Tuesday, January 21, 2025

రామలక్ష్మణుల యోగక్షేమములు అడిగి తెలుసుకున్న సీత

రామాయణమ్ 144

‘‘హనుమా, నీ పరాక్రమము శ్లాఘింపదగినది. అవలీలగా శతయోజన విస్తీర్ణముగల సంద్రమును లంఘించినావు. అది పెనుమొసళ్ళకు, భయంకరజలచరాలకు ఆలవాలము. నీ ముఖములో తొట్రుపాటుగానీ, జంకుగానీ రావణుడు ఆతని బలము, బలగము పట్ల భయము గానీ నాకు కనపడుట లేదు.

నీవు సామాన్యుడవు కావు సుమా! నాకు తెలుసు రాముడు నిన్ను పరీక్షించకుండా నీ సామర్ధ్యమేదో తెలవకుండా నిన్ను పంపడు గాక పంపడు. అందునా తన అంగుళీయకము ఇచ్చి మరీ పంపినాడు. రామలక్ష్మణులు ఇరువురూ క్షేమమే కదా? రాముడు క్షేమముగా ఉన్నచో సముద్రమువరకు వ్యాపించిన ఈ ధరాతలమును కాల్చివేయలేదేమి?

Also read: రాముడిచ్చిన అంగుళీయకము సీతమ్మకు సమర్పించిన హనుమ

శత్రువులమీద విజయము సాధించుటకు కావలసిన ప్రయత్నములన్నీ శ్రీరాముడు చేయుచున్నాడు కదా! మంచి మిత్రులను సంపాదించుకున్నాడా?

హనుమా, రామునికి నా మీద ప్రేమ ఏమీ తగ్గలేదు కదా? రామునకు స్నేహము విషయమున తల్లిగానీ, తండ్రిగానీ, మరి ఏ ఇతర వ్యక్తిగానీ నాతో సమానులు గానీ అధికులు గానీ లేరు. నా ప్రాణనాధుని గురించిన వార్తలు వినునంతవరకే జీవించవలెనని కోరుకొనుచున్నాను….అని పలికి సీతమ్మ హనుమంతుని సమాధానము కొరకై ఎదురు చూచెను.

(కొత్తచోటికి, అందునా బలవంతుడైన శత్రువుయొక్క స్థావరంలో ప్రవేశించినప్పుడు మామూలు వారికి, ఎంత గొప్పగూఢచారి అయినా సరే సహజంగా తొట్రుపాటు, భయము ఉంటాయి. అంతెందుకు, శత్రుస్థావరమే కానక్కరలేదు పూర్తిగా కొత్తప్రదేశము ఎవరూ తెలియని చోటుకు వెళితే మన పరిస్థితి ఏమిటి ఒక్కసారి ఆలోచించండి!…అదీ హనుమస్వామి అంటే!)

Also read: సుగ్రీవాజ్ఞ గురించి సీతకు చెప్పిన హనుమ

సీతమ్మ మాటలు విని శిరస్సుపై అంజలి ఘటించి వినయముగా ఆంజనేయుడు ఆమెతో  ఇట్లనెను.

‘‘తల్లీ నీవిచ్చట ఉన్నట్లు  రాముడు ఎరుగడు!  రామునికి నీ సమాచారం  తెలిసిన వెంటనే సమస్త వానర గణములు, భల్లూక సైన్యములు వెంటపెట్టుకొని ఇచ్చటకు రాగలడు. రాముని మార్గమునకు, ఆయన శత్రు నాశమునకు అడ్డు ఏది? సముద్రమును క్షోభింపచేసి మరీ దాటగలడమ్మా! నీవు లేక నిముసముకూడా నిదురించుటకు లేదు తల్లీ రామచంద్రుడు. వంటి మీద తేళ్లు, జర్రులు పాకినా ఈగలు ముసిరినా  వాటి స్పృహ ఏమాత్రము లేకుండా అనుక్షణమూ నీ నామ స్మరణము లోనే ఆయన కాలము వెళ్ళబుచ్చుతున్నాడు తల్లీ!

ఆయనకు ఏదో ఆలోచన. ఎడతెగని మథన. ఆయన

ఎదలో నీవే ఆయనఎదుటా నీవే సమస్తప్రకృతిలో నీవే. అంతెందుకు? ఆయన ఎటుచూసినా  అటు నీవే కనపడుతున్నావమ్మా! విరిసిన మొగ్గచూసినా కురిసే వానచూసినా మురిసే నా సీత  నా చెంత లేదే? ఇదే ఆయన చింత! ఆ రాకుమారుడు రాముడు నీవే లోకముగా బ్రతుకు తున్నాడమ్మా!

Also read: రాముడి గుణగణాలను వర్ణించిన హనుమ

రాముని బాధ తన బాధ ఒకటే అని తెలిసికొని శోకము, ఆనందము కలగలసి శరత్కాలప్రారంభములో మబ్బులో  దాగిన చందమామ ఉన్న రాత్రి వలె సీతమ్మ ఉండెను.

Also read: సీతమ్మతో హనుమ సంభాషణ

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles