రామాయణమ్ – 33
దశరథుడి ఆజ్ఞలు వింటూ కైక భయపడిపోయింది.
ఖాళీ అయిన బొక్కసము, సైన్యము లేని రాజసము, నిర్జన నగరము ఉండీ భరతుడికేం ఉపయోగము. తను ఇంత చేసి అంతా వృధా అయిపోతుందేమో అనే వ్యధ ఒక్కసారిగా ఆవిడ హృదయాన్ని పట్టిపీడించింది. ‘‘అక్కరలేదు. సారహీనమైన రాజ్యమక్కరలేదు’’ అని నిస్సిగ్గుగా, నిర్లజ్జగా అందరి ఎదుటా గర్జించినట్లుగా పలికింది కైక.
‘‘ఓసీ దురాత్మురాలా నీకోరిక రాముడిని అడవికి పంపమనే. అంతేకానీ వైభవశూన్యుడైన రాముని పంపమని కాదు’’ అని దశరథుడు గద్దించాడు కైకను.
Also read: దశరథుడి సమక్షంలో కైకకు సుమంత్రుడి ఉద్బోధ
తోకతొక్కిన త్రాచులాగా లేచింది. మీదకురికే రేచులాగా నిలుచుంది. ‘‘నేనన్నది మీ వంశంలో అసమంజసుని సగరుడు ఎలా పంపాడో అలాగ పంపమని. అంతేకానీ ధనధాన్యాలతో, చతురంగబలాలతో, దాసదాసీజనంతో విహార యాత్ర కెళ్ళినట్లు కాదు.’’
ఈ విధంగా మాట్లాడుతున్న కైకను చూసి సిద్ధార్దుడనే మంత్రి ‘‘అసమంజసుడితో రాముడికి పోలికా? సకలసుగుణాభిరాముడు,సర్వలోకమనోహరుడు ,సకల జీవ సంరక్షకుడమ్మా రాముడు! వాడు అసమంజసుడు, పసిపిల్లల పీకలునొక్కి వారి ఏడుపులు విని ఆస్వాదించి ఆనందించేవాడు. వారిని గిరగిర త్రిప్పి సరయూనదిలో బంతులు విసిరినట్లు విసిరే వాడు.లోకంలోని అసమంజసమైన పనులన్నీ చేసే వాడు! వాడికీ, రామునికీ పోలికా? నీవు మాటలాడే దానిలో ఏమైనా ఔచిత్యమున్నదా? వాడి బాధలు తట్టుకోలేక జనం మొరపెట్టుకొంటే భార్యతోసహా రాజ్యబహిష్కరణ శిక్ష విధించాడమ్మా సగర చక్రవర్తి. అటువంటి దౌర్భాగ్యునితో రామునికి పోలిక తేవడమా? నీవు స్పృహలోనే ఉన్నావు కదా! అసలు అడవికి పంపటానికి రాముడు ఏ నేరం చేశాడో మేమంతా తెలుసుకో గోరుతున్నాము. నిష్కారణముగా సత్పధగామిని శిక్షిస్తారా? ఆ పాపము ఊరకే పోదు!’’
Also read: అడవికి బయలు దేరిన సీతారామలక్ష్మణులు
సిగ్గూఎగ్గూలేని కైక ఇంతమంది ఇన్నిమాటలంటున్నా తనకేమీ పట్టనట్లు అలాగే ఉండిపోయింది.
తనకోసం తండ్రి పడుతున్న ఆరాటం చూశాడు. కైక పెడుతున్న అభ్యంతరాలూ విన్నాడు. వనములలో నివసించబోయే తనకు చంతురంగ బలాలు, సకల రాజపరివారము అవసరమా? అని తనను తానే ప్రశ్నించుకున్నాడు. సవినయంగా తండ్రితో ‘‘తండ్రీ! వనవాసము చేయబోవునాకు వీటితో పని ఏమున్నది? ఏనుగునే ఇచ్చివేసిన వాడికి దానిని కట్టే తాడుతో పని ఉంటుందా? రాజ్యాన్నే త్యజించినవాడికి రాజలాంఛనాలతో పని ఏమున్నది? వనములలో నాకు కావలసినవి ఒక గునపము ,తట్ట. ఈ రెండువస్తువులు మాత్రమే! కట్టుకోవడానికి నారచీరలిప్పించండి అవి చాలు’’ అని స్థిరంగా పలికాడు రాముడు.
.
రాముడి నోట ఈ మాట ఎప్పుడయితే బయటకొచ్చిందో ఆ వెంటనే మతాబులాగ వెలిగిపోయింది కైక ముఖం. అప్పటివరకు ఆమె అనుకొన్నదానికి విరుద్ధంగా జరుగబోతున్నదేమో? సకలసంపదలు, సర్వసైన్యమూ, సకలజనులూ రాముని పరం కాబోతున్నవేమో? తను కోరిన వరాలలో అవి ఇవ్వవద్దని ఎక్కడా లేదు. కాబట్టి రాజు తనకు బుద్ధిచెప్పడానికి రాముడికి ఎక్కడ ఇచ్చివేస్తాడేమో అని తెగ మధన పడ్డది. ఇప్పుడిక ఆ భయం లేదు. రాముడే వద్దన్నాడుగా!
ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా లోనికి నడిచింది రాముడు కోరినవన్నీ స్వయంగా తానే తెచ్చి ఇచ్చింది!
సంతోషంగా స్వీకరించాడు వాటిని శ్రీ రాముడు. అన్నదమ్ములిరువురూ నారచీరలు ధరించారు!
Also read: రాముడితో అడవికి వెళ్ళడానికి సీతాలక్ష్మణులు సిద్ధం
సీతమ్మకు మాత్రం వాటిని ఎలా కట్టుకోవాలో తెలియక అయోమయంగా చూస్తూ ఉన్నది. పుట్టినప్పటి నుండీ పట్టు వస్త్రాలు తప్ప నారచీరలు ఎట్లా ఉంటవో కూడా చూసి ఎరుగదు. ఒకచీర మెడచుట్టూ వేసుకొని ఇంకొకచీర చేతిలో పట్టుకొని నిలుచుంది. ఆమె అవస్థ ను చూశాడు రామచంద్రుడు. తానే స్వయంగా తనప్రియసతికి ఆమెకట్టుకున్న పట్టువస్త్రం పైననే నారచీర చుట్టబెట్టాడు.
.
ఆయన చక్కగా చీరచుడుతుంటే ఆవిడ ఆనందంగా చుట్డించుకొన్నది. వారి వదనాలలో కించిత్తు బాధకానీ, ఆక్రోశముకానీ, మోసపోయామే అని వేదనకానీ లేదు. వనవిహారానికి(వనవాసము) సిద్ధమయినట్లుగా సిద్ధమయ్యారు మువ్వురూ.
ఈ దృశ్యము చూసేవారి కన్నులలో గిర్రున నీరు తిరిగింది!
Also read: సీతారాముల సంభాషణ
అసూర్యంపశ్య! ఎండకన్నెరుగని ఇల్లాలు. రాజకుమారి! కనుసన్నలలో వందలకొద్దీ పరిచారికలు(Retinue of servants at her beck and call). ఏ రోజుకారోజు మేలుపట్టువస్త్రాలు తప్ప మామూలు వస్త్రములే ఎరుగని ఆవిడ నారచీరలు కట్టవలసి వచ్చినది కదా!
విధిచేసే వింతలు దాని క్రూరత్వము అందరి మనసులలో బాధను రగిలించాయి. ఒక్కసారిగా గొల్లున ఏడ్చారందరూ.
అందరూ రాముడితో ఇలా అన్నారు.
‘‘రామా సీతను వనవాసానికి వెళ్లమని ఎవరుచెప్పారు? నీవూ లక్ష్మణుడు వెళ్ళిరండి! సీత ఇక్కడే ఉంటుంది. సీతను చూస్తూ నిన్ను చూసినట్లే అనుకొని ఆనందంగా ఉంటాము నాయనా!’’ అని అంటూ ఉంటే!
వసిష్ఠులవారిక ఉండబట్టలేక పోయారు. కైకను తీవ్రపదజాలంతో దూషించారు.
అతిప్రవృత్తే దుర్మేధే కైకేయీ కులపాంసని
వఞ్చయిత్వా చ రాజానం న ప్రమాణే అవతిష్ఠసి.
న్యాయమార్గంలో నడవకుండా రాజును మోసం చేసావుకదనే. కులఘాతకీ. దుర్బుద్ధీ. అడ్డూఅదుపులేక ప్రవర్తించేదానా! సీతమ్మ వనమునకు వెళ్లవలసిన పని ఉన్నదా?
( సీతమ్మకు కూడా నారచీర తెచ్చి ఇచ్చింది కదా. ఆవిడ కోరిక మేరకు రాముడొక్కడే వెళ్ళాలి. మరి లక్ష్మణునకు, సీతమ్మకు కూడా సిద్ధం చేసి ఉంచి వారు అడుగగనే తెచ్చి ఇచ్చింది. ఇక్కడే ఆవిడ దుర్బుద్ధి బయటపడింది).
Also read: రామునికి లభించిన కౌసల్య అనుమతి
వూటుకూరు జానకిరామారావు