రామాయణమ్ – 58
చిన్నపిల్లల ముద్దుముద్దు మాటలు మన హృదయానికి ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయో సీతమ్మపలుకులు కూడా అంతే ఆహ్లాదకరంగా ఉన్నాయి అనుసూయామాతకు.
సీతమ్మపెళ్ళిముచ్చట్లు చెప్పించుకొని సంబరపడిపోయింది ఆ మహాసాధ్వి.
‘‘అమ్మా సీతా! నీవు ప్రతి అక్షరము స్పష్టముగా, ప్రతిపదమును మధరంగా పలికి నన్ను సంతోషపెట్టావే బంగారుతల్లీ. చాలా బాగుందమ్మా!
Also read: సీతారామలక్ష్మణులకు అత్రి, అనసూయల ఆతిథ్యం
‘‘ఇక రాత్రి అవుతున్నది పక్షులన్నీ తమతమగూళ్ళు చేరుకొంటున్నాయి. నేనిచ్చిన వస్తువులు అలంకరించుకొని రాముడి వద్దకు ఇక వెళ్ళమ్మా’’ అని అనగా సీతమ్మ అట్లే చేసి ఆమెకు శిరస్సు వంచి నమస్కరించి రాముని వద్దకు వెళ్ళింది.
అనసూయామాత ఇచ్చిన ఆభరణములు, వస్త్రములు ధరించి నూతనశోభతో కనపడుతున్న తన రమణి సీతను చూడగనే రాముడి హృదయంలో మధురభావనలు పులకలెత్తాయి.
Also read: రాముడి పాదుకలతో చిత్రకూటం నుంచి అయోధ్యకు బయలుదేరిన భరతుడు
మనుష్యులలో ఎవరికీ దక్కని గౌరవము తన భార్యకు దక్కినందుకు చాలా సంబరపడిపోయాడు రామయ్య.
ఆ రాత్రి గడిచింది. తెల్లవారగనే అగ్నిహోత్రము పూర్తి చేసుకొని ఉన్న మునులందరూ సీతారామలక్ష్మణులకు వీడ్కోలు పలికారు.
అరణ్యములోనికి ప్రవేశించుచున్న వారికి ఎన్నో జాగ్రత్తలు చెప్పారు వారు. రామా చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా.
ఈ అడవిలో నరమాంసభక్షకులైన రాక్షసులు వివిధ రూపాలలో సంచరిస్తూ ఉంటారు. రక్తము త్రాగే క్రూరమృగాలు ఎన్నో ఉన్నాయి.వాటిని జాగ్రత్తగా తప్పించుకొని వెళ్ళు’’ అని అరణ్యములోనికి వారు వెళ్ళిరావడానికి నిత్యము ఉపయోగించే మార్గాన్ని చూపించారు.
Also read: తండ్రి ఆజ్ఞ అమలు కావలసిందేనన్నరాముడు
అందరికి నమస్కరించి బయలుదేరిన సీతారామలక్ష్మణులు దట్టమైన మబ్బులలో దూరే సూర్యుడిలాగా ఆ అడవులలో ప్రవేశించారు.
ఈ రోజుతో అయోధ్యకాండ సమాప్తము
శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః
Also read: జాబాలిని చీవాట్లు పెట్టిన రాముడు, వశిష్టుడి సాంత్వన వచనాలు
వూటుకూరు జానకిరామారావు