోయిందిలే. నీ ప్లీహము, పేగులు, గుండెకాయ, శిరస్సు నాకే చెందాలి’’ అని ఇంకొకతి.
విపరీతము గా భయపెట్టసాగారు
ఈ విపరీత ధోరణికి తట్టుకోలేక ధైర్యము కోల్పోయి కన్నుల వెంట జలజల నీరుకారి కాలువలుకట్టాయి సీతాదేవికి.
Also read: అశోక వనమున వెదకలేదని గుర్తించిన హనుమ
వూటుకూరు జానకిరామారావు