Saturday, December 21, 2024

రాముడితో అడవికి వెళ్ళడానికి సీతాలక్ష్మణులు సిద్ధం

రామాయణమ్ – 30

రామా! కులమునకు కళంకము తెచ్చే సామాన్య స్త్రీ ని కాను నేను. నీవు తప్ప మరొకరిని మనస్సుచేత కూడా చూడను.

స్వయంతు భార్యాం కౌమారీమ్ ….నేను నీ భార్యను. యవ్వనములో ఉన్నదానిని. భార్యను ఇతరులకు అప్పగించి జీవించువాడివలే నన్నిక్కడ వదిలేసి వెళతావా? నీవు ఎవరి హితము గురించి మాటలాడుతున్నావో నీవే వారికి విధేయుడిగా ఉండు.  నేనెందుకుండాలి? నేనెవరికీ ఇచట విధేయురాలిగా ఉండవలసిన అవసరములేదు. అసలు అవి అయుక్తమైన మాటలు.

నీవుండే చోటు నాకు స్వర్గము. నీ సాన్నిధ్యము లేకపోతే నాకేదీ రుచింపదు.

Also read: సీతారాముల సంభాషణ

మార్గంలో ముళ్ళు ఉంటాయంటావా. అవన్నీ నాకు దూదితో సమానము. పెనుగాలులు రేగి దుమ్ము కప్పి వేస్తుందంటావా? నీ ప్రక్కన ఉంటే అదే నాకు మంచిగంధమవుతుంది రామా!

వనములలో పచ్చికబయళ్ళమీద పడుకుంటే చిత్రమైన కంబళ్ళు కప్పిన పడకలకంటే సుఖము రామా! నీ ప్రక్కన ఉంటే ప్రపంచంలో ఏదయినా నాకు అత్యంత సుఖకరమైనవే. నన్ను నీవు ఇక్కడనే శత్రువుల పరంచేసి వెడతానంటే మాత్రము ఈక్షణమే, ఇప్పుడే విషంతాగి చావనయినా చస్తాను కానీ వైరులవశం మాత్రంకాను.

నీవు అంతకాలం కనపడకపోతే దుఃఖంతో ఎప్పుడో ఒకప్పుడు చావవలసినదానినే.  ఆ చావు ఇప్పుడే నన్ను వరించనీ’’ అని ఏడుస్తూ తనను కౌగలించుకొన్న సీత చుబుకము ఎత్తిపట్టి మెల్లగా ప్రేమగా అనునయిస్తూ ‘‘నీవులేకుండా నేను మాత్రం ఒక్కక్షణమైనా ఉండగలనా? నీ అభిప్రాయము తెలుసుకొకుండా నేను నిన్ను అడవికి ఎలా తీసుకెళతాను? ఆత్మాభిమానము కలవాడు తన కీర్తిని ఎలా విడువజాలడో ఆవిధముగా నేను నిన్ను  విడువజాల.

సీతా ! పితృవాక్పాలనము నా ధర్మము! సీతా, తల్లికి, తండ్రికి లొంగి ఉండటమే ధర్మము. అలాంటి ధర్మాన్ని విడిచి నేను జీవించను. కనపడే దేవతలు తల్లీ, తండ్రీ, గురువులు! అలాంటి వారిని విడిచి మనకు అందుబాటులో లేని దైవాన్ని ఆరాధించటమెందుకు?

అస్వాధీనమ్ కధం దైవమ్ ప్రకారైరభిరాధ్యతే

స్వాధీనమ్ సమతిక్రమ్య మాతరం పితరం గురుమ్!

‘‘తల్లి, తండ్రి, గురువులు ముగ్గురూ మూడులోకములు వీరితో సమానమైన వారు ఈ భూలోకంలో లేరు! అందుకే వారి సేవ చేయవలెను. తండ్రి సేవను మించిన బలకరమైనది ఏదీ లేదు! తండ్రి ఆజ్ఞ పాటించుటవలన మనిషికి సకలైశ్వర్యములు సమకూరగలవు. నా తండ్రి ఆజ్ఞ పాటించాలని, ఆయన ఇష్టానికి అనుగుణంగా నడుచుకోవాలనీ నేను కోరుకుంటున్నాను. ఇదే సనాతన ధర్మము. సీతా నీవు నాకు సహధర్మచారిణివి. నీవు నాకూ, నీకూ మేలుకూర్చే మంచి నిర్ణయము తీసుకొన్నావు. వెంటనే బయలుదేరదాము. నీ వద్ద ఉన్న విలువైన వస్తువులన్నీ దానం చేసెయ్!

Also read: రామునికి లభించిన కౌసల్య అనుమతి

ఇంతకు మునుపే రామాంతఃపురమునకు వచ్చిన లక్ష్మణుడు అన్నావదినల సంభాషణ అంతా విన్నాడు..

గుండెలు చెలమలయినాయి!

కన్నులు కన్నీటి జలపాతాలయినాయి!

 హృదయాన్ని వారి సంభాషణ కలచివేసింది!

దుఃఖము ఎలా ఆపుకోవాలో అర్ధం కాలా లక్ష్మణునకు.

ఉన్నపళంగా అన్న పాదాలమీద వ్రాలాడు.

అన్నా! నీ ముందు నేను నడుస్తాను.  నీ మార్గాలు నిష్కంటకం చేస్తాను. నీవులేని అయోధ్యలో నేనూ ఉండను.

అన్నా నీతో కలిసి ఉండటమా, దేవలోక ఆధిపత్యమా? ఈ రెండింటిలో ఏది? అంటే

 నీతో కలిసి ఉండి నీ సేవ చేసుకోవటమే నాకు ముఖ్యము.

అదే అన్నింటికన్నా ఎక్కువ నాకు.

తనతో కలిసి అడవికి వస్తానన్న తమ్ముని పరిపరివిధాలుగా వారించాడు రామచంద్రుడు!

 లక్ష్మణస్వామి పట్టిన పట్టు విడువడే. అదేమిటన్నా నీవు ఇంతకు పూర్వమే నాకు అనుమతి ఇచ్చావుగా అన్నా! ఇప్పుడిలా అంటున్నావేమిటి?

Also read: మర్యాదపురుషోత్తముడు రాముడొక్కడే!

(ఎప్పుడు అనుమతిచ్చాడు రాముడు? సీతాదేవితో సంభాషణ అంతా విన్నాడు లక్ష్మణుడు. అప్పుడు ఆయన భరతశత్రుఘ్నులతో బాగుండమని కదా చెప్పినది! లక్ష్మణుడి ప్రసక్తితేలేదక్కడ! అంటే లక్ష్మణుడు ఎక్కడుంటాడు? సదా రాముడితోటే! చిన్నతనం నుండే ఆయనకు అలవాటు అన్నతోటే ఉండటం.

అన్నకూ అదే ఊహ తమ్ముడు తననుండి వేరుకాదని.

కానీ ఈ సంకట సమయంలో కూడా రాముడు తమ్ముని తనతోటే అనుకుంటూ అలవాటు ప్రకారం మాట్లాడాడు. అది పట్టుకున్నాడు లక్ష్మణుడు ఇప్పుడు).

లక్ష్మణా ! నీవుకూడా నాతో వస్తే అమ్మకౌసల్యను, తల్లిసుమిత్రను చూసుకొనేదెవరు? వారి పోషణ భారం ఎవరు భరిస్తారు?

కామవశుడయిన తండ్రి ఇప్పుడు వారిని మునుపటిలా చూడగలడా? రాజ్యము హస్తగతమయిన వెంటనే సవతులను ముప్పుతిప్పలు పెడుతుంది కైక.

లక్ష్మణా నీవిచటనే యుండి తల్లుల యోగక్షేమాలు చూసుకోవాలి. అదే నేను కోరుకునేది.

అన్న రాముని చూసి లక్ష్మణుడు ‘‘అన్న! అమ్మ కౌసల్యను ఒకరు చూడాలా? ఆవిడ అధీనంలో వెయ్యిగ్రామాలున్నవి. మనలాంటి వారిని పదిమందిని పోషించగలదావిడ!

Also read: రాముడి మాట విని కుప్పకూలిన కౌసల్య

..

( Financial independence to women ఆ రోజులలో లేదని ఎవడన్నాడు?)

అమ్మ కౌసల్యకున్న ఆర్దికబలము వలన మన తల్లి సుమిత్రకు కూడా వచ్చిన లోటులేదు!

అన్నా నేను నీ అనుచరుడను.  నీ వెంటే నేనుంటా. నాకు తెలిసినది అదే.  నీవిక అడ్డు చెప్పక అనుమతింపుము.

ధనుర్బాణములు, గునపము, గంప చేతపుచ్చుకొని నీకు మార్గము చూపుతూ నీముందు నడుస్తాను. నీకు నిత్యము కందమూలపలములు, ఇతర అవసరములు సేకరించి నీకు సమకూర్చగలవాడను.

తమ్ముడి ప్రేమకు తలవంచాడు అగ్రజుడు. ‘‘సరే నీ మిత్రులవద్ద సెలవు’’ అని పంపించాడు!

Also read: తండ్రి ఆనతిని రాముడికి తెలియజేసిన కైక!

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles