Saturday, December 21, 2024

సీతమ్మ అగ్నిప్రవేశం

రామాయణమ్ 218

శత్రువుల శరీరాలను రాముడు తన బాణపు ములుకులతో తూట్లుపొడిచి రుధిరధారలు పొంగించుటయే చూసినాము.

కానీ ఈనాడు

సీతమ్మ మనస్సుకు గాట్లుపెట్టి తూట్లుపొడిచి ఇన్నాళ్ళూ రావణుని చెరలో ఏడ్చిఏడ్చి ఎండిన హృదయ కుహరము నుండి కూడా అశృధారలు ఉప్పొంగునట్లు చేసినాడా మేటివిలుకాడు!

 మునుపెన్నడూ వినని పలుకులవి!

Also read: రాముడి పలుకులకు బిత్తరబోయిన సీతమ్మ

పలుకులుకాదు!! పదునైనములుకులవి!

‘‘ఓ కోదండ రామా ! నీకో!

ఒక సామాన్యపురుషుడు సామాన్యస్త్రీతో పలికినట్లు ఇట్టి దారుణమైన మాటలా! నా స్వభావమెట్టిదో నీకు తెలియదా? నేను వివశనైయున్నప్పుడు ఆ దుర్మార్గుడు నా శరీరమును స్పృశించినాడు. ఇది కేవలము దైవఘటన ,నా మనస్సు సదా నీ యందే నిలచి ఉన్నది!

ఓ మానసంరక్షకుడా! ఇంతకాలము కలిసిమెలిసి అన్యోన్యముగా ఉండికూడా నేనెట్టి దాననో నీవు తెలిసికొనలేదంటే నా బ్రతుకెందులకు?..

భూమినుండి జనియించితిని జనకునికి లభించి ఆయన ఇంటపెరిగి, రఘువంశములో మెట్టినాను కదా! నా పుట్టుకకు, నీకు తెలిసిన నా నడవడికకు కూడా కించిత్తు గౌరవము ఇవ్వకపోయితివికదా!

Also read: రాముని సందేశము సీతమ్మకు వినిపించిన హనుమ

ఆ నాడే ఈ మాటలు హనుమతో చెప్పి పంపకపోయితివా నాడే నా ప్రాణములు త్యజించెడిదానను!

రామా! నీచే త్యజింపబడిన ఈ శరీరము నాకెందులకు?

లక్ష్మణా,  చితిని పేర్చవయ్యా! నా కష్టాలకు, కన్నీళ్ళకు ఆ చితియే పరమౌషధము!’’ అని సీతమ్మ గద్గద కంఠముతో కన్నీళ్ళు ఉప్పొంగగా సౌమిత్రి వైపు చూసి పలికెను.

ఈ సంఘటనలకు ప్రత్యక్షసాక్షిగా నిలుచున్న లక్ష్మణుడు అన్నవైపు తన క్రోధదృక్కులను ప్రసరింపచేసెను.

ఆ సమయములో రామచంద్రమూర్తి కాలుడా? యముడా?  సాక్షాత్తూమృత్యువా? అన్నట్లు కనపడినాడు.

ఆయన అంతరంగంలో ఒకటే ఊహ ఎవరేమన్నా అనుకోనీ! తన సీతకు కలిగిన అపవాదు తొలగిపోవలే! ఆమె ఎవ్వరో తనకు తెలుసు. తానేమిటో తనకు తెలియదా?

Also read: విభీషణ పట్టాభిషేకం

నా జానకి నిప్పు!

అగ్గినికూడా బుగ్గిచేయగల నిప్పు.

 అది ఇప్పుడు అందరికీ తెలియగలదు! ….తమ్ముని వైపు చూడలేదు! కానీ అన్న ముఖకవళికలను ఆ తమ్ముడు అర్ధము చేసికొనినాడు ..వెంటనే చితిని పేర్చినాడు!

ఆ సమయములో రామునిముఖము చూడతరమెవ్వరికీ కాలేదు. ప్రళయకాల వేళలో సంహారానికి బయలుదేరిన యమధర్మరాజువలె ఉన్నాడు. సమీపించ సాహసమెవ్వరూ చేయడంలేదు.

సీతమ్మ తలవంచుకొని తనభర్తకు ప్రదక్షిణము చేసెను. అటుపిమ్మట ప్రజ్వలించు అగ్నిశిఖలను సమీపించెను.

అగ్నిభట్టారకునకు నమస్కారము చేసి  ఇటుల పలికెను….

‘‘నా హృదయము రామునియందే స్థిరముగా యున్నచో లోకసాక్షి అగ్నిదేవుడు నన్ను రక్షించుగాక!

నా మనస్సు చేతగానీ, నా వాక్కు చేత గానీ, నా కర్మచేత గానీ ..ధర్మమూర్తి రామచంద్రుని అతిక్రమించకున్నచో లోకసాక్షి అగ్నిదేవుడు నన్ను రక్షించుగాక.

పంచభూతాలు, అన్ని సంధ్యలు, ఇతర దేవతలు నేను సచ్చరిత్ర కలిగినదానిని అని నమ్మిన ఎడల లోకసాక్షి అగ్నిదేవుడు నన్ను రక్షించుగాక.’’

Also read: మండోదరి విలాపము

అని పలుకచూ అగ్నికి ప్రదక్షిణము చేస్తూచేస్తూ హోమగుండములో జారిపోవు ఆజ్యధార వలే అగ్నిలోనికి ప్రవేశించెను.

సీతమ్మ అగ్నిప్రవేశమును సమస్త భూతములూ చూచినవి.

అక్కడ చేరిన సమస్త ప్రజానీకము అయ్యో, అయ్యో అంటూ బిగ్గరగా అరచిరి..

వారి హాహాకారములు వింటూ కన్నులనిండా నీరునిండగా రామచంద్రుడు ఒక్క క్షణకాలము ఆలోచించుచూ నిలబడిపోయెను.

ఇంతలో ఆకాశములో కలకలము చెలరేగెను.

ఇంద్రుడు తన విమానములో, పితృదేవతలతో కూడిన యముడు తన విమానములో, మహేశ్వర, బ్రహ్మ,ఆదిత్యులు తమతమ విమానములలో వచ్చి లంకానగర గగనతలమును హోరెత్తించిరి.

వారందరూ రాముని వద్దకు చేరిరి. రాముడు వారికి అంజలిఘటించి నిలిచెను.

వారందరూ రామునితో !

‘‘రామా, సర్వలోక కర్తవు,  జ్ఞానులలో శ్రేష్ఠుడవు, సర్వసమర్ధుడవు సీతమ్మ అగ్నిలో దూకుచుండగా ఎందుకు ఉపేక్షించినావు.

రామా నీ వెవ్వరవో తెలుసా?

వసువులలో ఋతుధాముడు అను వసువువు, ఇతర ప్రభువులు ఎవ్వరూ లేని ప్రజాపతివి

నీవు రుద్రులలో ఎనిమిదవ రుద్రుడవు.

సాధ్యులలో అయిదవవాడవు.

Also read: రావణుడి అంత్యక్రియలు చేయడానికి విభేషణుడికి రాముని అనుమతి

అశ్వినీ దేవతలు నీ చెవులు.

సూర్యచంద్రులు నీ నేత్రములు.

నీవు లోకములు పుట్టకముందూ ఉన్నావు. లోకములు అంతమయిన పిదపా ఉంటావు’’ అని పలికిన దేవతల పలుకులు విని ….రామచంద్రుడు …

ఆత్మానం మానుషం మన్యే రామం దశరధాత్మజం

సోహం యస్య యతశ్చాహం భగవంస్తద్బ్రవీతు మే….

నేను దశరధకుమారుడనైన రాముడను పేరుగల మానవుడను….నేను ఎవరివాడనో ఎందువలన ఇటుల ఉన్నానో భగవంతుడవైన నీవు చెప్పుము…..అని పలికెను.

Also read: రావణ సంహారం, విభీషణుడి విలాపం

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles